//గ్రీష్మ వెన్నెల//
మనసుకెందుకో ఉద్వేగం..క్షణాలు నిశ్శబ్దంగా కదులుతున్నా..
తనువులోనూ సంచలనం నీ తలపుకే స్పందించినట్లుగా..
నీ మౌనంలోనూ పరవశమే నాకు..అనిర్వచనీయమైన ఆనందమేదో అందినట్లు..
చిటపటమంటూ గ్రీష్మం విచ్చేసినా..మనసెప్పుడూ బృందావనమే..
నవవసంతమయమైన నీ తలపులపందిరిలో నేనున్నట్లు..
సప్తవర్ణాలూ ధవళవర్ణం దాల్చి ఎండ వెన్నెలైనట్లు..
ఒకరిలో ఒకరమై ఒదిగిన రోజులు గుర్తొస్తూ..
గ్రీష్మ చివుళ్ళను మేసిన కోయిలగొంతులో..
ఋతురాగం సైతం కొత్తగా వినిపిస్తూ..
ఇన్నాళ్ళూ ఘుమఘుమలు నా సిగలోని మల్లెలవనుకున్నా..
నీ విరహమే పరిమళమై వీచిందనుకోనందుకు..
నువ్వైనట్లు అనిపిస్తోంది అంబరం..
వెండిమబ్బులతో అలలారుతూ తనను తాను ఆవిష్కరించుకొంటూ..
ఎంత అపూర్వ సంగమమో కదా మనది..
గ్రీష్మంలోనూ మధుగీతాలను ఆలపించు మధురిమలో..!!
No comments:
Post a Comment