Saturday, 16 May 2015

//యుగాది సంబరం.. //




//యుగాది సంబరం.. //
ఆరుఋతువులను ప్రతిబింబించే సమ్మేళనమేగా ఉగాది
తలచినంతనే తీయనిరుచిని మాత్రమే మనసు పట్టుకుంటూ...
కలబోసి కూసాయి కోయిలలన్నీ
మన్మధనామ సంవత్సరమని మరింత హుషారుగా మైమురుస్తూ..
చిగురించాయి ఏకధాటిగా మావిచిగురులన్నీ
చెరుకురసాల మావిళ్ళు రాబోయేవసంతానికి విందులని ఊరిస్తూ..
పూసింది చెట్టంతా వేపపూత
చేదువాసన సైతం కమ్మగా పరిసరాల చుట్టూ ప్రసరిస్తూ..
తలలూచుతూ అరవిరిసాయి సుమబాలలు
వసంతరాణికి అసమాన పుప్పొడి నెత్తావులను అద్దేస్తూ..
గోపికలై ఎదురుచూపులు కన్నెలంతా
రసేశ్వరుడు తమను ఏలుకొనే తరుణమొచ్చిందని ఊహిస్తూ..
చిగురుపచ్చకోక కట్టింది ప్రకృతి
నిండుగా ప్రవహించు సరోవరతీరాలలో మెండుగా స్నానించి..
ఒయారమై వచ్చేసింది వసంతం
మన్మధుడే మేనాలో వచ్చి తనను వరిస్తాడని భావిస్తూ..
ఏకరాగం ఆలపించాయి ఋతువులన్నీ
కొత్తాశలు రేకెత్తించే వసంతమంటే తమకెంతో ప్రియమంటూ..
పరవశిస్తోంది తాపసి హృదయం
అలంకృతమైన ఆమని అందాన్ని మౌనంగానే ఆస్వాదిస్తూ..smile emoticon

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *