Tuesday, 19 May 2015

//పసి'వాడి'న ప్రాయం//





//పసి'వాడి'న ప్రాయం//

వెతుకుతున్నా ఆ కన్నుల్లో జీవాన్ని..
ఉపనయనాలు అడ్డొస్తుంటే ఏం కనిపించిందని..
మొన్నటిదాకా చిలిపికలలు దోబూచులాడిన కళ్ళే అవి..
నేడు మేధావితనం..
పెద్దరికాన్ని సంతరించుకొని లోకాన్ని సరికొత్తగా చూస్తున్నట్లు..
ఇంతా చేసి వాడి వయసు పదేళ్ళు..

రెండున్నరేళ్ళకే వాడేదో కావిడి మోయాలన్నట్లు..
ఉన్నపళంగా అక్షరాభ్యాసం చేసి బలవంతంగా బళ్ళో వేసేసి..
అమ్మఒడి కమ్మదనాన్ని పూర్తిగా అనుభవించకుండానే..
వాడి ఒళ్ళో పుస్తకాలకట్టలు పడేసి..
పలక పట్టకుండానే కంప్యూటర్ క్లాసులు..
కలం కదపకుండానే ప్రాజెక్ట్ వర్కులు..
ఎంత క్రమశిక్షణో వాడికి..
గడియారమే లిప్తపాటు విస్తుపోయి ఆగేట్టు..
భంగపడిందేమో బాల్యం సైతం..
పసిప్రాయపు ఆటపాటలు ఆవిరయ్యాక..
వేసవికీ దిగులొచ్చెనేమో..
మనవల కేరింతల్లో వయసు మరచే మామ్మాతాతల అడియాశల్లో..

శిక్షణా శిబిరాలు 'శిక్ష'గా మారాయి..
బాంధవ్యాలను సైతం బడికే తీసుకొచ్చి కట్టేస్తుంటే..
ఏ కార్మీకులకు తీసిపోయారు వారు..
కన్నవారి ఆశల పోరాటంలో సమిధలుగా మారాక..
చిట్టికన్నుల్లో కలలేం మిగిలాయిక..
అవసరాలు మార్పుని నిర్దేశిస్తూ..మనుషులే కీలుబొమ్మలుగా మారాక..frown emoticon

Monday, 18 May 2015

//యంత్రం నుంచీ జీవితంలోకి//




//యంత్రం నుంచీ జీవితంలోకి//
యంత్రమేనేమో అతను..
వేయికోట్ల సంపాదన..
తినేది పరిమితాహారమే..నిదురపోయేది ఐదుగంటలే..
కేవలం డబ్బును పెంచడానికే ఉన్నాడేమో..
అంతులేని సంపాదనపరుడనిపించుకోవాలని కోరికో..
సుఃఖసంతోషాలను లెక్కించక అపరకుబేరుడితో పోటీ పడుతూ..
మనిషిలా బ్రతికితే బాగుండేదని అనిపించలేదేమో..
నిదురలేస్తే మోసం, ద్వేషం కలగలిసిన వ్యాపారాలు..
నిముషం కాలు నిలవని ప్రయాణాలు..
కుటుంబానికి వెచ్చించలేని సమయాలు..
ఎక్కడుంది సంతోషమని తడుముకుంటే..
నిత్యం భార్యపెట్టుకొనే నగల్లో కానరాలేదు..
ఏడాదికోమారు పిల్లలతో విలాసంగా గడిపే విహారయాత్రలో లేదు..
మిత్రులతో కలిసి తేలియాడిన విందువినోదాల్లో అసలే శూన్యం..
ఒక్కసారిగా ఆగినట్టయ్యింది పరుగు..
గుండు దెబ్బ తిన్న పక్షిలా అనారోగ్యం వాతమై కమ్మాక..frown emoticon
మనిషిలా బ్రతికితే బాగుండని అనిపించిందేమో
అలవి మాలిన సంపాదనకై పాకులాడటం వ్యసనమని తెలుసుకున్నాడేమో..
ఉత్ప్రేరకమై ఎగిసిందో ఆలోచన సమాజశ్రేయస్సు దిశగా..
కూర్చొని తిన్నా తరగని డబ్బేగా..
కూడూ..గుడ్డా..గూడూ లేనోళ్ళకి సాయపడాలని..
మానసిక ప్రశాంతతను మూటకట్టుకోవాలని..
బాధితులకు ఆపన్న హస్తం అందించాలని..
శాంతి సంతోషాలను చవిచూడాలని..
మనిషిగా మారడతడు..
సరికొత్త చివురులతో మొలకెత్తి..ఆంతరంగిక స్థాయిని సంస్కరించుకొని..
ఎందరో ఆశలకు కరదీపికై నిలవాలని సంకల్పం చేసుకొని..!!

Saturday, 16 May 2015

//అదే విలువ//





//అదే విలువ//
ఎలా కుదిరిందో వారికి..
మృదుల మధుర మంజుల తన్మయ దరహాసం ఆమెది..
కర్ణకఠోర భయంకర వికట్టాట్టహాసం అతనిది..
వసంతరాగాల వినీల గమకాల సంకీర్తన ఆమెది..
తుఫాను గాలుల విషాదహోరుల సంగీతం అతనిది..
సీతాకోకలోని రంగులను వెతికే భావుకత ఆమెది..
ఊసరవెల్లి రంగులను ఆరాతీసే మనస్తత్వం అతనిది..
ఉషోదయపు తొలికిరణాల స్పర్శకు వెచ్చబడిన తుషారబింధువామె..
హేమంత పున్నమిరాతిరికి ఘనీభవించిన బండరాయతను..
హృదయంగమమైన పరిష్వంగములో ప్రణయానందం ఆమెది..
నరనరాల్లో పోటెత్తే రుధిరప్రవాహాపు పెనుగులాట అతనిది..
ఉరుకుల పరుగుల గలగల గోదారి వయ్యారం ఆమెది..
నాచుపట్టి నిలిచిపోయిన సరస్సులోని నిశ్చలం అతనిది..
తేజస్సులో కరిగిపోవాలని ఆమె..
నీడల్లో నిలిచిపోతే చాలని అతను..
అర్థనారీశ్వరులమని ఆనందపడమంటాడు..
తనకిష్టమైన గబ్బిలాలకంపు ఆమె సంపెంగతో సరిపడదంటూనే

//మనీషి//



//మనీషి//

సంకుచితమే మనిషి..
సాటి మనిషి దగ్గరకొచ్చేసరికి
కృత్రిమమేగా..విశ్లేషించే కొద్దీ మనస్తత్వమంతా
ప్రేమ, ప్రశంస, గుర్తింపు, ఆదరణ..
ఎదుటివారిని మాయ చేసే ఆకర్షణమంత్రాలు కావుగా..
జీవితానికి ఆసరా ఇచ్చే మానసిక అవసరాలు..
వాటిని మనమెంత స్వచ్ఛంగా ఆశిస్తామో ఎదుటివారికిస్తే కదా
పదింతలై తిరిగొచ్చేది..
ఎదుటివాడు నచ్చలేదని నిందిస్తాడు..
ఎంతసేపూ వాడిలో నచ్చని గుణాలనే తలపోస్తూ..
గుర్తించడెందుకో మరి..
ప్రతిమనిషిలోనూ మంచి ఉంటుందని..
దాన్ని తీసుకుంటే జీవితం తేలికవుతుందని
తనకోసం వంగిన వ్యక్తిత్వాన్ని సైతం గుర్తించక
మంచితనాన్ని చేతకానితనంగా అభివర్ణించుకుంటూ..
తనలో తానే తృప్తి పడుతూ..
అదొక ఆడంబర మనస్తత్వమేమో..
ఎవరేమనుకుంటారోనని నీతిగా బ్రతికేస్తూ..?!
తప్పు చేసే ధైర్యం లేకనో..అవకాశం రాకనో..
మొత్తానికి ఒప్పుగా కనిపిస్తూ..
తన నమ్మకాలు వేరనుకుంటాడు
అనుభవానికొచ్చినప్పుడు వాస్తవానికి మారిపోతూ..
ప్చ్...నిరోధించలేకున్నా భావతీవ్రతని.
వాస్తవిక ధోరణి ఖండించలేని నిస్సహాయతను..
అందుకే అన్నరేమో..
వ్యక్తులందు విశిష్ట వ్యక్తులు వేరయా అని..frown emoticon

//అమ్మ//




//అమ్మ//
పౌర్ణమి కాకుండానే సిరివెన్నెల కురిసింది..
గొంతు విప్పకుండానే సరిగమలు ఆమె మనసులో..
కోయల కూయకున్నా వసంతమయ్యిందట..
ఆమె జీవితంలో అత్యంత ప్రియమైన అద్భుతం మరి..
ఒడి నిండిన సౌభాగ్యవతి..
ఆమె అమ్మయ్యింది ఆ రోజు..
ఒక్కసారిగా ఆమె ప్రపంచం మారిపోయింది..
తన సంసారపు రసాత్మక రాగాలాపన ఫలించినందుకు..
ఒక మహోన్నత ఆవిష్కారం జరిగిందని..
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ నడయాడే సృష్టికర్త అమ్మే..
లావణ్యాల లతికే నాటి వరకూ
తన సహజ సౌకుమార్యాన్ని తృణంగా తోసిపుచ్చి అమ్మయ్యింది..
ఒక జీవికి ప్రాణం పోసేందుకు ఆమె పడ్డ వేదన వర్ణనాతీతం
నీకు రంగులలోకం చూపేందుకు ఆమె కన్నీటినే తాగిందేమో..
అక్షరాలకు అతీతమైన బాషలో నిన్ను లాలించి..
ఎంత పెద్ద హోదాలో ఉంటేనేమి ఆమె..
ఉత్తమోత్తమ తల్లిగా తన బాధ్యతనెప్పుడూ మరువలేదుగా
నీ చేయి పట్టుకు నడిపించినందుకేమో..
నువ్వెంత ఎదిగినా తన కొంగుపట్టుకు తిరిగే అమ్మకూచిగానే చూస్తుంది..
అందుకే అమ్మకేదీ సమానమూ కాదు..సాటి రాదు..
ఒక్కరోజు స్మరించుకుంటే తీరే బాధ్యత కాదు అమ్మంటే..
నిత్యమూ అమ్మను ఆరాధిద్దాం..ఆమె ప్రేమను సగమైనా తిరిగిద్దాం..
ఈ వృద్ధాశ్రమాలకి విరాళాలు మాత్రమే ఇద్దాం..
అమ్మను విరాళంగా ఇచ్చే నికృష్టపు ఆలోచనను సైతం ఖండిద్దాం..
ఎవ్వరవునన్నా కాదన్నా మనసులో మహోన్నత స్థానమెప్పుడూ అమ్మదే.

//ప్రేమేనంటావా//



//ప్రేమేనంటావా//
గుర్తున్నానా..
నిన్నల్లో విడిచిన నేను మనసులో ఉన్నానా
సమాథి చేయడం కష్టం కాదులే నీ మనసుకి
వద్దనే చెప్పానుగా పెదవులతో ప్రేమించొద్దని..
ఔనన్న మనసును కళ్ళలో నింపుకొని..
పెదవులంటే ఇష్టమంటూనే..
కళ్ళను చదివాయే నీ చూపులు..
మనసంతా నువ్వేనన్నావుగా..
మల్లెలను తలలో తురిమినట్లే..ఆనందాన్ని తనువులో నింపావు..
నీ చూపులశరాలెంత పదునుగా తాకాయో..
నవ్వుల నెలవంకను నా పెదవులిట్టే జార్చేట్టు
ఆప్యాయతంటే తెలిసిందప్పుడేగా..
తొలిసారి నా అరచేతిని నువ్వు ముద్దాడినప్పుడు
అనురాగమూ పరిచయించిందప్పుడే..
నా నుదుట సింధూరాన్ని నీ పెదవులద్దినప్పుడు
నీ నామకోటితోనేగా నా మదిని తపోవనం చేసావు..
ఏమయ్యింది ఇంతలోనే..
నిమీలిత నయనాల్లో వేదం చదివానంటూనే నిర్వేదం మిగిల్చావు..
వెలుతురులో కలిసి ప్రయాణం చేయిస్తానని చీకట్లో నన్ను విడిచావు
ఒంటరితనమంటే ఎరుగని నన్ను ఏకంగా ఏకాకిని చేసావు..
షడ్రుచుల మనసుకు అరుచిని అలవాటు చేసావు
ఏ అనుభూతి లోపం జరిగిందో..
.అయస్కాంతమంటి నువ్వు అలవోకగా దూరమయ్యావు..
మరుజన్మలో తోడుంటానని మాటైతే ఇచ్చావుగాని..
నీ తలపుల సహజీవనం చాలనిపిస్తోంది ఈ జన్మకి..!!

//సస్మిత//



//సస్మిత//

పారిపోవాలనుందామెకి..
అతని నుంచి దూరంగా..
ఎంతదూరమని పోగలదు..అంచుల్లేని నరకంలో పయనమాయే..
నిస్సత్తువ ఆవహిస్తుంటే..తడబడుతూ..
తన వెనుక సమాజం అనుసరించి వస్తుంటే..
అరే..ఎక్కడ మారింది సమాజం..
ఆమె ఏం చేస్తుందో చూడాలనే కుతూహలం ఎక్కువవుతుంటే..
వెనుకే వేగంగా వస్తోంది..
అదీ కాక తనదాకా వస్తే గాని తెలిసిరాని సలహాలిస్తూ..
సహజంగానే స్త్రీ అణగదొక్కబడుతుందిగా సమాజంలో.
ఆర్ధికంగా..నైతికంగా..మానసికంగా..శారీరకంగా..
కానీ కాపాడుకోవాలిగా..ఆమే ఒక భాగమేగా సమాజంలో..
అందుకే...
గెలవాలనుకుంది ఆమె..
రచ్చ గెలిచైనా తన ఉనికిని మిగిల్చుకోవాలని..
తనకో అస్తిత్వం ఉందని నిరూపించుకోవాలని..
ఆమెకో వ్యక్తిత్వం..అభిప్రాయముందని చెప్పాలని..
మాట్లాడుతూనే ఉంది..
ఆమెలో ఆమె అంతరంగంతో అనుసంధానమవుతూ..
ఆమె సమస్యను అంతకన్నా పెద్ద సమస్య ఉన్నవారితో పోల్చుకొని సర్దిచెప్పుకుంటూ..
ఆమె తన కుటుంబానికో మూల స్తంభమని గుర్తుచేసుకుంటూ..
ఇంకా పరిణితి చెందని జీవితంలో పూర్తిగ నష్టపోలేదని గ్రహించిందేమో..
మనుషులతో కలిసి మృగాళ్ళు తిరిగే జనారణ్యంలో..
మరో సానుభూతికై వెతికితే ఎదురుదెబ్బ కాగలదని తలపోస్తూ..
మనసులో చోటివ్వకున్నా జీవితంలో చోటిచ్చి మనుగడ సాగించాలనుకుంటూ..
జీవిత రహస్యం సరికొత్తగా తెలుసుకున్న వాసంతికై అడుగులేస్తూ..
తెలియని దేవుని కన్నా తెలిసిన దెయ్యాన్ని మార్చుకొనే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ..!!

//మధ్యతరగతి మందస్మిత//



//మధ్యతరగతి మందస్మిత//
ఎవరి తొందరపాటైతేనేమి..
ఆమె బ్రతుకుపై చెరపలేని మరకలు పడ్డాక..
ఆపై నమ్మకాలతో పనేముంది..
ఒక్కసారి జరగకూడనికి జరిగిపోయాక..
క్షణక్షణం అడుగు తడబడుతూనే ఉందిగా..
జీవితాన్ని ముందుకు సాగనివ్వక..వెనుకడుగేయనివ్వక..
వెంటాడిన ప్రేమను వరించి..
వాగ్దానాలతో పెళ్ళాడి..
నచ్చవలసిన వారికి తప్ప అందరికీ నచ్చుతూ..
ఓడిందిగా మెప్పించలేక అయినవారిని..
ఎన్ని ఉత్తమాభిరుచులుంటేనేమి..అతనికామె రుచించనప్పుడు
శక్తివంతమైన నాయికైతేనేమి..అతడికామె బానిసైనప్పుడు..
కనిపించే సృష్టికర్తని ఒప్పుకుంటేనేమి..సూటిపోటి మాటలామెకి కొదవకానప్పుడు..
అవమానభంగాల బెదిరింపుల కాపురం..ఈసడింపుల జీవితం..
నేత్రాంచాలాల్లో నిత్యమూ నీరే..అనుభూతిలేని అనుభవాల సెలయేళ్ళ ఆనవాళ్ళు..
పోదామంటే పుట్టిల్లూ లేదూ..ఆదరించే అత్తిల్లూ లేదు..
చేయని నేరానికే చెంపదెబ్బలూ..
అతని అనుమానపు జబ్బులో ఆమె అనారోగ్యం పాలవుతూ..
వేదభారతాన్ని విన్న చెవులే..వేదనాసాగరాన్ని పళ్ళ బిగువున భరిస్తూ..
అసహ్యమంటూ సాధించే చేతల్లో నలుగుతూ..
సగభాగమైనందుకు అతని అభిమానానికి సహకరిస్తూ..
కన్నీటి ప్రశ్నలెన్నో ఆమె మదిలో..
ఆడదానిగా పుట్టడమే శాపమనిపిస్తూ..
తన అవసరం ఎవరికుందనే ఆలోచనలు..
సమాధానం లేని నిస్సారమైన రహస్య ప్రహేళికలు..!!

//హర్షం కాని వర్షం//




//హర్షం కాని వర్షం//
ప్రకృతినై పరవశించానొకనాడు..
నాకు తలంటు పోయడానికొచ్చిన వానజల్లని..
ఆనందమై నర్తించానాడు
నాలో తొలివలపును పరిచయించిన తేనెతుంపర్లని..
మధురస్మృతుల విషాదాలే నేడు
నీ తలపుల్లో నన్నన్వేషించడం కుదరక
అవ్యక్తమైన నిశ్శబ్దమౌనాలీనాడు
అర్థాంతరమై నా జీవితంలోంచీ నిష్క్రమించాక
మేఘమాల కురిపించిన అంజలై చేరింది వాన
నిర్జీవమైన అనుభూతిని బతికించాలనేమో
ఎంత తడిపితేనేముంది..
కరగని శిధిలశిల్పమయ్యాక నేను..
అందరికీ వర్షమో ఆనందం కావొచ్చు
నాకు మాత్రమో కన్నీటి జ్ఞాపకం
రంగులు చెదిరిన వర్ణచిత్రమై నే మిగిలినందుకు..
ఎవరికీ అర్థంకాని ఆబ్స్ట్రాక్టులా మారినందుకు..!!

//సంద్రానికి ఆవల//




//సంద్రానికి ఆవల//
ఆకాశమెందుకో బాధపడుతోంది..
నక్షత్రాలు పాడే వెన్నెల పాటకి ఆనందించక..
సముద్రపుఘోష వినపడలేదననుకుంటూ..
తనకై చేయి చాచే సముద్రుడ్ని హత్తుకులేనందుకు..
సముద్రమంటే తెలియని ఆపేక్షెందుకో ఆకాశానికి..
ఆకాశాన్ని కడిగిన వానలు కల్మషాన్ని సముద్రానికి పంపగా
తాను చీదరించుకోక చేరదీసిందనో..
గాఢాంధకారంలో సముద్రుని గుసగుసలు తాను విన్నందుకో..
ఉత్తుంగమై పొంగినప్పుడు నురగలనవ్వులు తానే మొదట చూసేదనో..
అయితే ఆకాశానికి సముద్రుని సంగతి తెలీదుగా..
సముద్రానికెంత గర్వమో..
వయ్యారాల నదులన్నీ తనలోనే వచ్చి చేరతాయని..
చెలియలకట్ట దాటే అవకాశముంటే తానే ఎదురేగి పొంగేనని..
ఆకాశాన్ని..గాలితరంగాల తన్మయత్వాన్ని సైతం..
తానల్లుకోవాలనే అత్యాశ సముద్రుడిదని....
పున్నమిరేయి నాడు సైతం గమనించలేదేమో ఆకాశం..
ఉవ్వెత్తునెగిసే సంద్రం దృష్టి తనపై ఉందని
రహస్యంగా తన హృదయాన్ని దొంగిలించే ఎత్తు వేసిందని..
అనుమతినైనా కోరక తనలో చేరే చొరవ చేసేదని..
నిజంగానే ఆకాశం, సంద్రం కలిస్తే సృష్టి శూన్యమవునని..!!

//విశ్వకవి//




//విశ్వకవి//
భావకుడే ఆ విశ్వాత్ముడు..
పాపాయి నవ్వు, చిన్నారి పువ్వు..
సెలయేటి గలగల, గువ్వల కువకువ..
విరించి విరహాలు, అంతర్నిహిత వేదనలూ..
అన్నీ కలగలిపి ఆవిష్కరించాడుగా..
తన హృదయాన్ని కరిగించి రాసిన భావనలనేమో..
మన కంట ఆనందాశ్రువుల చినుకు వానలు..
ఆనందరాగం మనసంతా ఉరకలేస్తుంది..
యుగాంతరాల సమ్యోగక్షణాలు దగ్గరైనట్లు..
హృదయాంతరంగపు ఆవేదన మధురమవుతుంది..
అతని స్వాప్నిక జగత్తులో ఓలలాడుతుంటే..
నవవసంతంలో వేణుగానం వినిపిస్తుంది..
నిశ్శబ్ద నీరవంలో నిద్దురనుండి మేల్కొల్పుతూ..
జీవితానికి చైతన్యం పరిచయమవుతుంది..
అతని వెలుగుబాటల గుండా ప్రయాణిస్తే..
అందుకే అతను 'విశ్వకవి' అయ్యాడు..
యేళ్ళు గడచినా స్మరణీయుడయ్యాడు..!!

//గాజుల సవ్వళ్ళు//


మన తెలుగు మన సంస్కృతి నిర్వహించిన చి త్ర క వి త – 84 పోటీ - గాజులు – లో ప్రథమ విజేతగా నిలిచిన కవిత:
//గాజుల సవ్వళ్ళు//

రసమయవర్ణాల గాజులు..రమణీయమైన గాజులు
పారాడే పాపాయి నుంచీ పెద్ద ముత్తయిదువ వరకూ
ప్రాణంగా ప్రేమించే ప్రియమైన గాజులు
రంగేదైనా రీతేదైనా ఆకర్షించే గాజులు
రవ్వల గాజులు..రతనాల గాజులు..
మువ్వల గాజులు..ముత్యాల గాజులు..
మనసును దోచే తళుకులీను మట్టిగాజులు..
మనసుకు వారథులేగా ఆమె గాజులు..
అలుకను మాట్లాడ్తూ..అతడి అనునయాలకు కరుగుతూ
హృదయపు సరిగమలౌతూ గలగల గమకమవుతూ
నిరంతర సవ్వడులౌతూ..మౌనాన్నన్నువదించే ఏకాంతాన..
మురిపాల రవాలౌతూ..సగపాల రాగాల సంగీతాన..
అమ్మతనానికి తోడవ్వాలనే సీమంతానికి గాజులు
ఊహతెలిసిన పాపాయికీ ఆటవస్తువేగా గాజులు
మొదటనోట పెట్టేవేగా అమ్మచేతి గాజులు
పసుపుకుంకుమల్లోనూ ప్రథమమందుకే గాజులు
తాంబూలానికి సాయమై నిత్యమూ జతపడుతూ
సౌభాగ్య చిహ్నాలనేగా గాజులు
బతికినంతకాలం వెన్నటి ఉండాలనే కోరికలు..!!

//భూకంపం//


మన తెలుగు మన సంస్కృతి నిర్వహించిన చిత్ర కవిత – 85 - భూకంపం పోటీ లో ద్వితీయ విజేతగా నిలిచిన కవిత:

//భూకంపం//
ఒక్కసారిగా వెన్నుపూసలో ఒణుకు మొదలయ్యింది
ఆ వార్త చెవిన పడినంతనే, కళ్ళారా వీక్షించినంతనే..
ఎటుచూసినా ఆర్తనాదాలు..ఛిద్రమైన బతుకులు
ఆకలికేకలు, చావుకేకలూ మిళితమయిపోయి
ఎన్నడూహించని, కనీవినీ ఎరుగని ప్రకంపనలంటే..
రాతిపొరల్లో ఏ సర్దుబాట్లు జరిగాయో
ఉపరితల గనుల పైభాగాలు కూలాయో
రెప్పపాటులో పెను విధ్వంసం..విస్పోటం
మానవతప్పిదాలు కూడా కొన్ని కారణాలేమో..
పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనను
ప్రజాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టడం..
విచక్షణారహితంగా చెట్లను నరకడం
అనాలోచితంగా ఖనిజ తవ్వకాలు చేపట్టడం
విచ్చలవిడిగా నదులకడ్డంగా ఆనకట్టలు కట్టదం..
ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ప్రజ కళ్ళు తెరవాలి
చిత్తశుద్ధితో భవననిర్మాణాలు చేపట్టాలి
ఖచ్ఛితమైన మార్గదర్శకాలు పాటించి
ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భవనాలు కట్టాలి..
ముందుతరాలకు స్వేచ్ఛావాయువును అందించాలి..
భావిపౌరులకు సురక్షిత జీవనాన్నివ్వాలి...! 30.04.15

//నెరవెన్నెల//




//నెరవెన్నెల//

విజృంభిస్తోంది వెన్నెల
చుక్కలపూలతో ఆకాశాన్ని అలంకరించి..
అసమాన కాంతితో పున్నమికి పరిమళమందిస్తూ
మురిసే మనసులకి మంచిగంధం అలదేస్తూ..
చంద్రకాంత శిలలను సైతం మెత్తగా కరిగిస్తూ..
వెన్నెల వర్షం కురిసినందుకేమో
నీలిమబ్బుల కాటుకకరిగి పుచ్చపువ్వులు వికసించాయి..
వాడిన కేసరాలు చిగురించాయి
మరందపు విందుకు తుమ్మెదలనూ ఆహ్వానించాయి
నేను సైతం పున్నమి పువ్వుగా మారిపోయా..
రాతిరి రాగానికి పులకించిన కలువనై..
అయినా మనసు దాహం తీరినట్లు లేదు
ఏ వైశాఖ విరహంలో వేగుతోందో మనసు
అవ్యక్తమైన అమృతపు జల్లు కురుస్తూనే ఉంది
అరక్షణమైన నా పెదవంచున నిలవాలనే కాబోలు..!!

//హోలీ - వసంతవినోద కేళి//





//హోలీ - వసంతవినోద కేళి//
నూతనవత్సరాన్ని స్వాగతించు పున్నమిపండుగ రథోత్సవం
గడచినయేటికి వీడ్కోలుపలికే వేడుకైన వార్షికోత్సవం
మురిపాల చిన్నికృష్ణుని యశోద ఊయలలూపిన డోలోత్సవం
హోలికాదేవి 'ధుండి'ని దునిమాడిన శుభఘడియ హోలికోత్సవం..
ప్రియమైన రాధకు ప్రేమరగులద్దిన రసేశ్వరుని ప్రేమోత్సవం
ప్రకృతి దరహాసాల మురిసిన మధుమాసాల ప్రణయోత్సవం
కామునిపై శంకరుడు త్రినేత్రం గురిపెట్టి గెలిచిన విజయోత్సవం
మనసునిండుగా ప్రవహించు ఆనందరసార్ణవ మహోత్సవం
మనసుకెంతో ప్రీతికరమైన మధువనాల రసోత్సవం
సరిగంగస్నానాల మన్మధ మకరందాల మదనోత్సవం
ప్రకృతికాంత పగడాలచివురుల పైటనలంకరించు వన్సంతోత్సవం
మొగ్గతొడుగు చిలిపిఆశల విరులతొలకరుల ఆనందోత్సవం
సహస్రవర్ణాలు వజ్రవైఢూర్యాల వెలుగును తోసిరాజన్న రంగోత్సవం
ప్రేమికులొకరిపై ఒకరు కురిపించు ప్రేమజల్లుల చిలిపోత్సవం
జూకామల్లెతీవెలపై మృదుపవనాల సన్నని ప్రణవనాదోత్సవం
వేయివేణువులు అందెలరవళుల ఇరుసంయోగ రాగోత్సవం..
అరమరికలూ అసమానతలెరుగని సహృదయుల చెలిమోత్సవం
ఎదురుచూపుల నిరీక్షణాక్షణాలు ఫలించిన మధురోత్సవం
వయసు మరచిన మనసు వరదై సాగిపోవు క్రీడోత్సవం
మరలిరాని అనుభూతులను మది ప్రోదిచేసుకొను దివ్యోత్సవం..
ఆమనిసొబగుల పచ్చని పంటచేలతో రైతుకు హరితవర్ణోత్సవం
వేపవృక్షాల తెల్లనిపూవులు నడిరేయి నయనాలకు నేత్రోత్సవం
మొగ్గవిచ్చు మురిపాల ప్రేమకవిత మౌనవించిన వలపోత్సవం
మల్లెగాలి అల్లరికి మండుటెండలు చల్లనైన వెన్నెలోత్సవం
పున్నమివెన్నెల పోగులకద్దే పువ్వులపుప్పొడి హసితోత్సవం
సన్నని కాటుకకన్నుల నవ్వులు నిశీధి దివ్వెల దీపోత్సవం
కలహవివాదాలు విషాదవైషమ్యాలు మరచిపోమనే సందేశం
సంతోషసంబరాలు రంగుల హరివిల్లులైన స్వరజతుల సమ్మేళనం..

//ప్రేమంటే//




//ప్రేమంటే//
అలౌకికమైనదే ప్రేమంటే..లోకానికి దూరంగా తీసుకుపోతూ..
నిర్వచనానికి అందని ఏకైక పదమనుకుంటా ప్రేమంటే..
అసంపూర్ణంగానే వదిలేసారందుకే కవులంతా దాని అంతు తేల్చలేకే..
నవరసాలు సైతం వెనుదిరిగాయి ప్రేమను తమలో కలుపుకోలేక..
వర్ణనకేమాత్రం అందనిదే ప్రేమభావమేమో..
అనుభవేద్యమైతే తప్ప రాయలేని మధురకావ్యమేనేమో ప్రేమ..
మనసంతా నిండిన చాలు విశ్వమంతా వివిధరంగులై శోభిల్లు..
పెదవులను సైతం తోసిరాజని కన్నుల్లో స్వచ్ఛమై వెలుగు..
ఏ పాత్రలో పోసినా తానై ఒదిగిపోతూ విభిన్నమైనదే ప్రేమ..
మానవాళికి దొరికిన అపురూప వరమే నిండుకుండంటి ప్రేమ..
తొలిపొద్దు సింధూరపు కిరణాలకెంత ప్రేమో..
మంచుతెరలను..కొబ్బరాకు సందులను చీల్చుకు పుడమిని తాకాలని..
నురగల తరగల కెరటాలకెంత ప్రేమో..
వెన్నెల్లో తణుకులీనే సైకతాన్ని ఉవ్వెత్తున తడమాలని..
ఒయారమై ఒంపులు తిరిగే నదీనదాలకెంత ప్రేమో..
బిరబిరా ప్రవహిస్తూ సాగరంలో మమేకం కావాలని..
మంద్రంగా వీచే పిల్లగాలులకెంత ప్రేమో..
ప్రకృతి అణువణువుకూ అనురాగామిచ్చి తాకాలని..
ఝుమ్మనే రాగాల గడుసరి తుమ్మెదలకెంత ప్రేమో..
ఊరించే తేనెలు దాచుకున్న పూకన్నెలను గ్రోలాలని..
ఏ దరినున్నా ఏకమై స్పందించే ఇరుహృదయాల దగ్గరతనమే ప్రేమ..
లేత గులాబీరేకుల పసిపాప అమాయకపు బోసినవ్వులే ప్రేమ..
సప్తపదుల ఇష్టరాగం ఆలపించే మనసు జంటజావళే ప్రేమ..
మలిసంధ్యల మునిమాపున వయసుని మరిపించే జ్ఞాపకమే ప్రేమ ..
అనుభవలేమితో ఆకర్షణను ప్రేమగా భ్రమిస్తూ కొందరు..
ఎదుటివారి బలహీనతను ఆసరా చేసుకొనే వలరాయుళ్ళు కొందరు..
అనుభూతిశూన్యంలో సరైన ప్రేమను గుర్తించలేక కొందరు..
తమకందలేదని ఎదుటివారికి దక్కనివని ఉన్మాదులు కొందరు..
ఏదేమైనా భగవంతుని అపూర్వప్రసాదమే ప్రేమ..
దాన్ని స్వీకరించి ఆనందమయం చేసుకోవాల్సిన నేర్పు మనది..
చివరిగా..ఎంతరాసినా ఇంకా ఏదో మిగిలి ఉండేదేనేమో ప్రేమ.. 

బాపు మళ్ళీ పుడితే..




బాపు మళ్ళీ పుడితే..
నవసమాజంలో జరుగుతున్న అరాచకాలకు ఆక్రోశిస్తాడు
మానవ శ్రేయస్సుకు తిలోదకాలిచ్చి మరణించిన మానవతకు సిగ్గుపడతాడు
సశ్యశ్యామల భారతాన్ని ఊహించిన ఊహలు
తలక్రిందులైనాయని తల్లడిల్లుతాడు..
నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం
ముక్కలైన భారతాన్ని చూసి ముక్కోపి అవుతాడు
పట్టెడన్నం కోసం కన్నబిడ్డల్ని
అమ్ముకుంటున్న తల్లిదండ్రుల్ని చూసి తలక్రిందులవుతాడు
అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగులు వేస్తున్నా
అబలలపై ఆకృత్యాలకు ఆగ్రహిస్తాడు
మగాళ్ళ రూపంలో ఉన్న మృగాళ్ళను వేటాడేందుకు
హింసను వీడిన తను ఆయుధం పడతాడు..
పదవుల కోసం హత్యా రాజకీయాలను
అనుసరించే వారిని చూసి హతాశుడవుతాడు
శిలాఫలకాలపై ముద్రించిన శాసనాలు
శిధిలమయ్యాయని తెలిసి శిలైపోతాడు..
వైషమ్యాలను మరచి ఒకటిగా బ్రతకమన్న తన మాట
ఉప్పునీటి మూటగా కరిగిందని తెలిసి కన్నీటిపర్యంతమవుతాడు
జనోద్ధరణ కోసం ఎన్నోసార్లు కటకటాలపాలైన బాపు
నపుంసక నాయకుల కోట్ల మూటలు దాచి
నిర్లజ్జగా తిరుగడం చూసి తను సిగ్గు పడతాడు..
చిత్తశుద్ధి లేని చిత్తకార్తే కుక్కల్లా కోట్లాడుకుంటున్న
పెద్ద మనుషులను చూసి చేష్టలుడిగి నిలబడతాడు
శాంతి అహింసాలు నిరాయుధుడైన బాపు
ప్రతీదానికి దొమ్మీలు, లూటీలు, సమ్మెలు చూసి విస్తుపోతాడు
అందుకే బాపు నా విన్నపం
ఇవన్నీ చూసి నీకంట కన్నీరు తప్పదు
ఈ కలికాలంలో రామరాజ్యం చూడాలనుకోకు
మళ్ళీ జన్మించి చావుని కొనితెచ్చుకోకు...!!
నవసమాజంలో జరుగుతున్న అరాచకాలకు ఆక్రోశిస్తాడు
మానవ శ్రేయస్సుకు తిలోదకాలిచ్చి మరణించిన మానవతకు సిగ్గుపడతాడు
సశ్యశ్యామల భారతాన్ని ఊహించిన ఊహలు
తలక్రిందులైనాయని తల్లడిల్లుతాడు..
నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం
ముక్కలైన భారతాన్ని చూసి ముక్కోపి అవుతాడు
పట్టెడన్నం కోసం కన్నబిడ్డల్ని
అమ్ముకుంటున్న తల్లిదండ్రుల్ని చూసి తలక్రిందులవుతాడు
అన్ని రంగాల్లో స్త్రీలు ముందడుగులు వేస్తున్నా
అబలలపై ఆకృత్యాలకు ఆగ్రహిస్తాడు
మగాళ్ళ రూపంలో ఉన్న మృగాళ్ళను వేటాడేందుకు
హింసను వీడిన తను ఆయుధం పడతాడు..
పదవుల కోసం హత్యా రాజకీయాలను
అనుసరించే వారిని చూసి హతాశుడవుతాడు
శిలాఫలకాలపై ముద్రించిన శాసనాలు
శిధిలమయ్యాయని తెలిసి శిలైపోతాడు..
వైషమ్యాలను మరచి ఒకటిగా బ్రతకమన్న తన మాట
ఉప్పునీటి మూటగా కరిగిందని తెలిసి కన్నీటిపర్యంతమవుతాడు
జనోద్ధరణ కోసం ఎన్నోసార్లు కటకటాలపాలైన బాపు
నపుంసక నాయకుల కోట్ల మూటలు దాచి
నిర్లజ్జగా తిరుగడం చూసి తను సిగ్గు పడతాడు..
చిత్తశుద్ధి లేని చిత్తకార్తే కుక్కల్లా కోట్లాడుకుంటున్న
పెద్ద మనుషులను చూసి చేష్టలుడిగి నిలబడతాడు
శాంతి అహింసాలు నిరాయుధుడైన బాపు
ప్రతీదానికి దొమ్మీలు, లూటీలు, సమ్మెలు చూసి విస్తుపోతాడు
అందుకే బాపు నా విన్నపం
ఇవన్నీ చూసి నీకంట కన్నీరు తప్పదు
ఈ కలికాలంలో రామరాజ్యం చూడాలనుకోకు
మళ్ళీ జన్మించి చావుని కొనితెచ్చుకోకు...!!

నేనే ప్రకృతి....




నేనే ప్రకృతి....
చూసే కళ్ళకు మనసుంటే ప్రతీ దృశ్యమూ ప్రకృతి చిత్రమే..
స్పృశించే చేతులే నీకుంటే ప్రతీ అణువూ సౌందర్యమే..
సూర్యోదయమే స్ఫూర్తిదాయకం గమనానికి తొందర పడమంటూ..
పక్షుల కిలకిలరావాలే మధురనాదాలు మదిని మేల్కొల్పుతూ..
ఉషోదయపు సుప్రభాత సన్నాయిలే అలౌకికానందం అందిస్తూ..
ప్రకృతికెన్ని రూపాలో హరివిల్లు హంగులనూ అలదేసుకుంటూ..
అరవిరిసినపువ్వుల చిలిపి చిగురుల చెలిమి వసంతము..
వేసవిగాడ్పుల నిట్టూర్పుల శారదరాత్రుల మల్లెలు గ్రీష్మము..
శ్రావణసంధ్యల తొలకరి మెరుపుల మేఘాలు కురిపించిన వర్షము..
ఉదయం నులివెచ్చగా రేయిన చల్లని వెన్నెలస్నానాల శరత్తు..
ఘనీభవించిన తుషారపు గాలుల సొగసులీను హేమంతం ..
జీవితపు చరమాంకపు మజిలీ సూచిస్తూ ఆకులు రాల్చే శిశిరం..
ప్రతీరుతురాగానికీ ఒక మధురిమ షడ్రుచుల సమ్మేళనంలా..
గొబ్బిళ్ళమీద తంగెడపూలది అందమే..గోదారిపై వెండిజరీ.. అందమే..
బంగారుతీవెల వీణానాదం ..పసిపాపాయి గారాల రాగం.. ప్రియమే..
పుచ్చపువ్వుల చల్లని వెన్నెలలూ..చంద్రకళలు ఆసాంతమూ.. ఆనందమే
పున్నాగ నాదస్వరాలూ ..పూలలో మకరందపు వాగులూ.. ప్రియమే
ఉన్నత శిఖరాల గంభీరమూ..అనంత విశాల లోయలూ.. అందమే
కన్నులపండుగే ప్రకృతి పచ్చదనం మనసున నిండిన వెచ్చదనం
ఇన్నాళ్ళూ ప్రకృతీ.. నేనూ.. వేరనుకున్నా..
మమేకమయ్యాకే తెలిసింది..ప్రకృతంటే నేనని..నేనే ప్రకృతినని..
కనుకనే ప్రకృతి సమతుల్యం పాటిద్దాం..
వన్య ప్రాణులను బ్రతకనిద్దాం..
సంరక్షించుకుందాం ప్రకృతిని..
మనకు ఊపిరినందించే ప్రాణవాయువుని..
రుతుసౌరభాలను ఆస్వాదిద్దాం..జీవనం సస్యశ్వామలం చేసుకుందాం..
చూసే కళ్ళకు మనసుంటే ప్రతీ దృశ్యమూ ప్రకృతి చిత్రమే..
స్పృశించే చేతులే నీకుంటే ప్రతీ అణువూ సౌందర్యమే..
సూర్యోదయమే స్ఫూర్తిదాయకం గమనానికి తొందర పడమంటూ..
పక్షుల కిలకిలరావాలే మధురనాదాలు మదిని మేల్కొల్పుతూ..
ఉషోదయపు సుప్రభాత సన్నాయిలే అలౌకికానందం అందిస్తూ..
ప్రకృతికెన్ని రూపాలో హరివిల్లు హంగులనూ అలదేసుకుంటూ..
అరవిరిసినపువ్వుల చిలిపి చిగురుల చెలిమి వసంతము..
వేసవిగాడ్పుల నిట్టూర్పుల శారదరాత్రుల మల్లెలు గ్రీష్మము..
శ్రావణసంధ్యల తొలకరి మెరుపుల మేఘాలు కురిపించిన వర్షము..
ఉదయం నులివెచ్చగా రేయిన చల్లని వెన్నెలస్నానాల శరత్తు..
ఘనీభవించిన తుషారపు గాలుల సొగసులీను హేమంతం ..
జీవితపు చరమాంకపు మజిలీ సూచిస్తూ ఆకులు రాల్చే శిశిరం..
ప్రతీరుతురాగానికీ ఒక మధురిమ షడ్రుచుల సమ్మేళనంలా..
గొబ్బిళ్ళమీద తంగెడపూలది అందమే..గోదారిపై వెండిజరీ.. అందమే..
బంగారుతీవెల వీణానాదం ..పసిపాపాయి గారాల రాగం.. ప్రియమే..
పుచ్చపువ్వుల చల్లని వెన్నెలలూ..చంద్రకళలు ఆసాంతమూ.. ఆనందమే
పున్నాగ నాదస్వరాలూ ..పూలలో మకరందపు వాగులూ.. ప్రియమే
ఉన్నత శిఖరాల గంభీరమూ..అనంత విశాల లోయలూ.. అందమే
కన్నులపండుగే ప్రకృతి పచ్చదనం మనసున నిండిన వెచ్చదనం
ఇన్నాళ్ళూ ప్రకృతీ.. నేనూ.. వేరనుకున్నా..
మమేకమయ్యాకే తెలిసింది..ప్రకృతంటే నేనని..నేనే ప్రకృతినని..
కనుకనే ప్రకృతి సమతుల్యం పాటిద్దాం..
వన్య ప్రాణులను బ్రతకనిద్దాం..
సంరక్షించుకుందాం ప్రకృతిని..
మనకు ఊపిరినందించే ప్రాణవాయువుని..
రుతుసౌరభాలను ఆస్వాదిద్దాం..జీవనం సస్యశ్వామలం చేసుకుందాం.

//లక్ష్యం//




//లక్ష్యం//
చేయక తప్పదు పోరాటం..
నీ జీవితానికో లక్ష్యముందని నువ్వనుకుంటే..
ఎదురీదక తప్పదు గెలవాలంటే..
అత్మవిశ్వాసంతో లోపాన్ని అధిగమించాలంతే..
నడవాలి సంఘర్షణ పునాదిపై ఒక్కో అడుగేస్తూ..
రేపటి ఊహలకోట కట్టడమై ఎదురు నిలిచేవరకూ
కెరటమే ఆదర్శమై ముందుకు సాగాలి..
గెలవాలనే పట్టుదలే మనసులో ఉప్పొంగుతూ
ఆలోచించక విడిచిపెట్టాలి ఆనందమివ్వని వర్తమానాన్ని..
భవిష్యత్తుకై కనే బంగారు కలలోనే నిజముందంటూ..
అప్పుడే ముందున్నవారూ..వెనకున్నవారూ కనపడక లక్ష్యం నీదవుతుంది...
మబ్బుల వెనుక దాగున్న ఆకాశం నిచ్చనేయకనే నీకందుతుంది...

బాల్యం బంగారమా?!





బాల్యం బంగారమా?!
ఏమో..
బాల్యం బంగారమే కొందరికి..
కేవలం సుఃఖపడేందుకే పుట్టినట్లు..
అయినింటికి వారసుల రూపంలో..
ఆటపాటల ఆత్మీయస్పర్శకు మూలమవుతూ..
కొందరు పని చేయడానికే పుట్టారేమో..
బాలకార్మికుల రూపంలో..అస్తిపంజిరమంటి ఆకారంతో
కట్టు బట్టకీ..తినే తిండికీ కరువై..
రెక్కాడితే గానీ డొక్కాడని పేద బతుకులు..
నవసమాజ నిర్మాతలంట వారు..
దారిద్ర్యరేఖకు దిగువున స్వయంపోషక చిన్నారులు..
మట్టికొట్టుకుపోయి మాసిన దేహంతో..
వయసుకి మించి బరువు మోస్తున్న పసి(ని)వారు
పొలాల్లో నలిగిపోతూ కొందరు..
ఖార్ఖానాల్లో మగ్గిపోతూ కొందరు..
ఇటుకులబట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తూ కొందరు..
చీకటిగనుల్లో మసిబారుతూ కొందరు..
వస్త్ర పరిశ్రమల్లో కట్టుబానిసలు కొందరు..
ఆఖరుకి అవయవవ్యాపారానికీ ముడి సరుకుగా కొందరు..
సమస్య ఉన్నచోటే పరిష్కారమూ ఉంటుందిగా..
నాగరిక సమాజం తప్పును సరిదిద్దాలిగా
పిల్లలకు సురక్షిత జీవనం అందించాలి
పసివారిని చదువుకొనే దిశగా ప్రోత్సహించాలి..
విద్యతోనేగా జీవితం ప్రకాశించేదని నచ్చచెప్పాలి
జీవితాన్ని మార్చే శక్తి చదువుకే ఉంది..
బుద్ధి వికసించే మార్గం విద్యతోనే ఉంది..
అందుకే చేతనైన చేయూతనిద్దాం మనం..!

//కమనీయ కల్యాణం//





//కమనీయ కల్యాణం//
ఆ కల్యాణం కమనీయం కావాలంటే..
అమావస్యచంద్రుడ్నైనా ఇరువురూ కలిసి చూడగలగాలి
కదిలే చిరుగాలి ఊసులైనా కలిసి వినగలగాలి
చెరోదరినీ నిలబడ్డా తలపులవారథి కలిపి ఉంచాలి
ఆమె అభిరుచిని అతను మెచ్చాలి
అతని అభిప్రాయాన్ని ఆమె నచ్చాలి
ఆమె సంపెంగి గంథాన్ని అతను ఆఘ్రాణించాలి
అతని మొగలి పరిమళాన్ని ఆమె ఆస్వాదించాలి
నిరాసక్త లోయలు దాటాలి..
మౌనపర్వతాలుంటే నులివేడి వెన్నలా కరిగిపోవాలి..
నడుమ సమన్వయం రావాలి..సామరస్యం కావాలి
ఒకరికోసం ఒకరు కావాలి..
ఎవరికోసం వారైతే..స్త్రీ పురుష సమానత్వం ఎక్కడిది..
అందుకే..
వారు వ్యక్తిత్వంలో సైతం సమఉజ్జీవులు కావాలి
పరస్పరాలింగనంలో చల్లగాలికీ స్వేదం పట్టించాలి..

//సెల్ఫ్ మేడ్ జెలసీ//





//సెల్ఫ్ మేడ్ జెలసీ//
ఎందుకంతగా అతడ్ని ద్వేషించడం..
తనకన్నా ఉన్నతంగా ఉన్నందుకా..తనకన్నా ప్రత్యేకంగా కనిపించినందుకా
పదేపదే భూతద్దంలో చూసుకోడమెందుకు..
దానివల్ల తనలోని మంచిగుణాలు కూడా నల్లిఫ్హై అయిపోయి..
ఎదుటివాడు సహజంగానే డామినేట్ అయ్యేందుకా..
దూరమయ్యిందిగా వివేకమ్మొత్తం..
ఫ్రాంక్నెస్స్ ముసుగులో దాచుకోకుండా మాట్లాడినందుకు..
బాగా కించపరచినట్లు భావోద్వేగాన్ని వెదజల్లినందుకు..
అన్నీ తనకనుకూలంగా జరగాలంటూ ప్రవర్తించినందుకు..
అనవసరంగా అక్కర్లేని అసహనం ప్రదర్శించినందుకు..
మంచి బాంధవ్యం కాస్తా మసకబారిందిగా..
ఎవర్నని ఏం లాభం..
మన చేతివేళ్ళే ఒకేతీరుగా ఉండవనే సత్యం ఒప్పుకున్నట్లు,
ఎదుటివాడు తనలా ఉండనవసరం లేదని ఒప్పుకుంటూ..
సరిచేసుకుంటే సరిపోతుందిగా బలహీనత..
మంచి గుణాలను పాసిటివ్ గా తీసుకొని ప్రేరణ పొందవచ్చుగా...
ప్రేమతో అభినందించి హృదయంలో మరోమెట్టు ఎక్కవచ్చుగా
ఆత్మనిగ్రహం ప్రదర్శించి పరస్పర గౌరవానికి అర్హత పొందొచ్చుగా
మరో ముందడుగేసి మార్పుకి శ్రీకారం చుట్టవచ్చుగా
అనుబంధాన్ని మరింత బలోపేతం చేయవచ్చుగా
సెల్ఫ్ మేడ్ జెలసీని తనకుతానే జయించవచ్చుగా..!!

//ప్రహేళిక//






//ప్రహేళిక//
మరచిపోయాడేమో వాడు
సృష్టికి మూలబిందువు ఆమేనని
స్త్రీకి ప్రతిసృష్టి ఆమేనని..పురుషుడ్ని సృష్టించేదీ ఆమేనని
సింధువై బాధల్ని తనలో దాచుకొని ఆనందాన్ని మాత్రమే పంచుతుందని
ఉన్నతమైన విలువలను ఆవిష్కరించుకోవడంలో మేటని..
ఆమె ఓ వ్యక్తిత్వం, సామర్థ్యం కలిగిన అతివని..
కాలానికి పరిణామాలు సహజం కదా
అందుకే ఆమె ముఖంపై ముడతలు..
తన సుఖదుఃఖాలకు గుర్తులు
తన అనుభూతులకు ప్రతీకలు
తన ఉద్వేగాలకు సాక్ష్యులు
తన జీవితపు సారాంశాలు
ఎక్కడో మిగిలిన అందపు శిథిలాలు..
అందానికి నిర్వచనమిస్తాడెందుకో ఇప్పుడు..
మనస్థితిని బట్టీ అందానికి అర్థం మారుతుందని తెలియకనో
ఆనందం కలిగించే ప్రతీదీ అందమైనదని భావించకనో
చూసే కన్ను నల్లనిదైనా అదిచూసే అందాలన్నీ రంగులమయమని ఒప్పుకోలేకనో
సడలిన అందం బాధ్యతలను మోపిన సంఘర్షణల గాయాలని గమనించకనో..
అతనికి మాత్రం ముసలితనం రావొచ్చట..
భార్యగా ఆమెకెందుకు రాకూడదో అర్థంకాని అయోమయ ప్రశ్న..?!

//నా హస్తభూషణం//





//నా హస్తభూషణం//
అవినాభావ సంబంధమేగా మనది
మన పరిచయం ఈనాటిదా మరి
అక్షరస్పర్శ లేక మునుపే చేరావుగా
రంగురంగు పొత్తాల రూపంలో నన్ను
ఆనాడే నా బాల్యాన్ని మోసావుగా
కాగితపు పడువల ప్రయాణాల్లో..
అక్షరమాలను ఆవిష్కరించింది నీవేగా
రోజుకో అందమైన పదాన్ని నేర్పింది నీవేగా
విజ్ఞాన నవసమాజాన్ని పరిచయించి
నేటి నా సమున్నత జీవనానికి సాక్ష్యం నీవేగా
నాలో పఠనాశక్తి, రసాస్వాదనా పెంపొందించి
ఉత్తమాభిరుచి, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచింది నీవేగా
స్నేహితులమంటూ ఎంతమంది చేరారో జీవితంలో
నడిమథ్యలో నా చేయి విడిచారింకెందరో
అయినవాళ్ళు దూరమైనా నాకత్యంత ఆప్తం నీవేగా
ఆనాడూ, ఈనాడూ నాకోదార్పూ నీవేగా
నా భావాలు నీలో చూసుకున్నా..నా అనుభూతులు పంచుకున్నా..
తెలియకుండానే నన్ను ఆత్మీయమై పెనవేసుకున్నావుగా
నీవల్లనేగా ఎంతోమంది కవులను రచయితలను చదివిందే కాక
రాగాలనూ..సంకీర్తనలనూ నేర్చింది
అందుకేనేమో..
నాలుగురోజుల్లో వికసించి వాడిపోయే పువ్వులకన్నా
నిత్యమూ నన్ను తీర్చిదిద్దే నిన్నే ఆశిస్తాను..
వేరెవరికైనా బహూకరిస్తాను..
ఎన్ని మాథ్యమాలొస్తేనేమి
విశ్వవీక్షణానికి గవాక్షమై
యువతభవితకు మార్గదర్శమై
చిరకాలమూ చిరంజీవిగా నిలిచేది నీవేగా
అందుకే నీవెప్పటికీ నా ప్రియ నేస్తానివి..
నను వీడని నా హస్త భూషణానివి..!!

//. చిత్రిస్తున్నా//





1. చిత్రిస్తున్నా నిన్ను నయనంలో..
నిత్యబంధీని చేయాలని..
నా మసకైన కంటికి కలలు కరువయ్యాయని
2. ఏకకంటిధారకి కరిగింది కన్ను
సృష్టిస్తున్నానో కరగని నేత్రం
రెప్పలు మూసినా నా కన్నులు చదివే నీకోసం
3. మూసినరెప్పలకీ రంగేస్తున్నా
వేల ఇంద్రథనుస్సులను చూపాలని
నీ మనసుకు రంగోత్సవం చేయాలని..

// కవిత్వమంటే..//





కవిత్వమంటే..
సర్వజన రంజకమై ఉండాలి..
మనసుని ఆహ్లాదపరచాలి..కదిలించాలి
పామరులకు సైతం అర్థమైయ్యే రీతినుండాలి
ఆలోచింపజేసేదిగా ఉండాలి..
ఉద్వేగహృదయాన్ని శాంతింపజేయాలి
మేధావులనూ భావోద్వేగంలో ముంచాలి..
ఆడంబర మనస్తత్వాన్నీ స్పందింపజేయాలి
విమర్శకులను సైతం ఆకర్షించాలి..
వెరసి కవిత్వమంటే..మరోమారు చదవాలనిపించాలి..


//అభావం//




//అభావం//
ఆ నయనం నిస్తేజమే నిన్నటి వేదన రెప్పల్లో దాచిందనే
దిక్కులేని కన్నీటిస్రావాలు గుండె వెచ్చబడి కరిగినందుకే
ఆ పెదవుల్లో నిర్వేదమే మౌనవించి శూన్యాన్ని తాగిందనే
అనాదికాలపు ఆర్తి అంతఃపరిశీలనకు లక్ష్యమెరుగలేదనే..
వెతలన్నీ కథలే నిజాలన్నీ కలలంటూ మనసూహించిందనే
వసంతానికీ విరహమే ప్రతిఉదయం నిన్ను పాడుతుందనే
ఆ ప్రతీవాక్యమూ కవిత్వమే గుండెలోతుల్లోంచి రాసిందనే
ప్రతీ అక్షరంలోనూ ఆర్ద్రతే కవిత్వం పెల్లుబికి కురిసిందనే
ఆ ప్రతీపదమూ దాహమే అంతరంగ మథనంలో తేలిందనే
మనసుపొరల్లోనూ ఆవేదనే ఒక్కో చుక్కా సాహిత్యమై రాలిందనే
ఆ పరిమళమూ పవిత్రమే నిన్నుతాకి తెమ్మెరై వీచిందనే
మౌనమూ ఉల్లాసమే అంతర్నాద సంగీతానికి వివశమైందనే
భావకవిత్వమయ్యిందందుకే
అమలిన శృంగారభావనలో పుట్టిందనే..

//అక్షయతృతీయ//





//అక్షయతృతీయ//
వేదవ్యాసుడు భారతాన్ని లిఖించిన పవిత్రతిథి..
శివుని జటాఝూటం వీడి భూమిని పులకింపచేసిన పవిత్రగంగ ఉధ్భవం..
ఆరవ అవతారమైన పరశురాముని జన్మదినం
యుధిష్టిరుడు తన ధర్మవర్తనకు అక్షయపాత్రను అందుకున్న శుభదినం..
కుబేరుడు సర్వసంపదలకూ నాయకత్వాన్ని గెలిచిన మహోత్తరతిథి..
కామితఫలాలను అందించే దివ్య ముహూర్తం..
విశ్వైకనాధుడే విచ్చేసిన అన్నపూర్ణాదేవి జన్మదినం..
చేసిన మంచిపనికి అక్షయఫలాన్ని అందించే అద్భుతవరం
తలపెట్టిన లక్ష్యాలు విజయవంతం చేసే సుముహూర్తబలం..
అక్షయతృతీయ అర్థమెందుకో మారిందీ రోజుల్లో..
కనీసం కుండడు నీళ్ళను దానమివ్వని సామాన్యుల మనసుల్లో..
మగువల బంగారపు నాడిని పట్టిన షావుకారుల చేతుల్లో..
ధరలు ఆకాశాన్నంటినా ఆశను దగ్గరచేసే ప్రచార సాధనాల్లో..
అప్పుచేసైనా వీసమెత్తు కొనాలని ఆరాటపడే వెర్రి తలపుల్లో..

//మన్మథ(నామ) చమత్కారం//





//మన్మథ(నామ) చమత్కారం//
మన్మథుడంటే ఏమోననుకున్నా సుమా
ఎంత చిలిపివాడోననుక్కున్నా ఇన్నాళ్ళూ..
అంత ఉపకారని కూడా తెలుసుకున్నా ఈనాడు
ఏ భగ్నప్రేమికుడ్ని గెలిపించేందుకు కురిపించాడో అకాలవాన
ఏ వాసంతి విచిత్ర కోరికో..
వేసవందు హరివిల్లును చూడాలనుకుందో..
ఏకంగా చైత్రంలో శ్రావణాన్నే కోరిందో
ఎన్నడూ ఎరుగని స్వాతిజల్లులు వసంతంలో
నీరసమైన వేసంగిని అమాంతం శీతలం చేసి
అమృతం నిండిన వలపుజల్లులు కురిపిస్తూ
ఆ కిన్నెర మనసు రంజిల్లే ఉంటదేమో
మనసు చల్లబడే ఉంటదేమో..
తన అపరంజిప్రేమను అపరాజితై అందుకొనే ఉంటదేమో
అమెతో పాటు మరిన్ని దేహాలు తీర్చుకొనుంటాయి తమ హృదయతాపాలు..
ఎన్ని ఎదమయూరాలు నర్తించినాయో..
ఎన్ని తనువుల శ్రావ్యవీణలు మ్రోగుంటాయో..
తటిల్లతలా మెరిసిన మేఘరాగానికి తోడవుతూ..
మన్మథ చమత్కారానికి మురిసిపోతూ

//సాహితీ పండుగ//





//సాహితీ పండుగ//
విజయవంతమే సాహితీ పండుగ..
ఎటు చూసినా అక్షర హాలికులు
నలువైపులా అక్షర శిల్పులు..అలలారే వారి కళాఖండాలు
అక్షర సైనికుల లయ విన్యాసాలు..
అబ్బురపరచే సాహితీ ప్రసంగాలు..సమీక్షలు
మట్టిభాష కమ్మదనమేదో మదిని తాకుతూ
అంతరంగ దాహమేదో తీరినట్లు..
లయప్రాసల అలతిపదాల అల్లికలు
మనసును మాధుర్యమేదో మెలిపెట్టినట్లు
తియ్యందనాల ఆటవెలదులు..జానపదాలు
భాషా వైవిధ్యమూ పరిమళమూ కలగలిసినట్లు
మనోజ్ఞ సీమల్లో రసజ్ఞుల కోలాహలాలు
కావ్యకన్యక మనసువేదికపై నర్తించినట్లు..
ఆకాశమై విస్తరించింది కవిత్వం..
చైత్రపల్లకిలో అక్షరాలు ఊరేగినట్లు..
ఏ తేనెవాకలో పుట్టుకొచ్చాయో
తరాలు మారినా తీయదనం తగ్గని అక్షరాలన్నట్లు
మకరందబిందు బృందరస స్యందన
మందారమగు మాతృభాష అన్నట్లు..
సాహితీ ప్రేమికుల తపన కనిపెట్టినందుకేమో
ప్రచండమైన అరవిందుడు సైతం
కాస్త తొలగి..చిరుగాలికీ, చిరుజల్లుకీ చోటిచ్చి
వరుణదేవుని ఆశీర్వాద సహితం
సాహితీపండుగను జయప్రదం చేసెను.

//నువ్వెవ్వరో//







//నువ్వెవ్వరో//
అసలు గుర్తుందా నీ పేరైనా నీకు..
పెళ్ళికాక ముందు ఎంత గొప్పగా జీవించావని..
బడిలోనూ..గుడిలోనూ నువ్వేగా ఆకర్షణ..
కళాశాలలోనూ నీదేగా ప్రథమ ప్రతిభ..
అన్నిట్లోనూ ముందు నీవేగా ..
పెళ్ళయ్యాక..
ఏమేవ్..ఓయ్..ఒసేయ్..
పక్కింటోళ్ళకి ఆవిడ..
ఎదురింటోళ్ళకి ఎదురింటావిడ..
పిల్లలకి అమ్మ..మరదలికి వదిన..
అంతగా నిన్ను నువ్వే మరచిపోయి పతిసేవలో మునిగావుగా..
దాచుకోవాలి ఆడది మనోభావాల్ని..
ఆర్తిని..ఉద్వేగాన్ని...ఆదర్శాలని..
కాదని వ్యవస్తని కాల్తో తన్ని లేచావనుకో..
లేచి వెళ్ళావనుకోరు..లేచిపోయిందంటారు..
అందుకే సగటు స్త్రీగా మిగిలిపోవాలి..
కొంగిచ్చిందందుకేనేమో దేవుడు..
దుఃఖం వస్తే అడ్డుపెట్టుకోమని..
సంతోషం వచ్చినా నీ ముసుగులో నువ్వే ఆనందపడమని..
ఏ ఆడదీ ఈరోజుకి చెప్పలేదందుకే..
నా విజయానికి కారణం ఓ పురుషుడని..
అస్తిత్వానికి ఆరాటమెందుకులే..
చచ్చేదాకా ఛస్తూ బ్రతకడం తప్పదని నిర్ణయం జరిగిపోయాక..!!

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *