Tuesday, 17 November 2015

//జీవితం//






//జీవితం//
కన్నుల్లో అగ్నిశిఖలు..
వదనంలో విషాదస్రవంతులు..
సనాతనాచారాలు రక్తంలో జీర్ణించుకున్నందుకేమో..
వీడిపోని నమ్మకాల వలలోంచి బయటపడక..
నిన్నల్లో కలిసిపోయినవాడి గురించి ఆరాటమెందుకు..
ప్రతీక్షణం అనుభవించే బాధ తగ్గిందని తలపోయక
విడిచిపెట్టి పోయాడని బాధెందుకు..
పాపపంకిలమంటూ నిందించే నస వీడిందని సంతసించక
జీవితం సర్వనాశనమయ్యిందని రచ్చకెందుకు
స్వేచ్ఛావాయువులు పీల్చే అదృష్టమొచ్చిందని ఆనందించక..
చీకటిదారాన్ని పట్టుకు వేళ్ళాడటమెందుకు
ఆశనిరాశల మధ్య అభివృద్దనే వారధి నిర్మించక..
నిరంతర పరిణామశీలమేగా జగత్తు..
అవ్యక్తమైన ఆవేశంతో నరాలు పోటెత్తితేనేమి..
అనుభవంలోంచీ జీవితం ప్రతికోణంలోనూ అవగతమవుతోందిగా..
మరణం ముగింపూ కాదుగా...జననం ఆరంభం కానట్లు..
అన్యాయం జరిగిందని ఆక్రోశించకు..
విప్లవాత్మకంగా ఆలోచించు..
అస్తిత్వం వీడిపోలేదని మాత్రం మరువకు..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *