Saturday, 16 May 2015

//ప్రేమంటే//




//ప్రేమంటే//
అలౌకికమైనదే ప్రేమంటే..లోకానికి దూరంగా తీసుకుపోతూ..
నిర్వచనానికి అందని ఏకైక పదమనుకుంటా ప్రేమంటే..
అసంపూర్ణంగానే వదిలేసారందుకే కవులంతా దాని అంతు తేల్చలేకే..
నవరసాలు సైతం వెనుదిరిగాయి ప్రేమను తమలో కలుపుకోలేక..
వర్ణనకేమాత్రం అందనిదే ప్రేమభావమేమో..
అనుభవేద్యమైతే తప్ప రాయలేని మధురకావ్యమేనేమో ప్రేమ..
మనసంతా నిండిన చాలు విశ్వమంతా వివిధరంగులై శోభిల్లు..
పెదవులను సైతం తోసిరాజని కన్నుల్లో స్వచ్ఛమై వెలుగు..
ఏ పాత్రలో పోసినా తానై ఒదిగిపోతూ విభిన్నమైనదే ప్రేమ..
మానవాళికి దొరికిన అపురూప వరమే నిండుకుండంటి ప్రేమ..
తొలిపొద్దు సింధూరపు కిరణాలకెంత ప్రేమో..
మంచుతెరలను..కొబ్బరాకు సందులను చీల్చుకు పుడమిని తాకాలని..
నురగల తరగల కెరటాలకెంత ప్రేమో..
వెన్నెల్లో తణుకులీనే సైకతాన్ని ఉవ్వెత్తున తడమాలని..
ఒయారమై ఒంపులు తిరిగే నదీనదాలకెంత ప్రేమో..
బిరబిరా ప్రవహిస్తూ సాగరంలో మమేకం కావాలని..
మంద్రంగా వీచే పిల్లగాలులకెంత ప్రేమో..
ప్రకృతి అణువణువుకూ అనురాగామిచ్చి తాకాలని..
ఝుమ్మనే రాగాల గడుసరి తుమ్మెదలకెంత ప్రేమో..
ఊరించే తేనెలు దాచుకున్న పూకన్నెలను గ్రోలాలని..
ఏ దరినున్నా ఏకమై స్పందించే ఇరుహృదయాల దగ్గరతనమే ప్రేమ..
లేత గులాబీరేకుల పసిపాప అమాయకపు బోసినవ్వులే ప్రేమ..
సప్తపదుల ఇష్టరాగం ఆలపించే మనసు జంటజావళే ప్రేమ..
మలిసంధ్యల మునిమాపున వయసుని మరిపించే జ్ఞాపకమే ప్రేమ ..
అనుభవలేమితో ఆకర్షణను ప్రేమగా భ్రమిస్తూ కొందరు..
ఎదుటివారి బలహీనతను ఆసరా చేసుకొనే వలరాయుళ్ళు కొందరు..
అనుభూతిశూన్యంలో సరైన ప్రేమను గుర్తించలేక కొందరు..
తమకందలేదని ఎదుటివారికి దక్కనివని ఉన్మాదులు కొందరు..
ఏదేమైనా భగవంతుని అపూర్వప్రసాదమే ప్రేమ..
దాన్ని స్వీకరించి ఆనందమయం చేసుకోవాల్సిన నేర్పు మనది..
చివరిగా..ఎంతరాసినా ఇంకా ఏదో మిగిలి ఉండేదేనేమో ప్రేమ.. 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *