Monday, 30 November 2015

//విరహాల వేకువ//




స్వర్గానికీ నరకానికీ మధ్య ఊగిసలాటేగా జీవితం..
గ్రీష్మర్తుల వేసవిగాలికి ఎద ఉక్కిరిబిక్కిరవుతుంటే..
చెదిరిన హృదయాన్ని చీకటినే దాచుకున్నా..
ఆశలు తీర్చలేని ఏకాంతం అసహాయమై కదులుతుంటే..
పసిడి వేకువులను కలవరించాయి కన్నులు..
ఉలిక్కిపడు ఊహలు కలలోనే కరిగిపోయాక..
గుండెల్లో నీవున్నావని గొంతెత్తి పాడుకున్నా..
నీకై చూస్తున్న క్షణాలు బరువై నిలబడిపోతే..
పువ్వుల గుసగుసలపై మోహాన్ని పెంచుకున్నా..
ఊపిరి గలగలలు ప్రేమలేఖలై వెలుగుతుంటే..
వెన్నెల సందేశం మౌనంగా చదువుకున్నా.. 
గడుసరి విరహం మువ్వై మోగుతుంటే..
పొంచి ఉన్న మధుమాసాన్ని ఆదరించా..
ఆమని దరహాసమేదో పెదవులపై విచ్చుకుంటే..   

Tuesday, 17 November 2015

//తిరస్కృతి//





//తిరస్కృతి//
ఎంత వేదనో కదా తిరస్కృతి..
ఇన్నాళ్ళూ ఒంటరితనమే వేధించినదనుకున్నది..
నేడు ఆత్మన్యునతగా అవతరించి భూతమై భయపెడుతుంటే..
సహజమైన సహేతుక ఆలోచనలన్నీ అల్పమై తేలిపోతుంటే..
నిరాశ మితిమీరి మనస్తాపమై శోకిస్తుంటే వింతేముంది..
అత్యుత్తమమైనది..శాశ్వతమైనదిగా భావించిన ప్రేమ..
సంకేళ్ళువీడి సునాయాసంగా అనుబంధాన్ని తెంపుకుపోతుంటే..
పరిమితులు దాటిన దుఃఖం దీర్ఘమై కమ్ముకుంటుంటే..
కళ్ళవెంబడి అశృవులు అనంతమై ప్రవహించడంలో ఆశ్చర్యమేముంది..
దారితప్పిన ఎడారిలోయల్లో జీవితం తారాడుతుంటే..
ఏకాంతవాసంలో రోదిస్తున్న అంతరంగం మేఘావృతమవుతుంటే
నీలినీడల నిర్లక్ష్యాలు తృణీకరించిన క్షణాలు బహిర్గతమవుతుంటే..
స్వేచ్ఛగా సంచరించలేని నిశ్శబ్దం నిర్జనమై వెక్కిరిస్తుంటే విడ్డూరమేముంది..
అధిగమించలేని ఆవేదన అవగాహనారాహిత్యాన్ని పరిహసిస్తుంటే..
అజ్ఞానపు వ్యామోహం విషబీజాలను కత్తిరించలేకపోతుంటే..
కష్టమైనా సరే..
తిరస్కృతిని తిరస్కరించడం నేర్వాలి..
హృదయంలో ప్రేమకు పునరంకురార్పణ జరగాలి..
ప్రాణాన్ని జ్వాలగా చేసి మరిన్ని జీవితాలు వెలిగించాలి..!!

//నేనే కదా//





//నేనే కదా//
హృద్గుహ నిండా అంధకారం..
చందమామవై అల్లంతదూరాన నీవున్నందుకు కదా..
ఎండిపోయిన మందహాసం..
నువ్వొస్తానని మాటిచ్చి రాలేకపోయినందుకే కదా
ఎదురుగా ఎందరున్నా..
మదిలో దిగులుమేఘాలు కమ్ముకున్నది నిజమే కదా
కన్నుల ముందర ఎందరున్నా
నా కన్నులపండుగ నీవెదురైనప్పుడే కదా..
గంభీర నిశ్శబ్దంలో కూరుకున్నా..
నీ నిరంతరానందం నేనేనని తెలుసు కదా..
నువ్వెక్కడ సంచరిస్తున్నా..
నీ రసమయ జగత్తు నేనే కదా..!!

//కేరింత//






//కేరింత//
మనసున పెనవేసిన మల్లెతీవెలై నీ తలపులు..
బుగ్గ నునుపున సిగ్గు చివురులను పోగేస్తుంటే..
చెక్కిట్లో సింగారాలు సల్లాప రాయబారాలు
వలపును పచ్చగా మోముకే పూసేస్తుంటే..
వసంత రాగవీధుల్లో స్వరాల సంగీతాలు..
ఎద సందడిలో చేరి వసంతకోయిలనే మరిపిస్తుంటే..
కెరటంలా పొంగిన హృదిలోని కేరింత
మాటలన్నీ చందమామ కవితలుగా రాసుకుంటుంటే..
తేనెమేఘమై కురిసిందనుకున్నా నీ ప్రేమ..
నవపల్లవాల్లో సంధ్యారాగాన్ని ప్రణయకావ్యం చేసేస్తూ..
నీది కానిదేదీ లేదన్న తనువు బంధమవుతానంటుంటే..
కలకాలం చైత్రమైపోనా నువ్వెదురుచూసే పున్నమిలోనే..!!

//విస్మయ//



//విస్మయ//
మహామౌనంలో కూరుకుపోయిందామె..
మళ్ళీ మళ్ళీ మోసపోయినందుకు..
ప్రేమించడం తప్ప మరొకటి అతనికి చేతకాదని నమ్మినందుకు..
మనసు చేసే ఇంద్రజాలంలో ఒక్కసారి చపలత్వానికి పట్టుబడ్డందుకు..
గాయపడ్డ మనసు రహస్యంగా రోదిస్తుంటే ఓదార్చలేక..
అశృవులతోనూ అంతరాత్మను క్షాళన చేసుకోలేక..
గుండెలోని వేదన ఆకాశంలో జ్వాలగా ఎగిసిపడుతుంటే..
చింతాక్రాంతమైన అంతరంగాన్ని ఆపలేక..
కంపిస్తున్న హృదయంలో విశ్వాసాన్ని నింపలేక..
చిరుగాలికి రెపరెపలాడుతున్న దివ్వెలా
నిలకడలేని క్షణంలోని పక్షిలా..
విలవిలలాడుతున్న విషాదంలా..
నిట్టూర్పులతోనే జీవితంలో వెలితిని నింపుకునేందుకు ప్రయత్నిస్తున్న విస్మయ..!!



// నీ నేను //



//నీ నేను//
కాగితంలా మారిపోయా..కవిత్వంగా నన్ను రాసుకుంటానన్నావని..
కలలా కానుకయ్యా..నీలో ఊహలు మొలకెత్తాలని..
వెన్నెలనై విందుచేసా..మనసులో వెలితి నింపాలని..
విరిలా విచ్చుకున్నా..మందహాసంతో నీలో స్పూర్తి నింపాలని..
అనుపల్లవినై రవళించా..సంగీతాన్ని నీకు పరిచయించాలని..
మేఘమై వర్షించా..నీలో ఆనందాలు కురవాలని..
కలకోయిలగా మారిపోయా..నీకు వసంతం మాత్రమే వినబడాలని..
ఊహలో ఊసునయ్యా_నీ ఒంటరిభావాలకు తోడవ్వాలని..
చివరకు..
నీ నిశ్శబ్దంలో చేరిపోయా..నీకు మౌనంపై మనసయ్యిందని..
వెన్నెల మరకై మిగిలిపోయా..నీ జ్ఞాపకాలకు నెత్తావులద్దాలని..
అయినా...
ఇంకేదో కాలేకపోయానంటావు..నీలోని నన్ను తడుముకోకుండానే..!!

//జీవన రహస్యం//



//జీవన రహస్యం//
వెలసిపోయిన అనుబంధమొకటి..అనుమానపు కోరల రక్కుళ్ళతో
రోదనతో మొదలై వేదన రుధిరప్రవాహమై అణువణువూ ప్రవహిస్తుంటే..
హృదయాంతరాలలో ఏదో ప్రళయం..
సువిశాలం కాని బుద్ధి సందేహంతో సతమతమవుతుంటే..
విముక్తి కాలేని వివాదమేదో వికటాట్టహాసం చేస్తుంటే..
అంతరంగంలో ఏవో నీలినీడలు..
నిశ్శబ్దగతుల నిశీధికి పట్టుబడిన పరాజితలా..
గ్రీష్మర్తుల్లోని జ్వాలలకు తప్పించుకోలేని ఎండుపుల్లలా
ఆకాశానికెగిసిన అపశృతులలో..
రాలిపోయిన కుసుమం అగాధ పాతాళగర్భంలో జారినట్లు..
కన్నీటి చీకట్లలో ఆశానౌక మునిగిపోయినట్లు..
.ఒక జీవనరహస్యం అడుగంటిపోయింది...!!

//పచ్చదనపు హొయలు//





//పచ్చదనపు హొయలు//
నిద్దురలేచిన భావుకత్వమేదో..నిన్న లేని అందంలా నాలో..
పచ్చని కోక కట్టిన ప్రకృతి..మనసుని మహేంద్రజాలం చేసేస్తుంటే..
వెండిమబ్బులు వెన్నముద్దల్లా జరిగి..మనసు కరిగిస్తుంటే..
గాలికి ఊగే కొమ్మలు ఊపిరి సలపనివ్వని అందాలతో మైమరపిస్తుంటే..
వికసించిన సరోజాల్లో మేల్కొన్న మధురస్వప్నాన్ని నెమరేస్తుంటే..
దిగులుపడ్డ లక్ష్యాలు సైతం చైతన్యమై శ్వాస తీసుకోవా..
ఆనందాన్వేషణ సిద్ధించిన కన్నుల్లో జీవం తిరిగిరాదా..
పాదాల్లో పద్మరాగాలు ఉదయించి పరుగులెత్తి విహరించవా
రెక్కలొచ్చిన మది రెప్పలవాకిలి దాటి..నింగికెగిసి..
చిరునవ్వును తరంగం చేసి..
సరికొత్తగా పల్లవించే పాటనేదో గానం చేసి..
ఉషోదయపు ఉజ్వలకాంటిలో రసడోలలూగించదా..
అరమోడ్పుల ఆమని ఆరాటానికై కోయిల కూజితమవ్వదా..
మరలిపోతున్న కలలు..పదాల పొందుతో మరువాల వాన చిలికించవా..!!

//మనోచింతిత//






//మనోచింతిత//
పచ్చగా మెరిసిందేమో మోము..
పరసువేదితో పోల్చి నన్ను పలకరించినప్పుడు..
చిట్లించి చూసిన కన్నుల్లో ఏమి చదివావో..
ఎంతమంది ప్రియతములను బంగారమంటూ పిలిచినా..
నప్పింది మాత్రం నీకేనంటూ చిలిపిగా నవ్వడం గుర్తుంది..
బంగారమంటే విలువైన లోహంగా భావించే నేను..
మౌనంగానే మనసుకు మెరుగుపెట్టాను..నీ మాటలు మంత్రమేసినట్లు..
కురిపించిన నీ ప్రేమజల్లులో పులకించి స్వచ్ఛమయ్యాను..
చిన్నిచిన్ని ఆశలు అంకురించడం చూసి ఆనందించాను..
కలనైతే కానంటూ కమ్మని కానుకయ్యావు..
గమ్యమెరిగిన మనసు నీవైపు అడుగులేస్తుంటే సహకరించాను..
నాలో ఉన్న ప్రాణాన్ని నీ చేతికిచ్చాక..నా నవ్వు భద్రం చేస్తానంటూ దోచుకేళ్ళావు..
అదిగో..అప్పటినుండే..
కాలం కదలనని మొరాయించింది..
తీయని బాధని తలపోయలేకున్నా విరహాన్ని.. నువ్వలా గుర్తుకొస్తుంటే..
నిద్దుర కరువైన రాత్రులను తిట్టుకుంటున్నా.. నీ అల్లర్లు తెల్లార్లూ గిల్లుతుంటే..
పరిమళించే ప్రతిపవనాన్నీ అన్వేషిస్తున్నా..నీ గంధాన్ని పూసుకొచ్చిందేమోనని..
ఎగిరే చిగురాకు చప్పుళ్ళకీ ఉరకలేస్తున్నా..నీ కబురు తెచ్చిందేమోనని..
రోజంతా నీ ఆలోచనతోనే అలసిపోతున్నా..నీ జాడ తెలియట్లేదని..
ఇప్పుడంతా అభావమైంది నా మోము..
నీరెండ రహస్యమేదో ముసుగేసుకున్న ఆకాశంలా..

//హృదయాల మేలుకలయిక//




//హృదయాల మేలుకలయిక//
ఆనందభైరవి అభిషేకించినట్లు హృదయాన్ని స్పృశిస్తుంటే..
పునర్జీవినైనట్లుంది..
అప్పుడెప్పుడో నాకు నేస్తమైన విరహం..
చెప్పకుండా ఎటో మరలిపోయినట్లుంది నిన్ను నాకిచ్చి..
వికసించిన పూలవనమంటి నీ సాన్నిధ్యంలో..
పుప్పొడినై రాలిపోయినా ఫరవాలేదనిపిస్తుంది..
నవ్వులు నురగలై నన్ను శృతి చేస్తుంటే..
సంగీత సందేశమేదో నీకు వినిపించాలనిపిస్తోంది..
గుండెలో పుట్టిన ప్రేమ అనంతమవుతుంటే..
లతనై అల్లుకుపోవడం మాత్రమే తెలుస్తోంది..
సడి చేయని సంతోషమేదో గుసగుసలాడుతుంటే..
ఈ క్షణమిలాగే ఆగిపోతే బాగుండుననిపిస్తోంది..!!

//మమేకం//





//మమేకం//
తొలిచూపుకి చిగురించిన చొరవ ఆలింగనంలో గగనమవగా
తరువూ తనువూ వెన్నెలై విరబూసిన తరుణాన
నువ్వూ నేనూ మమేకమై..నీవుగా నాలో కరిగి..ఒక్కటిగా మిగిలాక
మన ప్రేమ పాపగా మారిన వైనం..
మనసుకు మాత్రమే తెలిసిన మధురభావం
నీ పాపను మోస్తూ బరువెక్కిన అందాలు..
పొంగుతున్న ఆనందానిక్ ప్రతీకలు
ఉక్కిరిబిక్కిరి చేసిన వేవిళ్ళు..కోరెను పుల్లని మావిళ్ళు
అరవిరిసిన ముద్దబంతి సౌందర్యం ముగ్ధత్వాన్ని నాకాపాదించగా
అలసటకూడా అందమై మెరిసింది నీ ఆత్మీయస్పర్శలో..
అణువణువూ అమ్మతనం నిండిన మాధుర్యం
అనుభవిస్తేగానీ తెలియని అనిర్వచనీయ పరవశం

//అట్ల తద్దె//





//అట్ల తద్దె//
తొలిపొద్దు వేకువలో విరబూసిన అందాలు...
కొమ్మకొమ్మకో' కువకువలు..
నవ్వులూ..కేరింతలతో వనమంతా నిండింది..
కాంతి తరంగాలతో తేలియాడుతున్నా జాబిల్లి..
ఇన్ని అందాలను ఒక్కమారు చూసి కరిగినట్లుంది..
ఆకాశంలో నిద్దురమబ్బులు తూగుతూన్నా
ఆనందం పరుగు తీస్తుంది పావడా కట్టి
ఓణీలో ఒదిగిన ఒయ్యారమంతా మువ్వలతో కలిసి శబ్దించినట్లు..
నిశ్శబ్ద తారకలు నిద్దురలేచి తొంగిచూసెను దొంగచూపులు..
చెలికాని నవ్వులోని కుంకుమపువ్వులు చేతిలో గోరింతపూతలైనట్లు..
అరచేతి చందమామను ముద్దాడాలాడనే కొంటెకోరికలు
దోబూచులాటలూ...ఉప్పులకుప్పలూ..
తూగుటుయ్యాలలూ..తొక్కుడుబిళ్ళలూ..
వసుంధరా సందడిని మరింత పెంచేస్తుంటే
వెన్నెల దరహాసంతోనే సూర్యోదయమయ్యింది..
రోజంతా కలలు నిండిన కన్నులను రెప్పవేయనీయక
ఊహల వలకాడ్ని వరుడ్ని చేయమని..
నోముకు తొండరపడుతున్న తుంటరి తలపులు..!!

//దిగులు ముత్యం//




//దిగులు ముత్యం//
అదిరే పెదవుల గుసగుసలను చదివే ఆరాటమేదో నాలో..
మౌనరాగాన్ని పెనవేసుకున్న మౌనిలా నీవుంటే..
అనురాగాల కోయిలనై అలరించాలనుకున్నా నిన్ను..
సద్దులేని సంగీతంలా నీరవరమై నిల్చుంటే..
కలలో కలబోసుకున్న కబురులన్నీ కలిపి కట్టకట్టా
రవ్వంత కనికరంలేని నిన్ను కనికట్టు చేద్దామని...
మధురోహల దోసిలిలో నీ మాటలముత్యాలను ఏరుకోవాలనుకున్నా
అనంతమైన ఆకాశాన్ని ఆలకించడమాపి అలంకృతమైన నన్నాలపిస్తావని..
చూసి చూసి కంటి నరాలు వదులయ్యాయి..
దిగులు ముత్యమై రాలింది..
నిన్నాకట్టుకోలేని నా ఆకతాయితనం..
అమాయకమై కరిగింది..!!

//శరత్కాలపు వెన్నెల//



//శరత్కాలపు వెన్నెల//
కుంకుమ వన్నెలన్నీ వడగట్టి ధవళ మందహాసం చేస్తోంది రేయి..
మెరుపు అలలు కొన్ని వెల్లువలై పొంగిపొరలుతుంటే..
కురుస్తోంది వెన్నెలవాన నా మదిలో విరిసిన పువ్వులబంతిలా..
చిరు చలిగాలి దోబూచులాడి గిలిగింతల కిలికించితాలు రేపుతుంటే..
శరత్కాలపు చంద్రోదయంపైనే మనసయ్యింది..
పున్నాగుల పలకరింతలకి మేను పులకరిస్తుంటే
వెండిమబ్బు విహారానికి చేయిచాచి రమ్మని పిలుస్తున్నట్లుంది..
చకోరపక్షుల కూజితాలకి చంద్రశిలలు కరుగుతుంటే..
ఆనందభైరవి రాగమేదో పెదవులపై తారాడుతోంది..
మనసు తీయని తాపానికి తూట్లవుతుంటే..
మన్మధుని ఐదుబాణాలు నాకే గురిపెట్టినట్లుంది..
మనసు మరోలోకంలో జంటగా విహరిస్తుంటే..
ఏకాంతమిప్పుడు తీపవుతోంది

//ముద్దులబాబు//





//ముద్దులబాబు//
నవ్వుల నగుమోము కదా నీవు..చిరునవ్వులతోనే నన్ను దోచేస్తూ..
నీ చిన్నారిమోముకెన్ని కవళికలో..గిలిగింతలకానుకలతో మనసు కట్టేస్తూ..
మరెన్ని కేరింతలో నీ పొన్నారిమోవిలో..రవ్వంతరాగాలూ రాలుగాయి సవ్వడులైపోతూ..
ఎన్ని చిట్టిస్వరాలో నీ గారాలగొంతులో..ఒయ్యరిగమకాలకే దీర్ఘాలు నేర్పిస్తూ..
పాలుగారు పసిడివన్నె బుగ్గలు..తనివి తీరని ముద్దులు నీకిమ్మంటూ..
సన్నజాజిరేకుల్లోని సున్నితత్వమేమో నీవు..నునులేత స్పర్శలోని మాధుర్యాన్ని నాకందిస్తూ..
నిద్దురలోనూ అరవిరిసే పెదవి పగడాలు..నన్ను రెప్పవేయక దోసిలిపట్టమంటూ..
ఏ గంధం పూసుకు పుట్టినందుకో..వ్యాపించిన సువర్ణపరిమళాలు మనసు నట్టింట్లో..
మాటలకందని నీ చిలిపి అల్లర్లు..మళ్ళీమళ్ళీ నన్ను మైమరపుకు గురిచేస్తూ.

//ఉత్తేజం//





//ఉత్తేజం//
ఆకుల గలగలలోనూ విషాదం వినబడుతోంది
దారితప్పిన వసంతాన్ని అన్వేషించి అలసినందుకేమో..
కొత్త ఉద్వేగానికి మేల్కొల్పులేవో..
అనుభవాన్ని రేపటి ఉత్సాహంగా మార్చుకోమని చొరవచేస్తుంటే..
మనసుకున్న అభిరుచిని మన్నించి పొదుపుకున్నా.
సాహిత్యేతర సృజన తనవల్ల కాదంటుంటే..
ఊహల ప్రపంచాన్ని సృష్టించుకున్నా
సజీవమైనదేదీ లోకంలో లేదని స్పష్టమయ్యాక..
ఆరుఋతువులూ ఒకేరీతిగా అగుపిస్తున్నాయక్కడ
కోరిన బంగారులోకం పచ్చగా కళకళలాడుతుంటే..
ఏకాంతభావాలేవీ మిగల్లేదక్కడ..
నవ్యానుభవం మౌనరాగాన్ని ఓడించి సంకీర్తనావళిని మొదలెట్టాక.

//మార్పు//





//మార్పు//
జీవితంలో మార్పు..
అనివార్యమని తెలుసందరికీ..
కాలానుగుణమైన మార్పు.
అత్యంత అవసరం కూడా
మార్పును చంచలస్వభావ సూచికగా కాక..
ఆశావాహ ధృక్పధంతో స్వీకరించడం రావాలి...
మార్పును వ్యతిరేకించమని ప్రగల్భాలు పలికేవారు సైతం..
తమదాక వస్తే నిన్నటిగాలి పీల్చేందుకే మొగ్గుచూపుతారెందుకో...
ఒక సహజమైన మార్పు..
జీవితాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుందని తెలిసినా
సమయానికి అందిపుచ్చుకోకుంటే.
మిగిలేది అసంతృప్తేగా..
విచ్ఛిన్నం కావా..అల్పజ్ఞుల విరుపుమాటల విచ్చుకత్తులు..
మనం స్వాగతించిన చిన్న మార్పుతోనే..
మనసు తెరిచి ఒక్కమారు మార్పును స్పృశిస్తే తెలుస్తుంది కదా..
స్వల్పమైన సత్యంలో ఎంత నిర్మలానందం దాగుందో...
శూన్యాకాశంలో తారకలెన్ని మెరుపులతో ప్రకాశిస్తున్నవో..
ఎండుటాకుల గలగలలో ఎన్ని సరిగమలు విలీనమయ్యాయో..
సద్దులేని హృదయంలో..ప్రేమైక రాగమెన్ని సంతోషపు గుసగుసలు వినిపిస్తుందో..
నిన్నటి విషాడమౌనంలో..పల్లవించు చిరునవ్వు ఎన్ని కొత్త ఆశలు నింపుతుందో..
ఎదురుచూడొద్దు ఇతరుల్లో మార్పుకోసం..
మొదట మనం మారి చూద్దాం..
ఇతరులకదే కనుపంట చేద్దాం..!!

//మనసు//





//మనసు//
విరహంపోరు పడలేని అందాలు అలుకలకు తెరతీసిన వైనం
విరిచిన పెదవొంపు పెరపెరలో నటియించమంది మనసు
వలపు సెగలకు పుట్టిని చెమట బిందువులు జార
కరిగిన కస్తూరిబొట్టును సవరించమంది మనసు..
పాలకుండలా వెలుగుతున్న వెచ్చని వెన్నెలసోన
పచ్చని చెక్కిట గంథముగా అలదమంది మనసు..
కాటుకపిట్టల పోలిన కన్నుల నలుపును కొనగోట తీసి..
సొట్టపడ్డ చుబుకాన దిద్దమంది మనసు..
మంచిముత్యామంటి మధురభావాల చల్లని దండ గుచ్చి
మృదువైన కంఠసీమను అలంకరించమంది మనసు..
నునుపైన బాహువులను కైదండగా మార్చి..
మనసైన ఆలింగనపు స్పర్శానుభవం ఇవ్వమంది మనసు..
తనూలావణ్యమంతా అక్షర సోయగంలో కూర్చి..
మొలకెత్తిన వివశాన్ని రాయమంది మనసు.
ఆకాశాన్ని పత్రంగా మలచి...చుక్కలనే అక్షరాలుగా పేర్చి..
అల్లిబిల్లి ఆశలన్నీ తనకు చేరవేయమంది మనసు..!!

//రసార్ణవం//






//రసార్ణవం//
ఆనందం రెక్కలు విప్పుకోవడం తెలుస్తోంది
ఆకాశమాలపించిన అరుణరాగమేదో అధరాలను చేరి.,.
అలలు అలలుగా..
అలతి పదాలుగా..
అల్లిబిల్లి అందాలుగా
అరవిరిసినట్లు అనంతమై
దివారాత్రుల రసాన్వేషణ ఫలమై కలస్వనమై..
హృదయాచ్ఛాదిత అంధకారాన్ని తరిమికొడుతూ..
నిశ్వసించిన శ్వాసను సైతం దోసిలిపట్టి
కవితగా కూర్చుకుంటుంటే..
నిన్నటిదాకా అభిముఖమైన విషాదం
పరాభవమైనట్లు నీరవంలోకి జారిపోతుంటే..
తుంటరితనం తాండవిస్తోంది..
తడబడిన థిల్లానా తప్పటడుగులేసినట్లు..
మౌనాన్ని ఉల్లాసంగా శృతిచేసినట్టుంది..
జీవనతంత్రులను సరికొత్తగా మీటినట్లు..!!

//మాటే మంత్రము//



//మాటే మంత్రము//
మనిషికి మాత్రమే ఉన్న అద్భుతవరం కదా 'మాట'..
అందుకే మనం మాట్లాడాలి..
మాటలు కలపడం నేర్చుకోవాలి..
అర్ధవంతమైన మాటలు మానవసంబంధాలను పతిష్టం చేస్తాయి..
మాటల్ని బట్టేగా మనిషిని అంచనా వేసేది..
అపార్ధాలకు తావివ్వలేని మాటలను ఉపయోగించడం ఎంతో అవసరం
అడ్డుగోడగా ఉన్న అనేక ఒత్తిళ్ళు, విభేదాలు..
సక్రమంగా మాట్లాడి దూరం చేసుకోవచ్చుగా..
మెప్పించినా..నొప్పించినా మాటలతోనేగా బంధాలు..
మనసుకు దగ్గరతనాలు..
అయినా చాల తక్కువమందితోనేగా మనసువిప్పి మాట్లాడేది..
అభివ్యక్తీకరించలేని మాటలు మనసులో ఎన్నున్నా వ్యర్ధమేగా..
మాట తీరు బాలేదనో.. నచ్చేలా మాట్లాడలేదనో..
మౌనాన్ని ఆశ్రయిస్తే చివరికి మిగిలేది ఒంటరితనమేగా..
కొన్నిసార్లు ఎదుటివారి మాటలను బట్టీ స్పందించడంలో తప్పులేకున్నా..
సూటిగా ఎదలో భావం చెప్పి బరువు దించుకోవచ్చుగా..
సందర్భాన్ని బట్టీ పలికే విలువైన మాటలు..
మంత్రమై మనసును పెనవేయునుగా..
ఇంద్రజాలమై మురిపించునుగా..!!

//పునర్జీవిత//





//పునర్జీవిత//
ఆపాదమస్తకం కంపిస్తోంది ఆమెకి...
అమాసలో దారి కరువైనట్లు ..
స్మశానవైరాగ్యమేదో చుట్టుముట్టి..
గాఢాంధకారంలో నెట్టేసినట్లు..
మనసులోని మర్మరధ్వనులు అస్తవ్యస్తమై..
హృదయ దిగాంచలాల్లో ఏదో పాట సన్నగా వినబడుతూ
విషాద గీతమో..చరమ గీతమో తేల్చుకోలేని సందిగ్ధంలో..
నిద్రాణమైన స్వేచ్ఛను కోరినట్లనిపించి మదిలో..
చిరుస్వప్నాన్ని వాస్తవం చేసుకోవాలనే ఆకాంక్షలో..
ఒక ఊహ ఫలించిందామె ప్రయత్నంలో..
ఉదయించిన ఉషోదయపు ఉజ్జ్వలకాంతి..
హృదయతంత్రులను సుతారంగా మీటి
అమృతకిరణాలను తాకించి..
అలసిపోయిన జీవితాన్ని మేల్కొల్పమంటూ..
రాలిపోయిన క్షణాలపై కళ్ళాపి జల్లి..
చంకీ ముగ్గుల బంగారు కాంతులను కలబోయమంటూ
చూపు ప్రసరించగలిగితే..
పెనుచీకటి వెనుక వెలుతురుంటుందనే నిజాన్ని విప్పి చెప్తూ..
పునర్జీవితానికి ఉత్తేజమవమని సందేశమేదో అందిస్తుంటే..
అంతరాత్మ శాంతించిందట స్వస్థత చేకూరినట్లు..!!

//వెన్నెల మంట//



//వెన్నెల మంట//
ఈ రేయెందుకో..
నిట్టూర్పుల గాడ్పులే మనసంతా..
చంద్రకాంత శిలలు సైతం కరిగే చల్లనివేళ
నా హృదిని మాత్రం తాపముతో రగిలిస్తూ..
చిరుగాలి అలల మెత్తని తాకిడికేమో..
కన్నులు తెరిచే ఆహ్వానిస్తున్న ఊహాలోకానికి ఎగిరిపోతూ..
మనసు దాచుకున్న మౌనరహస్యాలెన్నో..
పెదవుల్లో నెలవంకలై ఒయారంగా ఒదిగిపోతూ..
తేలియాడొచ్చే సురపొన్నల సుగంధాలకే..
సల్లాప మైకమేదో ప్రేమమీర కమ్ముకుపోతూ..
ఎదలో ఎగిసే సురుచిర ప్రణయభావాలన్నీ..
మన్మధుని పుష్పబాణావళికే కందిపోతూ..
వసంతహేలను సృష్టిస్తాయనుకున్న నీ తలపులు..
నేడు పూర్ణ చంద్రోదయానికి మరింత విరహాన్ని పెంచేస్తూ..!!

//హృదయావేదన//




//హృదయావేదన//
ఆమె హృదయం నినాదం చేస్తోంది..
ఓడిపోయిన నక్షత్రాల్లో తనను చేర్చొద్దంటూ..
అజ్ఞాత నిశ్శబ్ద శబ్దాల్లో ఒక్కమారు తనను వినమంటూ..
తనకున్న కాస్త స్వేచ్ఛను అతనికర్పిస్తానంటూ..
ఆమెలోని ప్రేమను అతనికి ధూపమేస్తానంటూ..
ఏకాంతపు నవ్యత్వంలోని చెలిమిని రుచి చూపుతానంటూ..
ఆర్ద్రత నిండిన కన్నీటితో అభిషేకిస్తూ..
నిర్జీవమైన ఎడారిలో ఒక్కమారు మొలకెత్తనివ్వమంటూ..
పరాయివాడుగా మారి కనికరం చూపని కసాయిలా వాడు నడిచెళ్ళిపోతుంటే..!

//రాతిరి రాగం//




//రాతిరి రాగం//
రాతిరి రంజుగా మారింది..
కురిసిన జాజులు జూకాలై మనసును తోడుగా ఊపుతుంటే..
చేరువైన దూరాన్ని ఆలిగనంతో బంధించి..
అలసిన కన్నుల ఎర్రదనానికి వేడుక పూసి..
చేరువైన నీ చెలిమి సన్నిధిలో..
చిలికిన వెన్నెల సోయగాన్ని పోదిచేసి...
గుసగుసలాడుతున్న పెదవుల ఊసులను ఆపలేక..
వివశమవుతున్న మదిని బుజ్జగించి..
ముద్దు తీరని మోహానికి రంగులేసి..
హద్దులెరుగని ప్రేమను కానుకిచ్చి..
మొన్నటి కలలన్నింటినీ కవితలుగా అల్లి..
నీ చిరుతనవ్వులకే అంకితమిస్తున్నా

//నీ తలపు//





//నీ తలపు//
చిటపట పువ్వులే పెదవుల్లో..
రోహిణికార్తెలో శీతలసమీరంలా నీ వలపుగాలి సోకుతుంటే..
సిగ్గుల సొట్టలే పాలబుగ్గల్లో
సస్మితవదనాన్ని అనిమేషమై తిలకించడం గుర్తొస్తుంటే..
ఆనందరసార్ణవమే కాటుక కన్నుల్లో..
ప్రేమసుధా సారాన్ని హృదయంలో ఆస్వాదిస్తుంటే..
మౌనాన్ని సైతం అనుభూతిస్తున్నా..
మనసైన నీ జ్ఞాపకాల నెత్తావులు మత్తెక్కిస్తుంటే..
తలచుకొనేకొద్దీ తన్మయమవుతున్నా..
నాలో కురిసిన వెన్నెల అక్షయమై వెలుగుతుంటే..
చెప్పలేని అలౌకికానందం..
ఒక్కనేనే అనేకమై అంతర్వాణితో అనుసంధానమవుతుంటే..
అరుదుగా పూసే సిగ్గుపూల సుగంధం కదా నీ తలపు..
అందుకే..
అదుముకున్నా ఆనందాన్ని..నీ తలపులోనే దాగుందని తెలిసి..

//నీరవం//






//నీరవం//
అన్వేషణ ముగిసిందా నేత్రాలలో..
జీవితం ఆహుతయ్యిందని తెలిసిన క్షణంలో..
కలలన్నీ బూడిదరాశులుగా మారి వాస్తవమై వెక్కిరిస్తుంటే..
నిన్నల్లో నిలిచిపోయినవాడ్ని అన్వేషించి ఓడిపోయాక
అర్ధవిహీనమైన జీవితాన్ని ఒంటెద్దులా లాగుతూ..
బాధకి అభిమానమన్నదే లేనట్లు..
క్షణమైనా ఆమెను విడువక వాటేస్తుంటే..
జీవితానికి రంగూ రుచీ లేదని వాపోతూ..
హాలాహలాన్ని దిగమింగి నరకాన్ని భరిస్తూ..
మరణం అంచుకు చేరేదాక..
బ్రతుకులో సమన్వయం సాధ్యం కాదనుకుంటూ..
నీరవంలో నిలిచింది..
మౌనవించి ఆనాడూ..ఏడ్చేడ్చి ఈనాడు..

//మేఘమాల//






//మేఘమాల//
దయార్ద్రహృదయం కలిగిన ప్రియమైన మేఘం
ఆశాబంధాలు నిలబెట్టు స్వారస్య శ్యామలం
మహోపకారమే తప్ప కీడు తలవని సచేతనం..
వర్ణానికందని నీలాల మేఘమాల గమనం ..
పద్మరాగాది నవరత్నకాంతుల
ఇంద్రధనుశ్శకల అపూర్వ జననం
పుష్పలావికల చిరుచెమటలు తొలగించు వినోదం
భూతలానికి కన్నులపండుగ చేయు నీ అందం
వెండిమబ్బుల జలతారు తీవెల వెన్నెలచందం..
సమస్తవిశ్వాన వ్యాపించు నీలి రసజగం
ఇంద్రనీలమణి కలగలిసిన ముత్యాలహారం..
మహాకవులూ విద్వాంసులూ ఆదరించు అమూల్యభావం
విరహించు నదీమను సంగమించి విహరించు విలాసం
పువ్వుల జడివానతో పులకరించును సంగీతం
మదనతాపమను కార్చిచ్చును చల్లార్చు పరవశం
అలసిన మనసుల వర్షబిందువులు రాల్చు మనోహరం
కురిపించిన నీ వానతో పరిమళించును భూమి సుగంధం

//స్త్రీపర్వం//





//స్త్రీపర్వం//
మనసుపొరల సొరంగాలను తవ్వేకొద్దీ
మానవసంబంధాలు పతనమై ఎదురవుతుంటే..
నిన్నటిగాలుల దుర్గంధాన్ని పీల్చిన ప్రతిసారీ
వ్యర్ధమైన వాదనకు హృదయం తెరతీస్తుంటే..
నిజాయితీని నిప్పులగుండంలో తోసి..
జీవితాన్ని పంచాయితీల పరం చేస్తుంటే..
నిశ్శబ్ద పోరాటంలో నిత్య నరకమనుభవిస్తూ
మాటలకందని చిత్రవధతో కాలాన్ని పొద్దుపుచ్చలేక
సరికొత్త స్త్రీపర్వానికి ముందడుగేస్తూ..
సిద్ధాంతాలను తోసిరాజంటోంది..
సహనానికి మారుపేరైన నేటి స్త్రీ..!!

//మరణం//





//మరణం//
మరణం..
కోరుకోగానే సాధ్యమవ్వదుగా అందరికీ...
లౌకిక బంధాలు తెంచుకోవడం..
జీవితపు పొలిమేర దాటి పయనించడం
నిద్దురలో నిశ్శబ్దంగా సెలవు తీసుకోవడం
అందరికీ కడపటి క్షణాలంతేనేమో..
అకస్మాత్తుగా మృత్యువు కబళించి కొందరిని హెచ్చరించి తీసుకెళ్తూ..
మరికొందరిని విషాదం యొక్క విశ్వరూపం చూపి మరీ లాక్కెళ్తూ..
ఇంకొందరిని ఆవేదనా భారం అంతమవకుండానే అనంతంలోకి దారితీస్తూ
మొత్తానికి..
శూన్యహస్తాలతో చూపుకందని దూరతీరాలకు మోసుకెళ్తూ..
ఏమైనా...
తప్పించుకోలేనిదేగా..ప్రతిఒక్కరి జీవితంలో ముందువెనుకల ప్రయాణం
ఎన్ని సాధించినా మృత్యురహస్యం కనిపెట్టలేనందుకేనేమో..
ముక్తిపర్వం మొదలెట్టినా పూర్ణం కాదెవ్వరికీ..
అయితే..
మరణమంటే భయమెందుకులే..
అదో ముగింపు కానప్పుడు..
మనల్ని ప్రేమించేవారి జ్ఞాపకాల్లో సజీవమై ఉన్నంతవరకూ..!!

//వలపు//



//వలపు//
నిద్దురపొద్దులు మేలుకొనే ఉంటున్నా..
నీ వలపు కవ్వించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..
విరహమో మోహమో తెలియని వింత తాకిడిలో.
ఎన్నడెరుగని పసిడి పులకలతో మనసు తడుస్తుంటే..
మనోవనానికి అతిథివేననుకున్నా మొన్నటివరకూ
చెక్కిట జారిన పన్నీటిలో హృది సాగు చేసేస్తుంటే..
ఇన్నాళ్ళూ దాచుకున్న ఆత్మీయతను మల్లెలుగా చేసి జల్లాక..
మనసుకందని భావాల బరువును తనువు ఓపలేనంటుంటే..
అరమోడ్పు కన్నులను మూయలేకా..తెరువలేక
అరనవ్వుల గులాబీ పెదవులు రాగరంజితమవుతుంటే..
నీ గారానికే పసిపాపగా మారాలన్న అల్లరిని..
ముద్దుగా విసుక్కొని సముదాయిస్తుంటే..
ఒంటరిభావానికి తోడు దొరికినట్లనిపిస్తోంది..
తుంటరిగా నీ తలపు మనసంతా యధేచ్ఛగా పరిగెడుతుంటే..!!

//నీ నేను//




//నీ నేను//
మధురమైన భావాలను మోసుకొచ్చింది గాలి..
ఏ కవిత్వాన్ని తాగి వచ్చిందో మరి
గాలి అలల సవ్వడికి స్పందించేలా చేసేస్తూ..
లేచిగురాకు పచ్చదనం తొడుక్కున ప్రకృతిలా నన్నల్లాడిస్తూ..
ఓ పక్క మనసు మువ్వై మోగుతూ..
నీ తలపుల నర్తనానికి తాళమేస్తూంటే..
పులకింతలపర్వమేదో మొదలైనట్లు తనువులో..
నీ వలపు జడివానేదో కురుస్తుంటే..
జాబిల్లికోసం విరహోన్మాదమైన తారకలా..
దాగుడుమూతల దోబుచుల మనసుతో..
నీ బాహువల్లరి అల్లిక జిగిబిగిలో..
అల్లిబిల్లిగా సిగ్గిల్లిన నవమల్లికలా..
నువ్వెక్కడ సంచరిస్తున్నావోనని ప్రశ్నించే మదిని..
నీలో చేరి నిన్నసుసరిస్తున్నా కదాని సమాధానపరుస్తూ....
శిశిరమెన్నటికీ శాశ్వతం కాదని వసంతాన్ని ఆహ్వానించి ఎదురుచూస్తూ..
నీ నేను..!


//సెల్ఫ్ పిటీ మానియాక్స్//





//సెల్ఫ్ పిటీ మానియాక్స్//
విషవలయంలో చిక్కుకున్నట్లేగా
భావోద్వేగాలతో ఆడుకొనేవారి చేతికంటూ దొరికితే..
శృతిమించిన ఆంక్షలతో వేధిస్తూ
బెదిరింపులతో లొంగదీస్తూ..అసహనపు హద్దును పరీక్షిస్తుంటే..
లేని అభద్రతాభావాన్ని అపరాధభావాన్ని నింపేస్తూ
ఎదుటివారి బలహీనతతో ఆడుకుంటే..
ఆధారపడినట్లు నటిస్తూనే..విషాన్ని ఎక్కిస్తూ..
ఇంకా ఎదో దగ్గరతనం ఆశిస్తుంటే...
అర్ధంకాని సుడిగుండంలో నెట్టేసి..నిశ్శబ్ద పోరాటం చేస్తూ..
గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంటే..
మనిషిని మనిషిగా గుర్తించలేనివారితో వ్యవహారం వ్యర్ధమే
ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోకుంటే ఎప్పటికీ కీలుబొమ్మలమే..
ధైర్యం తెచ్చుకోవాలి అనుబంధాలు అడుగంటకూడదంటే..
ఒత్తిడిని సాగనంపాలి అసంతృప్తి వెన్నంటి రావొద్దంటే..
స్థిరత్వాన్ని సాధించకుంటే అనర్ధమే..
ధృఢంగా నిలబడకుంటే నిత్యనరకమే..!

//రాధారమణీయం//




//రాధారమణీయం//
వికసిత పూలాంబరమే హృదయం
ఆ వేణుగాన విలాసం..మనసంతా పరచుకున్న పరవశం
అతిశయించిన ఆనందం
రసమయ కాసారం..మనోన్మయ ఆస్వాదనాసారం..
యుగయుగాల నిరీక్షణా సమ్యోగం
కెమ్మోవి లాస్యాల సమ్మోహనం..మధుఫలాల సుధాకలశం..
బృందావనంలో ఆనంద రసార్ణవం..
విరిసే వసంతాల వైభోగం..మధురభావాల తాండవం..
ఆనంద సీమల్లో సల్లాప రాధారమణీయం..
పచ్చని చిలుకలకు నవరస సుస్వరాల సంగీతం..
మరందాల మనసుకు మల్లెల అభిషేకం.

//స్మృతులు//


//స్మృతులు//
ఎంత విశాలమైన పరిధిగా విస్తరిస్తేనేమి జగతి
భౌతికంగా దూరమైనా మానసికంగా చేరువయ్యే మనసులకు..
ఎన్ని నదులు కలిసి నడిచొస్తేనేమి
సముద్రమిశ్రమంలో ఒక్కటిగా ఒదిగిపోయాకన్నట్లు..
సురగంగా ప్రవాహమేదో ఎగిసినట్లు
సమ్మోహన రాగజలపాతాల హోరు కాదా హృదిలో
జ్ఞాపకాల దొంతరలేవో వేలై మనసును స్పృసించినందుకేమో..
పెదవి దాటని మాటలన్నీ..
సిరివెన్నెల ముత్యాల లేఖలు రాయాలని తొందరపడుతూ..
అనుభూతి సిరాను అక్షరకలంలో నింపగానే..
భావాలు కాగితంపై పరవళ్ళు తొక్కుతూ..
వివశం చేస్తూనే ఉంటాయి నీ స్మృతులు..
మనసు పుటలను గంధాలై పరిమళింపజేస్తూ..smile emoticon

//అచేతన//





//అచేతన//
ఎంతమందికి ఉత్ప్రేరకమై నిలిచెనో ఆనాడు ఆమె
నీలాకాశపు సహజసౌందర్యంతో అందనంత ఎత్తుగా
ఏదో సాధించాలన్న తపనలో మెండైన ఆత్మవిశ్వాసంతో..
నిరంతర చిరునవ్వే ఆ మోములో..
మనసులో దివ్వెలు వెలుగుతున్నట్లు కాంతిగా
దరిచేరేందుకు చీకటే తడబడేంత వింతగా..
బాంధవ్యానికర్ధం తెలియనివాడితో ముడిపడ్డాక..
అలముకున్న సమస్యలతో..అలవికాని ఉద్వేగంతో...
జీవితం కాలక్షేపమై మిగిలింది..
మౌనం మిగిల్చిన శూన్యమో..మాటలు కరువైన ఆవేదనో..
జీవనాన్ని మరచిపోయాక..
పాతివ్రత్యానికి పారితోషకం వెతుక్కుంది..
రెక్కలు విరిగిన పక్షి మునుపటిలా ఎగరలేదని కాబోలు..
ఇతరుల సానుభూతినాశించి నిరాశను చెప్పుకోవడమెందుకని..
ఏమీ చేయలేని నిస్సహాయతలో తనను తాను ఓదార్చుకుంటూ ఆమె..!!

//నాన్న//





//నాన్న//
అమ్మతో కలిసి సమపాత్ర పోషించావుగా నాన్న
పసిపాపగా నన్ను లాలించడం మొదలుపెట్టినప్పుడే..
నీ మమతానురాగాలు నాకు వినిపించిందప్పుడేగా
నా చిటికెనవేలు పట్టుకొని నీవు నడిపించినప్పుడు..
నీ వాత్సల్యం నేనేగా నీకు అమ్మనై పుట్టానని
నేనోడినప్పుడు నా మనోధైర్యం నువ్వేగా నాన్నా
నే నిలబడినప్పుడు నా ఆత్మస్థైర్యం నువ్వేగా
నలుగురిలో నన్నో గౌరవం పెనవేసినప్పుడు
నా ఆత్మగౌరవమూ అత్మవిశ్వాసమూ నువ్వేగా నాన్నా
అభద్రతాభావం ఆమడదూరమేగా నువ్వు నా తోడుంటే
జీవితమంతా నిశ్చింతేగా నువ్వు నా వెంటుంటే
నీ సలహాలు స్వీకరిస్తూనే పెరిగానుగా..
నీ విమర్శను సైతం అనుకూలంగా మలచుకుంటూ
నాలో బాధ్యతనీ నమ్మకాన్నీ పెంచింది నీవేగా
అవసరమైన స్వాతంత్ర్యాన్ని సైతం నాకందించి
కనురెప్పలా కాపాడావుగా కంటిపాపను చేసిమరీ
అందుకే..
అపరిమిత వాత్సల్యమే నువ్వంటే
నాకత్యంత ఆత్మీయనేస్తానివై నడిపిస్తుంటే..!!

//స్నేహితులు//





//స్నేహితులు//
జాగ్రత్త వహించక తప్పదేమో..
నేటి స్నేహితుల ఎంపిక విషయంలో..
అసలెందుకు మనకి...
ఎదుటివారిని చులకన చేసి మాట్లాడేవారు
మన వ్యక్తిత్వానికి విలువనివ్వనివారు
తప్పునుచేసి అంగీకరించే స్వభావం లేనివారు..
దయ..జాలి అంటే అర్ధమెరుగనట్లు నటించేవారు
పెద్దలను గౌరవించనివారు
తరచూ స్నేహితులను మార్చేవారు
స్నేహాన్ని లౌక్యంగా అవసరానికే ఉపయోగించుకొనేవారు..
అహంకారపు ఆజమాయిషీ చలాయించేవారు
అతిగా ఆశించి నియంత్రించేవారు
అపార్ధాలతో అసూయను తొడుక్కొనేవారు
మాటలనే ఈటెలు చేసి పొడిచేవారు
ముందు నడుస్తూ వెనుక గోతులు తీసేవారు
చేదుని తీపితాయిలమంటూ తినిపించేవారు
అసత్యాలకు ఆజ్యం పోసేవారు..
మన మూఢత్వాన్ని తమకనుకూలంగా చేసుకొని..
మననే మారణాయుధంగా మార్చే మనుషులకు దూరంగా ఉందాం..
నైతిక ధర్మం తెలిసినవారికి మాత్రమే చెలిమిని పంచుదాం..
లక్ష్యసాధనకు పునాది వేయాలని సంకల్పించినవారినే నమ్ముదాం
తప్పుచేస్తే సరిదిద్ది సంస్కరించేవారికే నేస్తమవుదాం..
మన బలహీనతలు తెలిసి ఆదరించినవారికే దగ్గరవుదాం..
ముఖ్యంగా స్నేహమనే పదానికి నిజమైన అర్ధం తెలిసినవారినే స్నేహిద్దాం..!!

//వలపు గోరింట//



//వలపు గోరింట//
అరచేత పూసింది అందమంతా..నా తనువు ఆనందమై నర్తించినంత..
ఆహ్లాదమయ్యింది చిత్తమంతా..ఆషాడపు నెలవంక వెన్నెలంత..
ఏ కుంచె చిత్రించెనో వింతనంతా..నీ కంట నా గోరింట తిలకించినంత..
మనసు నిండింది అక్షయమంతా..సరస సల్లాపరసమేదో తాగినంత.

//జీవితం//






//జీవితం//
కన్నుల్లో అగ్నిశిఖలు..
వదనంలో విషాదస్రవంతులు..
సనాతనాచారాలు రక్తంలో జీర్ణించుకున్నందుకేమో..
వీడిపోని నమ్మకాల వలలోంచి బయటపడక..
నిన్నల్లో కలిసిపోయినవాడి గురించి ఆరాటమెందుకు..
ప్రతీక్షణం అనుభవించే బాధ తగ్గిందని తలపోయక
విడిచిపెట్టి పోయాడని బాధెందుకు..
పాపపంకిలమంటూ నిందించే నస వీడిందని సంతసించక
జీవితం సర్వనాశనమయ్యిందని రచ్చకెందుకు
స్వేచ్ఛావాయువులు పీల్చే అదృష్టమొచ్చిందని ఆనందించక..
చీకటిదారాన్ని పట్టుకు వేళ్ళాడటమెందుకు
ఆశనిరాశల మధ్య అభివృద్దనే వారధి నిర్మించక..
నిరంతర పరిణామశీలమేగా జగత్తు..
అవ్యక్తమైన ఆవేశంతో నరాలు పోటెత్తితేనేమి..
అనుభవంలోంచీ జీవితం ప్రతికోణంలోనూ అవగతమవుతోందిగా..
మరణం ముగింపూ కాదుగా...జననం ఆరంభం కానట్లు..
అన్యాయం జరిగిందని ఆక్రోశించకు..
విప్లవాత్మకంగా ఆలోచించు..
అస్తిత్వం వీడిపోలేదని మాత్రం మరువకు..!!

//మౌనరాగం//





//మౌనరాగం//
చూపులు వాలినప్పుడు తెలియనేలేదు
కన్నుల కోలాటంలో నేనోడిపోయానని..
పెదవులు మూగబోయినప్పుడూ తెలియలేదు
మౌనరాగంతోనే నీతో ముచ్చట్లు మొదలెట్టాయని..
మనసు కంపించినప్పుడూ గమనించలేదు
ఊసుల ప్రకంపనలో తానూగి తేలుతుందని..
ఊహలు గుసగుసలాడినప్పుడూ పట్టించుకోలేదు
ఊహించని ఉత్సాహమేదో నాలో నింపబోయిందని..
భావాలు వెల్లువైనప్పుడూ భావించలేదు
నిన్ను రాయాలనే తొందరలో ఉరకలెత్తుతున్నాయని..
కొండగోగుపూల అమాయకత్వంతో నేను..
గండుతుమ్మెద కోరచూపులతో నీవు..
స్మృతులే కధలయినవిగా..అనుభూతుల బంతాటలో..
ఊహలే కలలయినవిగా.. వెన్నెలపున్నమి జాతరలో.

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *