Tuesday, 17 November 2015

//మనోచింతిత//






//మనోచింతిత//
పచ్చగా మెరిసిందేమో మోము..
పరసువేదితో పోల్చి నన్ను పలకరించినప్పుడు..
చిట్లించి చూసిన కన్నుల్లో ఏమి చదివావో..
ఎంతమంది ప్రియతములను బంగారమంటూ పిలిచినా..
నప్పింది మాత్రం నీకేనంటూ చిలిపిగా నవ్వడం గుర్తుంది..
బంగారమంటే విలువైన లోహంగా భావించే నేను..
మౌనంగానే మనసుకు మెరుగుపెట్టాను..నీ మాటలు మంత్రమేసినట్లు..
కురిపించిన నీ ప్రేమజల్లులో పులకించి స్వచ్ఛమయ్యాను..
చిన్నిచిన్ని ఆశలు అంకురించడం చూసి ఆనందించాను..
కలనైతే కానంటూ కమ్మని కానుకయ్యావు..
గమ్యమెరిగిన మనసు నీవైపు అడుగులేస్తుంటే సహకరించాను..
నాలో ఉన్న ప్రాణాన్ని నీ చేతికిచ్చాక..నా నవ్వు భద్రం చేస్తానంటూ దోచుకేళ్ళావు..
అదిగో..అప్పటినుండే..
కాలం కదలనని మొరాయించింది..
తీయని బాధని తలపోయలేకున్నా విరహాన్ని.. నువ్వలా గుర్తుకొస్తుంటే..
నిద్దుర కరువైన రాత్రులను తిట్టుకుంటున్నా.. నీ అల్లర్లు తెల్లార్లూ గిల్లుతుంటే..
పరిమళించే ప్రతిపవనాన్నీ అన్వేషిస్తున్నా..నీ గంధాన్ని పూసుకొచ్చిందేమోనని..
ఎగిరే చిగురాకు చప్పుళ్ళకీ ఉరకలేస్తున్నా..నీ కబురు తెచ్చిందేమోనని..
రోజంతా నీ ఆలోచనతోనే అలసిపోతున్నా..నీ జాడ తెలియట్లేదని..
ఇప్పుడంతా అభావమైంది నా మోము..
నీరెండ రహస్యమేదో ముసుగేసుకున్న ఆకాశంలా..

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *