//వీధిబాలలు//
వీధిబాలలు..రక్షణ కరువై మసకేసిన పావురాలు..
చిన్నతనంలోనే ఎదురుదెబ్బల రుచి చూసిన మొగ్గలు..
కొడవళ్ళూ..కత్తులూ..రంపాలూ..లేకుండానే..
అలుపెరుగని పోరాటం సాగిస్తున్న చిన్నారులు..
చెత్తకాగితాలేరుతూ ఎంగిలి విస్తరాకుల్లో నిద్రలేస్తూ..
ఏ నిరాకారపు అస్తిత్వానికి ఊపిరి పోసుకున్నారో..
ఏ కసాయి కడుపుకు పుట్టిన పాపాలో..
ఆదరణకు నోచుకోని తిరస్కారాలు..
చినిగిన బట్టల అతుకుల గాలిపటాలు..
గాలివాటానికే కొట్టుకుపోయే తెరచాపలు..
జీవితమనే నిరంతరయుద్దంలో..
పేగులంటిన చర్మం కింద ఓడిపోతూనే ఉంది ఆకలి..
నూటిరవై నిముషాల సినిమా కాదుగా వారు..
మూన్నాళ్ళు ఆదరించి కనుమరుగయ్యేందుకు..
ఆప్యాయత ఓ పాయసమే వారికి..
దయచూపి ఓదార్చే చేయి తోడయితే..
అందుకే చేయూతనివ్వాలి చేతులు కలిపంతా..
రేపటి చరిత్ర నిర్మాతలు వారేనని గుర్తిస్తూ.. !!
No comments:
Post a Comment