Saturday, 16 May 2015

//అమ్మ//




//అమ్మ//
పౌర్ణమి కాకుండానే సిరివెన్నెల కురిసింది..
గొంతు విప్పకుండానే సరిగమలు ఆమె మనసులో..
కోయల కూయకున్నా వసంతమయ్యిందట..
ఆమె జీవితంలో అత్యంత ప్రియమైన అద్భుతం మరి..
ఒడి నిండిన సౌభాగ్యవతి..
ఆమె అమ్మయ్యింది ఆ రోజు..
ఒక్కసారిగా ఆమె ప్రపంచం మారిపోయింది..
తన సంసారపు రసాత్మక రాగాలాపన ఫలించినందుకు..
ఒక మహోన్నత ఆవిష్కారం జరిగిందని..
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ నడయాడే సృష్టికర్త అమ్మే..
లావణ్యాల లతికే నాటి వరకూ
తన సహజ సౌకుమార్యాన్ని తృణంగా తోసిపుచ్చి అమ్మయ్యింది..
ఒక జీవికి ప్రాణం పోసేందుకు ఆమె పడ్డ వేదన వర్ణనాతీతం
నీకు రంగులలోకం చూపేందుకు ఆమె కన్నీటినే తాగిందేమో..
అక్షరాలకు అతీతమైన బాషలో నిన్ను లాలించి..
ఎంత పెద్ద హోదాలో ఉంటేనేమి ఆమె..
ఉత్తమోత్తమ తల్లిగా తన బాధ్యతనెప్పుడూ మరువలేదుగా
నీ చేయి పట్టుకు నడిపించినందుకేమో..
నువ్వెంత ఎదిగినా తన కొంగుపట్టుకు తిరిగే అమ్మకూచిగానే చూస్తుంది..
అందుకే అమ్మకేదీ సమానమూ కాదు..సాటి రాదు..
ఒక్కరోజు స్మరించుకుంటే తీరే బాధ్యత కాదు అమ్మంటే..
నిత్యమూ అమ్మను ఆరాధిద్దాం..ఆమె ప్రేమను సగమైనా తిరిగిద్దాం..
ఈ వృద్ధాశ్రమాలకి విరాళాలు మాత్రమే ఇద్దాం..
అమ్మను విరాళంగా ఇచ్చే నికృష్టపు ఆలోచనను సైతం ఖండిద్దాం..
ఎవ్వరవునన్నా కాదన్నా మనసులో మహోన్నత స్థానమెప్పుడూ అమ్మదే.

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *