Tuesday, 17 November 2015

//నోరు//





//నోరు//
నోరు..
ఇన్నాళ్ళూ నోరంటే..
అరనవ్వులు రువ్వేందుకేననుకున్నా..
ఆహారం నమిలి ఆహార్యం పెంచేదనుకున్నా..
మరీ రసానుభూతి ఎక్కువైతే..మురిపాలు పండించేదేమోననుకున్నా..
ఈ మధ్యనే తెలుస్తోంది..ఇంకా చాలా చేస్తోందని..
బంధువులను రాబందులుగా మారుస్తోందని..
నోటితో నవ్వుతూనే నొసటితో ఎక్కిరించడం గమనించాక..
బంధాలను ప్రతిబంధకంగా చేస్తోందని..
అనువైన మాటలనూ అష్టవంకర్లతో మాయచేసి మురిపించడం గుర్తించాక..
తమ ఉనికి కోసం ఎదుటివారిని దిగజార్చే అల్పజ్ఞుల నోట..
అబద్దపు ఆజ్యంలో ఆహుతైన నిజాలు నెత్తురోడాక..
ఆత్మలోతుల్లోకి నాటుకోలేని వేర్లతో ఎదగాలని చూసే కుసంస్కారుల..
తర్కమే కాదు..అడూ అదుపూ లేని అహంకారపు మాటలుతూటాలు గుచ్చాక..
విశాలం కాని బుద్ధి అడుగడుక్కీ అడుగంటిపోతుంటే..
అహాన్ని తృప్తి పరచుకొనేందుకే నోరిచ్చాడేమో భగవంతుడు అని అనుమానించేట్టు..
అక్షరాలే సిగ్గుపడాలేమో అనుభవాన్ని అనువదించేందుకన్నట్లు..
సుహృదవాతావరణాన్నే కలుషితం చేస్తుంటే..
అయ్యో..
హృదయకలశంలో పన్నీరెప్పుడు నింపుకుంటాయో ఆ మనసులు..
సంపూర్ణత్వం సిద్ధించి నిజమైన ఆప్తులనెప్పుడు చేరతాయో ఆ నడకలు..
వసంత నవరాగమంటి సువచనాలను ఎన్నడు ప్రవచిస్తాయో ఆ నోళ్ళు

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *