Tuesday, 17 November 2015

//నేనున్నానుగా//



//నేనున్నానుగా//
ఆ విశ్వనాధునికి కిన్నెరసానుందని ఉడుకెందుకు
రాసేందుకు నీకు నేనున్నానని మరచినందుకా
ఎలకోయిల కూతలకు మరుపులెందుకు
నా అనురాగపు గమకాలు నచ్చనందుకా
గాలి అలల ఊసులకు పరవశమెందుకు
చిరుహాసమై నీ పెదవిని అలంకరించనందుకా
నీలిమబ్బుల్లో నీరు చూసి మురిపెమెందుకు
నా హృదయంలో తడి నీకు తగలనందుకా
ఆ నెలవంకను తిలకించి నవ్వులెందుకు
నా మెడవంపు నునుపు నిను పిలవనందుకా...
వేసవి మల్లెల గంధానికి వివశమెందుకు
నా వలపు పరిమళం నిన్నల్లనందుకా
పూబాల మధుపాల సయ్యాటకి ముచ్చటెందుకు
నా చూపులు నీతో కోలాటమాడనందుకా
పదేపదే అద్దంలో నిను చూసేదెందుకు..
నా సొట్టబుగ్గల్లో నీ రూపం కనిపించనందుకా
పైరగాలి నాట్యానికి తాళమెందుకు
నా పరువపు పదనిసలు వినబడనందుకా
నీరవమైన నిశీధిలో మౌనంతో భాషణమెందుకు
నా ఊహల గుసగుసలు నిన్ను చేరనందుకా
అన్నీ నను కవ్వించేందుకని నాకు తెలుసులే..
నీ మనసు నాకన్నా చదివినవారు లేరనీ తెలుసులే..

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *