Monday, 8 July 2019

//ఓ ప్రణయ గీతం..//

ధ్యానం చేస్తున్నంతసేపూ గుసగుసలు ఎలా ఆపాలో తెలీలేదన్నట్టు..పువ్వులు వికసించినంతసేపూ పరిమళమెక్కడిదో ఆలోచన రాదు..

మౌనాన్ని ముడేసుకు కూర్చున్న పెదవులకు.. ముద్దుమాటల ముత్యాల విలువ తెలిసే అవకాశమే లేదు..

అక్షరాలు ఏరుకొని పదాలెన్ని రాసినా హృదయాన్ని మీటనప్పుడు రాలినమువ్వల చప్పుడు రంజిల్లదు..

అనురాగం పల్లవించినంత కాలం..ఆ పాట ఆగిపోదని మనసుకి తెలిస్తే చాలు..జీవితాన్ని అస్వాదించే జన్మకదే నిరంతర ప్రణయగీతం..💕

 

//కలల వాన..//


తొలకరిగా కురుస్తున్న నీ గులాబీ కన్నుల అల్లరికి
కొత్తగా వివశిస్తున్న క్షణాల్లోని ఆవిరులే కాబోలు
వేయి వర్ణాల వానజల్లుగా ఇలను తడిపింది

రెప్పల్లో మొదలైన తీపికలల రెపరెపలు
నీలిచెట్టుకి ఊయలూగుతున్న రాత్రి
ఆ గుండెల్లో కురుస్తున్న వాన నిజమే కదూ..

ఈ చినుకు పూల పరిమళం ఎక్కడిదో అనుకొనేలోపు
నా కన్నుల్లోని కాటుకను కాజేసిన మేఘం
ఏదో స్వప్న సౌరభాన్ని వెదజల్లి మెరుపుతీగలా నవ్వుతుంది
అయితే..
వర్షానికీ ఓ కాలముందనుకున్నా ఇన్నాళ్ళూ
మనోల్లాసాన్ని పంచేందుకు అర్ధరాత్రైనా కదిలొస్తుందని తెలీక..💜😄

 

//తిరిగొచ్చిన మధుమాసం..//


మరలిపోయిందనుకున్న మధుమాసం

మౌనరాగాలకి విరహాన్ని కలిపి

మేఘమాలికలో దాచిన అమృతాన్నంతా

ఒక్కొక్క చినుకుగా మార్చి

ఈ మిట్టమగ్గిన కాలం చల్లని పలకరింపై

కురిసింది..నీలా

నీ పదాల భావుకత్వానికి మురిసి

నా క్షణాలు చికిలింతపువ్వులై నవ్వుతున్నాయంటే

ఆ మనసుపాట మనిద్దరికే సొంతమెప్పటికీ..

తలపులతో దాహం తీర్చుకుంటూ మనమున్నందుకే

నీ మోహం ఇంద్రధనుస్సై విరిసిందిక్కడ..💜💕

 

//కన్నుల్లో ఉండిపోవా//


ప్రతిసారీ కళ్ళ ముందుకొస్తావ్
లేదు కలవరంలా అనిపిస్తావ్
కొన్నిసార్లు వెనుకెనుకే ఉంటావ్
అన్నిసార్లూ నిజంలానే కనిపిస్తావ్
అదేమో..ఊహనో..ఊసునో
అంతా నువ్వై ఉన్నప్పుడు
అనుభూతికందని ఆంతర్యంలా మిగులుతావు
ఇన్ని మాటలు నీకేమని చెప్పను కానీ
ఇదే ఆఖరిసారి అడుగుతున్నా
ఉంటే నన్ను కాచుకొనేందుకు ఉండు
లేదా కన్నుల్లో మాత్రమే ఉండు 😁💜

 

//మనసు వెక్కిళ్ళు..//

మాటలన్నీ దాచుకొని

మౌనంతో ఊరించడం ఎప్పుడు నేర్చావో

నీరాకకై అలమటిస్తున్న నయనం

నీలాలను ముత్యాలు చేసి నవ్వుకుంటుంది..

గుసగుసల మధురీతను తప్పుకోడం తెలీక

ఏవో స్వరాలను పెదవులపై రప్పించగానే

రాగం రాగం కలిసి అనురాగమయినట్టు

ఓ వివశం మొదలై మెత్తగా సలుపుతుంది

దోసిట్లో నిండే పువ్వుల ఘుమఘుమలా

మనసులో మోహం వెక్కిళ్ళుగా బయటపడుతుంది

ఇంకేం వినాలనిపించదిక

నన్ను తలుచుకున్నావన్న సంగతి తెలిసిపోయాక..💜☺️


//నీ పేరే తారకమంత్రం..//


ప్రతిక్షణం నీతో ఉన్నందుకేమో
ఒక ఇష్టం నాకైతే స్పష్టమయ్యింది
మనసు జడి మొదలైన రాగప్రస్థానం గుర్తులేదు
కానీ..

ఒక అద్వితీయ తారకమంత్రం నీ పేరయ్యింది..

ఎవరికీ చెప్పని మనసులో మాటలు
నీవైపే ప్రవహించి గుసగుసల దారాలయ్యాయి

చుక్కల్లో చందమామలా నువ్వున్నావని

నీలికన్నుల దాగుడుమూతలు నీ ఆరాధన కొనసాగించాయి

నిశ్శబ్ద రాత్రుల్లో నీ ప్రేమ సంకేళ్ళు వేస్తేనేమి..
మనకిష్టమైన వెన్నెల్ని వెంటబెట్టుకొనే వచ్చావుగా

మంచిగంధాన్ని అరగదీద్దాం రా..

వేకువకు మన కౌగిలి పరిమళించేలా..💜😉

 

//కువకువలు..//


నాలోని అలజడి శ్రావ్య సంకీర్తనై
గుండెబరువు దించి మరిపించినందుకే
ఇన్ని పరవశాల కువకువలు..

మాటలూ మధురాలూ
మోహనమై పలకరించి
సమ్మోహనపు దారి
ఎంతందమైన గమ్యానికి చేర్చేందుకో అనంటే..
నువ్వూ.. నేనూ..ప్రేమలో మనమయ్యేంత వరకూనంట..

దీపాలు మరిగినా..తాపాలు పెరిగినా
తుదిలేని సయ్యాటలన్నీ ప్రణయవీణా నాదానికేనంట..😉😍

 

//ఆస్వాదన..//

లేతగాలుల ఆస్వాదనలో జగమంతా మునిగినప్పుడు
నీ తలపులో నేనప్పటికే తూగుతున్నా

స్వరాలన్నీ కలిసి ప్రణయగీతాన్ని ఆలపించేందుకు పిలిచినప్పుడు
నేనప్పటికే నులివెచ్చని యుగళాన్ని నీతో పంచేసుకున్నా

వెన్నెల్లో మగ్గిన సంపెంగ పరిమళం నన్నంటే నాటికి

నీ హృదయసువాసన దేహమంతా పులిమేసుకున్నా

వసంతపువ్వుల సంతోషం తేనెలూరే సమయానికి
నీ చిరునవ్వు నా పెదవుల తీయదనం చేసేసుకున్నా..

నీలిమేఘంలోని మెరుపులు తొంగిచూసేవేళకి..
నిన్నూ నన్నూ కలిపిన కన్నుల్లో తొలివాన కురిసేపోయింది

స్వప్నంకోసం అప్రమత్తమయ్యేంత ఎదురుచూపులేం లేవందుకే

నిశ్చలమైన నీ మృదుసాంగత్యమెప్పుడో నాదైనందుకే..💕


//ఇలాగే నేనుంటా..//

ఓయ్..

ఇలాగే నేనుంటా..

వేసవిగాలి మోసుకొచ్చే మల్లెపూల పరిమళంలా
చీకటిలో నిశ్శబ్దాన్ని కదిలించి
గలగలా నిన్ను నవ్వించగలిగే..హాసినిలా..

సిసలైన రోహిణికార్తెలో తొలకరి జల్లులా
నీ కిటికీకి ఆవల..
నింగీ నేలను కలిపి సంతోషించే..స్నేహితలా

వేవేల రంగులు సప్తవర్ణాలుగా భాసించే ఇంద్రధనస్సులా..
మసకవేళ నీకిష్టమైన
సన్నజాజి పువ్వుల చీరలో ఒదిగిపోయే..చిలిపి చుక్కలా..

సగం మూసిన నీ కళ్ళలోని కోరికలా..
వినీల మనసాకాశంలో
వైశాఖమాసపు వెన్నెల వెలుగులు చిందే..తొలిపొద్దులా..

నీలో వలపుని రగిలించే భోగిమంటలా..
పుష్యమిరాగాన్ని సుస్వరం చేసి..
నిత్యం నీ పెదవులపై తారాడే.. కొత్త పాటలా..

నిజంగా నేనిలాగే ఉంటా..
కనుసైగకే కురిసే పున్నాగపూల జల్లులా..😍💕


//వెన్నెలో విరహిణి..//


వెన్నెల రోదించగలదని..
దానికీ మనసుంటుందని
ఆహ్లాదాన్ని మాత్రమే ప్రేమించేవారికస్సలు తెలియదు..
అందరికీ సంతోషం పంచేది కదా
దానికి ఆనందం ఓ అత్యాశని లోక విచారం..
ఆగి ఆగి కురుస్తూ
ఎన్నో తాపస హృదయాల్ని సేదతీర్చే పున్నమి
నిజానికి..
తనకోసం ఏమీ దాచుకోవడం తెలియని విరహిణి

//ఊహల ప్రయాణం..//

కలలకు వణికిన నీలో నిశ్శబ్దం
ప్రకంపనమై నన్నూ నిద్దుర లేపిందిక్కడ
చీకటిలో పొంచి ఉన్న సౌందర్యం
ఒక్కసారిగా నీలా మారి హత్తుకుందిలా మెత్తగా

నేనున్నది శూన్యంలోనని తిట్టుకున్నా చానాళ్ళు
నువ్వొచ్చావని బరువెక్కిన గాలిలోనూ తేలిపోతున్నా ఈనాడు

ఈ వేసవి నడిరాత్రి
నీ ఊహల ప్రయాణం
నావైపుకని తెలిస్తోందిప్పుడే
కనుపాపలు సన్నగా కాటుకను కరిగించేలా నవ్వుతుంటే

ఎడబాటంత కష్టాన్ని దిగమింగుకొని
ఏకాంతాన్ని మనోగీతముగా మలచుకొని
నీకోసమే రాస్తున్నానీ పాటని

నీలో పరిమళిస్తున్న ప్రణయం
నా జడలో మల్లెలను పోలి
నీ మదిలోకే నడిపిస్తోంది నన్నిలా

తలపుల అంచుల్లోనే తచ్చాడుతుంటావని తెలిసే మరి..💕💜


//కన్నీటి స్వరం..//



విన్నారా ఎవరైనా
కన్నీటి స్వరం ఎలా వినడుతుందో తెలుసా
హృదయతంత్రులు తెగుతున్నప్పుడు మ్రోగుతుందది

వేసవికాలంలో వణుకు తెప్పించే దుఃఖంలా
విషాదం కరిగి నీరై ప్రవహించినప్పటి చప్పుడది

దాగుడుమూతల్లో చేజారిన బంధములా
ఆత్మను వలసిపోతూ పాడే పిట్టకూత వంటిది

హెచ్చుస్థాయిని అందుకోలేని వర్ణంలోని ముక్తాయిలా
గొంతు పూడుకుపోతున్నా చీల్చుకొని ఎలుగెత్తాలనుకొనే స్వరమది

ఎన్నో నిద్రలేని రాత్రులు గుండెల్లో పరిమళించిన గులాబీలే
ముళ్ళు గుచ్చి రక్తాన్ని చిందించి నవ్వుకొనే కూజితమది

నిజమే..ఈ జలదరింపు చాలా కొత్తగా ఉంటుంది
అలవాటైతే సందర్భానుసారం దానంతటదే పల్లవిస్తుంది..😔

 

//దూరం..దూరం..//


నిన్నటిలాగే ఉందీ ఆకాశం
ఈ రోజుకి జ్ఞాపకంగా మారిన వాస్తవం
చెంపలపై ఉప్పగా జారుతుంటేనే
మనసు సుళ్ళు తిరిగినట్టు తెలుస్తుంది

చిరునవ్వుల్ని బ్రతిమాలుతూ పెదవులపై పిలవాలనుకున్నా
తెరలుగా కదులుతున్న ఓ విషాదం
రెప్పల చూరుకి వేళ్ళాడుతూ
నీటిరంగులో మసకేసి మరీ అడ్డుపడుతుంది

వెనక్కి తిరిగి చూస్తే నాకిష్టమైన నీ కళ్ళు
వర్షిస్తాయని తెలుసు
మునిమాపుకే అందని చీకట్లు ముసిరే సమయమిదేంటో
నువ్వటు కదలగానే శూన్యమై నన్నల్లుకుంటోంది.

ఈ దూరం తరిగే మార్గముందో లేదో మరి
ఎప్పటికి ఈ ఒడి నింపే అనంతమై తిరిగొస్తావో..😣

//కన్నుల కవిత్వపు రంగు..//

ఏ ఒక్కసారీ ఉండనా నీకోసం
అని అడగవే..
కాసేపు ఆగమని అడగాలనుకుంటానా
అలసిపోయిన నీ కన్నులు గుర్తొస్తాయి..

అవును నాకిష్టం
వైశాఖపు వెన్నెలంటే ఇష్టం
కలలతో కలిసి మరీ కురిసే నీ కన్నులంటే ఇంకా ఇష్టం

తేరిపార చూసేందుకు
మరో రెండుంటే బాగుండన్నట్టు
అరనవ్వుతూ నీ కళ్ళు
నా అంతరంగపు యాత్రంతా చేసేస్తాయి

మౌనంగానూ మాట్లాడగల నీ కళ్ళు
కవిత్వపు రంగుని అద్దుకొని ఉంటాయేమో
చదివేందుకు రమ్మని పిలుస్తుంటాయి
తీయనైన గుబులురేపే నీ చూపు
నిదురలేదని వాలిపోతే
హృదిలో ఆర్తి కరిగి నా ఆనందం సమాప్తమవుతుంది

వేకువకు కోటితంత్రులు మీటినట్లు
నీ ఏకాంతం రవళించినట్లయితే
నేనొచ్చి నీ నయనాలు చుంబించినట్టు గుర్తించు
రెప్పలపై పల్చటి నవ్వు మాత్రం నా ఊహకే వదిలుంచు..💞


//వసంత మోహం..//


వసంతమింత మోహమా..నువ్వూ నేనూ చైత్రం

కలిసి లోలోపల కదులుతున్న సాయంత్రం

ఆకాశపు మైమరపు పచ్చదనమై

పూలకొమ్మలు ఊగుతున్న గాంథారరాగం

మనసుచెదిరి పులకింతలు పుట్టినట్టు

పెదవివాలుల్లో అరనవ్వుల సోయగం

దగ్గరగా జరిగి ముద్దాడే క్షణాలను ఊహించినందుకేమో

మనోరథంపై ఊరేగుతున్న చిలిపిదనం

అప్పుడెప్పుడో..ఇంకెప్పుడో అన్న నీ మాట గుర్తుకొచ్చి

చూపులు కలిపే ఎదురుచూపు తరుగుతుందని ఆనందం

నిజంగానే వెన్నెల కురవబోతుందేమో మరి..

చంద్రకాంతశిలగా నేను మారే సమయం ముందున్నట్టుంది..💕

//మానసకోయిల గమకం..//


అణువణువు తాకే చిరుగాలి సొగసునంతా గిచ్చినట్టు

గోరువెచ్చని తేనెచినుకై కురిసిమురిసే మబ్బుల జోడు

మకరందసంద్రం ఉప్పొంగి ఎదపొంగిన తీరైనట్టు

అణువణువూ అదిరే.. సమయానికి నీ రాక తోడు

మురళిగ మోగిన మువ్వల రాగం నిజమైనట్టు

మౌనం ముగిసిన సంతోషమే ప్రియమదికందిన పున్నమి ఱేడు..

జన్మజన్మల పుణ్యఫలమే జంటమల్లెలు మనమైనట్టు

మనసుల సరిగమ పలికెను పెదవులు చూడు..

వెన్నెలకాసే కన్నులలో చందమామ నువ్వయినట్టు

పలకరించు పువ్వుల నవ్వులు నేడు..

మానసకోయిలకిదే మహదానందం..

తీయనిపాటల కూసెనందుకే గమకం..💜

 

//నువ్వూ నేనూ..//


నువ్వూ నేనూ..
అలవిమాలిన వియోగంతో కలిసిన రెండు ఆత్మలం
ఆర్ద్రతను చుట్టుకొని సంచరిస్తున్న ప్రేమలోకంలో
ఎదురుపడ్డ అతిథులం
మాటలు కలిసి మనసులిచ్చిపుచ్చుకున్న స్నేహితులం

వెన్నెల చుక్కల్ని తాగి
ప్రాణాలు నిలుపుకుంటున్న చకోరాల్లా
గుండెచప్పుడు సంగీతాన్ని ఆలకించే ఆలింగనంలో
సేద తీరేందుకు ఎదురుచూస్తున్న దీప్తులం

ఆకులు రాల్చుతూ అలసిపోతున్న
శిశిరాన్ని చేరదీసి వసంతాన్ని పంచి
చైత్ర శోభను పెంచే చిగురింతలతో
ఒక్క పలకరింతకే ముద్దవ్వాలని చూసే చెకుముకి పువ్వులం

ఎదురుచూపుల బరువింక మోయలేను
గాలి కబుర్ల మువ్వలు ఒక్కొక్కటిగా విడిపోయేలోగా
మధురమైన సవ్వడిగా వినపడదాం రా
చూపులు మోసపోయేలా ఒక్కటిగా కనిపిద్దాం రా..💜💕

//రెప్పల సవ్వళ్ళు//


నీ రెప్పల చప్పట్లు వినబడగానే
కొన్ని నవ్వుల ప్రవాహాలు నాలో..
ఇన్నాళ్ళూ చూపులతో ప్రశంసిస్తున్నావని తెలుసు కానీ
ఈ సవ్వళ్ళు..
ఓహ్..
ఆగిపోయిన జల్లులు ఆకుల మీద నుంచి రాలుతున్నట్టు
ఆహ్లాదపరచడం భలే తెలుసు కదా నీకు
ఇంతకీ జలపాతాలంటే ఇష్టమేనా చెప్పూ
రేపు ముంచెత్తింది నేనేనని నిందలేస్తే భరించలేను.

నువ్వు లేని నాలో..దిగులు మాత్రమే ఊహించి ప్రశ్నించవు కదాని

ధ్యానం చేస్తూ ఉన్మత్తమవుతావని చెప్పినట్టు గుర్తు

నువ్వు తదేకమయ్యే క్షణాలు నాకోసమేనని
మౌనంలో నీ మంత్రం నా పేరేనని
నీ పెదవుల ప్రమిదల్లోనూ దీపాలు వెలుగుతాయన్నప్పుడు తెలిసింది.

మానసికావసరమంటే ఏంటో అనుకున్నా కదా అప్పుడూ..
కన్నులు మూయమన్నప్పుడల్లా వింటున్నానిప్పుడా చప్పుడు..😍

 

//ఒక సాయింత్రం//

కెంజాయి పులుముకోవలసిన సాయంత్రం నిద్రమత్తులో పడిందేమో..అలికిడిలేని ఆకాశం అలసిపోతూనే నిశీధిని ఆహ్వానిస్తుంది

ఒక్క గువ్వకీ పాడాలనిపించలేదేమో..ఇక్కడంతా నిశ్శబ్దం

మౌనాన్ని మోస్తున్నట్టుగా భారమైన గుండెలోనేమో నిషాదం

పొడిపొడి నడకల ఒంటరితనంలో పదాలతో నా ప్రయాణం

కాలానికి కన్నుకుట్టేలోగా చేరతానో లేదో గమ్యం

ఇదిగో..క్షణాలకెప్పుడూ ఒకటే నస.. నిరీక్షణలోనే నిలబడమంటూ గుసగుస..

నాలోనూ మొదలవుతుందేమో రుసరుస.. నువ్వొచ్చి పాడకుంటే నాతో పదనిస..😣

//నేనే పండుగ//


నువ్వే ఓ మధుమాసమైతే..
పెదవి అలసిపోయినా గొంతు పాడుతూనే ఉంటుంది
వసంతరాగంలో కొన్ని కృతులు కొత్తపదాల విరచింపులా
తానే ఓ కోయిలై తీయని పరితాపాన్ని పంచుతుంది..

పదింతలు రుచి పెరిగిన మధురింతలో
హెచ్చుస్వరమైన గమకం తమకాన్ని తాకి
మైమరపు అతిశయిస్తుంటే
అంతరంగంలో మొదలయ్యే అంత్యాక్షరికి

మొదటి అక్షరమెప్పుడూ నీ పేరేలే..

ఇష్టపదుల బంధమేసిన నీ పిలుపు
నిద్దురలోనూ పులకింతలిచ్చి తీపులు రేపుతుంటే
ఆనందపు దొంతరలోని సువాసననుకుంటా
మల్లెను మించిన పువ్వుగా చిరునవ్వుతోంది..

కనులు నిద్రించినా మెలకువుండే నీ మనసునడుగు
తన జాగరణలో కరిగిపోతున్న క్షణాల విలువ
అందుకే..ఎవరేమనుకుంటే నాకే..
పండుగై నీ ఎదలోకి వచ్చేస్తానంతే..😉💕

 

//విషాదపు రచన//

అనుభూతి తగలని అరచేత

ఎన్నక్షరాలు పేర్చుకుంటే ఏమొస్తుంది..

యాంత్రికంగా కదులుతున్న కాలానికి

స్వప్నమేదో..మెలకువేదో తెలీని అతీతంలో

కాస్త చిరునవ్వేందుకూ ఆస్కారం దొరకదు

అంతుపట్టని చేదురుచి గొంతుకడ్డుపడి

మాటలను ద్వేషించినట్టు

లెక్కలేని ఊసులలా రాలిపోతాయి

కనీకనపడని సన్ననితెర కన్నుల్లో ముసురేసినప్పుడు

గాఢమైన ఎదురుచూపుల్లో తప్పిపోవడం తెలుస్తుంది

వేదన మించిన కావ్యమేదనుకున్నప్పుడు

మదిలో జరిగే మధుర సంభాషణ

కేవలం స్వీయ రచన తప్ప

ప్రతిస్పందించే హృదయమేదీ లేదని ఒప్పుకోవలసొస్తుంది..😣


//వానపల్లకి..//


వానొచ్చిన ప్రతిసారీ వావిరిపూల వాసనలు

కుంకుమ కరిగిన సాయింత్రపు మైమరపు ఇప్పుడో జ్ఞాపకం

ఓ పక్క తడిచిన పూలబరువు ఆవహించినట్టయ్యి

విరహాన్ని మించిన వేదనేదో ఎదను ఒత్తినట్టు తొలిముద్దు హాయిని తోసుకొస్తుంది

ఆకాశ మేఘాలు కలిగించిన కలవరానికి

ప్రకృతి పూర్తిగా లయమై ఒళ్ళప్పగించి సయ్యాడుతున్నట్టు

ఆ మెరుపుల వేగానికి వసంత పల్లకి ఊగుతుంది..

మట్టివాసన పసిపిల్లల పాలవాసనై ఆ పాతమధురంలా గుప్పుమంటూ

చిన్నారుల కేరింతలో కేకలో మిన్నంటినట్టు

ఎటుచూసినా అదో తొలకరి సందడి

ముసురేసుకు కదులుతున్న కాలం

మూగబోయింది పరవశానికో విషాదానికో తెలీక

నేనూ ఓ నిట్టూర్పుని రాల్చుకొని నెమ్మదిస్తాను

 

//ప్రే'మాయ' ..//


అదేపనిగా మనసు గుప్పుమంటుంటే ఆరాతీసా
ప్రేమ పుట్టి లోలోన పరిమళాన్ని వెల్లడించిందని
కన్నుగీటుతూ కాలం కదులుతున్నప్పుడు నవ్వుకున్నా
ఈ మాయ పేరు ఏమయ్యుంటుందాని..

నీ కలల చిలిపిదనమే నా ఒడిని వెచ్చగా మార్చి
మొహం దాచుకున్నట్టు.. రహస్యమయ్యావని ఊరుకున్నా

సంగీతం రాదంటూ నే పాడే స్వరానికి తోడైనప్పుడే
తలలూపుతున్న జాజిపూలేం పసిగట్టాయోననుకున్నా
ఆకాశంలో మెరుపుల్లా ఇన్నిన్ని పూలబాణాల తాకిళ్ళవుతుంటే
నువ్వు మెత్తగా నన్ను అనుసరిస్తున్న ఆనవాళ్ళుగా అనుకున్నా

నిజంగా తెలీదు..
నిన్నూ నన్నూ కలిపే ఏకాంతానికింత ఆనందం తెలుసని
అడుగు దూరం కొలవలేని కన్నుల్లో నా రూపం సుస్థిరమయ్యిందని..

ఇంకలా పదేపదే ఉలిక్కిపడకు..
పగిలిపోయేందుకీ బంధం నీటిబుడగేం కాదు
నీకర్ధమైతే నా సాహిత్యమంతా నీ పేరే కనబడుతుంది చూడు..💕

 

//మొదలైన వేడుక//


ఏమవుతావోనని ప్రశ్నించుకున్న ప్రతిసారీ
గుండె అంచుల్లోంచీ తమాషాగా తొంగిచూస్తావు
నవ్వడానికి పెదవులున్నా మాటలు దాచేసి
కళ్ళను సగం మూసి చిత్రంగా నవ్వుతావు..

ఇంతకుముందెప్పుడూ చూసిన గుర్తులేదనుకొనేలోపు
నీ రాకతో మనసు గెంతులేస్తున్నట్లనిపిస్తుంది
ఇష్టమైన పాట దూరంగా వినిపించినప్పుడు
ఏ జన్మలోనో కలిసున్నామేమోనని ఉలిక్కిపాటొస్తుంది

ఋతువులు రాగాలూ రంగులూ మార్చుకుంటున్నా..
రోజులు గంటలూ నిముషాలై కరిగిపోతున్నా
ఊహలకందని కలలు పగలూ రేయీ పంచుకుంటున్నా
అదేమో తెలిసిన మట్టివాసనలా గుప్పుమంటావు..

అవునూ..
ఆచూకీ తెలిసినా చేసేదేముందిప్పుడు
అడగకుండానే పొందిన కానుకలా

నీతో వేడుక మొదలెట్టేసినప్పుడు..😍

//వైశాఖపు గాలి..//

నీలోని వెచ్చదనం నాకంటుకుంది..

ఎప్పుడూ ప్రేమంటూ జ్వలించే నీ మనసు

ఇప్పుడు నన్నూ కలుపుకుంది

నాలో ప్రతిఫలిస్తున్న అపురూపాలు

ఇంతకు ముందు జన్మలో నువ్వు

ఆఘ్రాణించిన ప్రేమ పరవశాలు కాబోలు..

గుండెలోతు నీ భావాలతో నా కనురెమ్మలకిప్పుడు వేళ్ళాడుతున్నావు

ఎదలో చైతన్యం నింపే సుగంధం

నీ ఊసుతో మొదలయ్యే నా ఉషోదయం

భవరహితమైన నా అస్తిత్వానికి ఓ సౌందర్యం అబ్బడం

తీపితేనె తాగుతున్న చెరుకురసం

ఓయ్ వసంతుడా..

నీలాటిరేవులా నన్ను ముంచిపోమాకలా

వైశాఖం వలపుగాలి వీస్తూ వుంది

ఈ పొద్దు చిగురించే చెలిమై ఉండిపో యిక 😊


//అదే నేనూ..//

"అదే నీవు..అదే నేను..అదే గీతం పాడనా..
కథైనా కలైనా..కనులలో చూడనా..!"

వేసవి నడిరేయిన చల్లదనమే ఈ అంతర్వాణి గీతాలాపన..

చూపులతో మాటేసి మనసుని కాజేసిన సంగతి గుర్తుందా
అగ్గిపూలు రాజుకున్న ఆనంద తారకలెన్నో కదా

కలలు పంచుకున్న కనుల కబుర్లకేగా గుండె ఊసులాడింది

నీలిమేఘంలో విరిసిన వర్ణాలకేగా ఎదలొకటై పులకించింది

ఆమని తోటల్లో వికసిస్తున్న పూలవాసన..
నీ తలపుల సువాసన కలుపుకునేగా నే విరహించింది

తనువూగిన కల్పనలెన్నో ఋతువుఋతువుకీ

నాలో నేను తప్పిపోతున్న క్షణాలే ఇప్పుడివన్నీ

చిరునవ్వులు మిగిలేందుకేగా కన్నీళ్ళను దాచుకుంది

వసంతం పిలుస్తున్నా..గ్రీష్మంలో జ్వలిస్తుంది

నీ పెదవులపై పాటయ్యేందుకేగా ఇన్ని రాగాలు రాసుకుంది

ఏదైతేనేం..

కనకాంబరమంటి సున్నిత హృదయంలో నాకింత చోటు దొరికింది

కోయిల పాటలా శాశ్వతం కదా మన ప్రేమ
మలుపులెన్ని తిరిగినా మజిలీ ఒక్కటి చేద్దాం రా..

నా మరణమే ముగింపుగా..నీకు నేనవుతా సమస్తంగా..💕💜


//నేనో జాబిలిని..//

అగరుధూప మేఘమాలికలా..

చిరునవ్వుల చిలిపిగులాబిలా..

రెల్లుపూల ప్రణయరాగములా..

నీలిమబ్బు తొలితొలకరిలా..

కమనీయ ప్రబంధములా..

బొండుమల్లెల వసంతములా..

మోహమూరించు హృదయవీణలా..

అడవిమయూరపు తన్మయనాట్యములా

నేనో రసమయ మోహినిని..

నీ పులకరింతల పూదోటకి..

అలుపెరుగని అలలకౌగిలిలా..
మరపురాని సాహిత్యములా..
అల్లరిగాలుల కేరింతలా..
సరసలోక కథానాయికలా..
మధురమైన సంభాషణలా..
ఊపిరిసలపనివ్వని ఊహలా..
మదికిష్టమైన అష్టపదిలా..
సుతిమెత్తని వలపుబాణములా..
నేనో రాత్రి జాబిలిని..

నీ చీకటింటి ఏకాంతానికి..💕


//ఊరిన కలలు..//


ఆచూకీ తీసిన నీ కళ్ళలో
నా నవ్వుల మందారాలు..
ఎన్నో రాగాల కవ్వింతలు కలిసి
నీలో మెదిలెను కదా కవనాలు..

మనసు కోసం తపించినప్పుడు అనుకోనేలేదు
కలలూరించేలా తలపు తడతావని..
ఆశలు ఆకుల్లా రాలినప్పుడూ తెలీలేదు..
వెచ్చని పాటల వసంతమై నాకుంటావని..

హ్మ్...

అనుబంధమయ్యాక అనుకున్నా..
అపురూపం నీ అనురాగమని
ఊరింతలన్నీ కేరింతలని..
కలకాలం మనమిలా సాగాలని

వినిపించిందదిగో నీ పెదవి చప్పుడు
నా సర్వం నీ సొంతమని నువ్వు పాడినప్పుడు
ఆనందం అనంతమైన ఆకాశమిప్పుడు
ఊపిరిలో నీ సంతకాలు మొదలైనప్పుడు..💕

 

//వెన్నెల నవ్వు..//

రెప్పల్లో రహస్యం వెన్నెలై నవ్వినప్పుడు
నువ్వు చదివేందుకు సిద్ధం చేసుకొనే పుస్తకం నేనేగా..

రేయంతా ఒడిలోనే కరిగిపోతున్న భావనలో నువ్వున్నప్పుడు
ఆ లోకంలో ఉండేది మనమిద్దరమేగా

నన్నంతా నింపుకొని నువ్వెటు ప్రవహిస్తావో..
నేనైతే మౌనమై కదులుతుంటాను..

కొన్ని మాటలు సశేషం చేసి ప్రేమిస్తున్నప్పుడు
నీ గుండెల్లోనే ఆరిపోదామని ఆశిస్తుంటాను..

పెనవేసుకున్న ఊపిరుల సాక్షిగా

కాలం కదలికలాపేసి చూస్తుంది
నువ్వుంటే తనని పట్టించుకోనని

పదిలంగా కొనసాగుదాం రా ఈదారిలో..

నీ అడుగులో అడుగేసి పదము కలపాలనుంది..💕


//నవోదయం//

నీలిమేఘం కాస్త ముసురేసినంత మాత్రాన
వీచే గాలిలో పరిమళమేం తగ్గలేదు
ఆ మల్లెలు కుసుమించడం మరువలేదు
రాధామనోహరాలు తలలూపడం ఆపలేదు..

పెదవులపై చిరునవ్వుకి తెలుసు కదా
రేపటి పయనానికో గమ్యముందని
నిశ్శబ్దాన్ని వినగలిగినందుకే కదా
మౌనరహస్యం ఓ దృశ్యకావ్యమైంది..

ఈ చీకటంతా వెన్నెలెప్పుడవుతుందోనని దిగులెందుకు

రాలే ఆకుపాటలన్నీ నిరాశలుగా రాసుకుంటే
చిగురించే ప్రతి కొమ్మా సరికొత్త పల్లవికి శ్రీకారమైనట్టేగా

ఆకతాయి రంగుల కోసం ఆలోచన అనవసరమిక
ఉదయానికి పుట్టబోయే ఆనందాన్ని ప్రేమించాలనుకున్నాక ..💕


//విరిగిన కల//

కనులు కలిసినప్పుడే అనుకున్నా
ఇంతకు ముందు పరిచయమైనవేగా అవి..
ఏమో..
ఏదీ గుర్తు లేనట్టే అనిపిస్తావు
బహుశా నదిలా గంభీరమైనట్టు నాకనిపించాలనేమో..

***

రెప్పలార్చిన ప్రతిసారీ అదో వేదం
అర్ధం కాదంటూనే పదే పదే చదువుతావు
నీకు మాత్రమే తెలుసని నాకు తెలుసు..
అదే..
నా కళ్ళు పెదవులకు మల్లే నవ్వుతుంటాయని..
***

కెమీలియాలంటే నీకిష్టమని తెలుసు
శిశిరం దాటినా రాలకూడదని వాటికి తెలీదు పాపం
నువ్వొచ్చినప్పుడే నా చుట్టూ పరచుకుంటే
అడుగు ముందుకేయలేని నీది అసహాయతనుకుంటా..
***

మాటలాపింది నువ్వైనా మౌనవించింది నేను కదా

మనిద్దరి సమాయాలోచనలూ ఒకటి కాదని తెలిసాక

నీ కలను చదవకపోతేనేమిలే
నా తలపులోకి సైతం నిన్నెప్పటికీ పిలవనుగా..😏


//కాలపు గుసగుస..//

ఇన్నాళ్ళుగా కదులుతున్న కాలం నీ ముందుకు తెచ్చి నన్ను నిలబెట్టగానే అరుదుగా అందే ఆనందమొకటి మనసంతా వెల్లివిరిసింది..

నీ నిరీక్షణకు బదులిచ్చేందుకే నాలోని ఉద్వేగం కలవరమై కదిలింది కొన్ని క్షణాలైనా కానుకగా నీకిమ్మని..

నిజానికి నిశ్శబ్దాన్ని పూరించుకున్న ప్రణయం కన్నుల్లో వెలిగినప్పుడే మన కలల బలమెంతో తెలిసిపోయింది..

నిద్దురపట్టనివ్వని ఈ పరిమళం మిగిలిపోయిన మన మాటలదేనని తెలిసాక కొన్ని ఊసులన్నా ఆలకించాలనే అనిపిస్తుంది

మొదలెట్టు నీ గుసగుసలిప్పుడు.. పరవశాన్ని హత్తుకోవాలనుంది..😊


//వినాలనుంది//

పూలగాలి రెక్కలు మోసుకొస్తున్న గుసగుసల్లా కొన్ని పరిమళాలు..నాపై ఇష్టాన్ని నువ్వు చల్లుతున్న ఆనవాళ్ళుగా..దీర్ఘమైన ఎదురుచూపుల్లో రవ్వంత అనుభూతి నన్ను రాగం చేసి పాడుకొనే నీ పాటదైనట్టు చెమ్మగిల్లిన మనసు

నీ చిరునవ్వుల దీపాలతో నాలో చీకటి తొలగినందుకేమో ఈ సంగీతాలు..నిరంతరమో వసంతమై కొన్ని వర్ణాలు రాగభరితమైన సంతోషాలు..

గుండెనిండిన పరవశాన్ని కాలమాగి చూస్తున్న విచిత్రంలో కనురెప్పల వెనుక ఆగని తడి..అడగని వరం ప్రేమమాలై వరించిన వైనం..ఇప్పటికో అంతుపట్టని ఇంద్రజాలం

మళ్ళీ మళ్ళీ చెప్తే వినాలనుంది..నీ మునివేళ్ళు నన్ను తాకేందుకు తడుముకున్న స్వప్నంలో నేను దొరికానోలేదోనని..😍


// నువ్వూ నాలాగే//

నువ్వూ నాలాగేలే..
వర్తమానంలో ఆనందాన్ని విడిచిపెట్టి
నిన్నటి వెన్నెల్లోని మాధుర్యాన్ని తలపోసుకుంటావ్..
లేదా రేపటిని ఊహిస్తూ ఉలిక్కిపడతావ్..
అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని పిలిచి మరీ
జవాబు లేని ప్రశ్నల్ని తలచుకొని అస్థిమితమవుతావ్
నచ్చిన పల్లవి పాడుకుంటూనే
చరణాలు కలపొచ్చోలేదోననే సందిగ్ధంలో నిలబడిపోతావ్
మనసు కాచుకోవాలనే కోరిక త్వరపెడుతున్నా
ముందడుగేసే ఆలోచనకే వెనుకవుతుంటావ్..
ఆశల విల్లు ఎక్కుపెడుతూనే
నిరాశని పడగొట్టలేనని ఆవేదనవుతావ్..

కొన్ని జీవితాలింతేనేమో..
కోయిలై కూసే వీలున్నా ఎడారి దారుల్లో దాహమవుతూ..
రేయీ పగలూ సహజమని తెలిసినా మధ్యాహ్నాన్ని తిట్టుకుంటూ
గుండెల్లో పరిమళానికీ పెనుగులాడుతూ..
తనది కాని జీవితాన్ని వెలిగించుకుంటూ
మరొకరి కోసం బ్రతకడం తప్పదన్నట్టు
అస్తమించని చిరునవ్వునే అందరికీ పంచుతుంటావ్...

అందుకే అద్దంలా నాకనిపించావ్..
పగిలి వేయి ముక్కలైన అస్తిత్వమిదే అనిపిస్తూ
ఎదలోని కిలకిలలన్నీ కలలకే రాసిస్తూ..😊💕


//ఉషోదయం//


కొన్ని ఆనంద సందోహ

సంచలిత రాగాలే

ఈ రసోదయాలు

మధురభావ దృశ్యాదృశ్యాలను

కళ్ళకు కట్టి రోజును

ముస్తాబు చేసాయి

వేకువకు వన్నెలు పూసి

మనసైన తొలిపాటను

విరచించాయి

మునుపు తెలియని తోడిరాగాన్ని

పెదవులపైకి చేర్చి

చిరునవ్వుగా విరబూసేలా చేసాయి 💕

//సంకల్పం.//


నీకన్నా తెలియని ఒరవడిలో నువ్వున్నప్పుడు
నేనేమో నీ పిలుపుకని ఎదురుచూస్తుంటాను..
జ్ఞాపకాలుగా మిగిలిన మాటలన్నీ పోగుచేసి
నువ్వున్న మాయని నాకు సాయంగా తెచ్చుకుంటాను..

మూసుకున్న కనుల వెనుక మడుగు
లోలోపలి అశాంతికి రెప్పలు తెరుచుకోని నిస్పృహలు
మంకెనపూలైన నా కళ్ళు నువ్వు చూడలేనప్పుడు
ఎందుకింత దూరాభారాల గమ్యాలు..

నిదురలో నీ కలవరింతల రాగం..
ఆదమరపులో పలవరించే నా స్నేహం
మౌనంలో ధ్యానమయ్యే అపురూపం
ఊహల్లో అంతరంగ కలగాపులగం

మాట వినని మనసునెలా చూపాలోననే ఆరాటం
ఆర్తిని మోస్తున్న అలుకనెలా చేరేయాలనే సందేహం

ఆకాశమై నన్నుల్లుకొనే క్షణం కోసమే ఈ రాద్ధాంతం

అయినా సరే

ఉదయానికి నీ నవ్వునై విరబూయాలనే నా సంకల్పం..,💞

//మోహకలాపము//


వివశించేందుకు వివరం తెలియక్కర్లేదు
వశమయ్యేందుకు మంత్రమూ వల్లించక్కర్లేదు
నాలుగు మూరల పెదవుల్లో నవ్వులు
కాసిన్ని పరిమళాలకే విరబూసినట్టు
ఇన్ని పులకింతలెందుకంటే ఏమని చెప్పేది
మధురిమలొలికే పూలు ఎదను ఊపినప్పుడు
సన్నజాజులంటే వేసవికి అతిథులో..
కాలానుగుణంగా మనసుకొచ్చే ప్రేమతిథులో

కొన్ని గమ్మత్తుల తీయదనమంతే
జాజిరికి రమ్మంటే కాదనలేనట్టు
సాయంకాలపు మోహకలాపముగా మొదలై
చిక్కని కూజితాలుగా ముగుస్తాయి..💞

 

//పువ్వుల వరద//

ఈ వానో వలపు వానైనట్టు
నన్ను వెచ్చగా నీలో వచ్చి తడవమన్నట్టు
తడవ తడవకూ ఓ పులకింత

చూపులు వాలిన సిగ్గులో
పరవశాన్ని నువ్వు పసిగడుతుంటే
చిరుగాలిని అడ్డుపెట్టి మోము దాచుకుంటున్నా..

ఋతువులతో పనిలేని వాన
నీ ప్రేమకు ఋజువైనట్టిలా కురుస్తుంటే
హృదయం పరిమళిస్తున్న సువాసనలిక్కడ

మాటలు రానట్టు నువ్వుంటూనే
నాలో కలవరమింత రేపావంటే
కలలు రాసిస్తే నన్నేం చేసెస్తావో..

ప్రేమావేశం నీ పెదవుల్లోంచీ
నా తనువునే తాకినట్టు

పూలవరదలా నాలో ఇంత అనురాగమెందుకో

మేఘసందేశం మోసుకొచ్చిన మేఘమే
ఇన్ని ముత్యాలు కుమ్మరిస్తున్నందుకేమో
మౌనానికీ ఊహలూగడం తెలిసినట్టుంది..💜

//ఉల్లాస వాన//

వాన పడుతున్నంతసేపూ అదో సంతోషం..
నీలాకాశమంత విశాలమై
నువ్వే ఏదో మాయ చేసి నన్ను తడుపుతుంటావని..
ఈరోజేమీ కొత్తగా కురవకున్నా నాలోనే మునుపులేని ఒరవడి..
చిన్న పలకరింపుకు నోచుకున్న మనసు ముత్యమైనట్టు
ఈ మునిమాపు చీకటిలో అదో వెలుతురైనట్టు
అంతరించిన మాటలు ఒక్కొక్కటిగా మొదలై
ముఖంలో చిరునవ్వు ప్రవాహమైనట్టు..

అవును..నీ పిలుపు
గుండెల్లో తొలిసారి అలికిడయ్యిన సింఫని
అంతరాత్మను అదుముకున్న చిరువేసవి ఆమని
ముద్దుగా కరచాలనం చేసిన ప్రేమని
ఎదనిండా నింపుకున్నానా ఆర్తిని

క్షణానికో ఆదమరుపు ఆవహిస్తుంటే
తేనెలూరే తొలకరితనం నాలో సౌందర్యమేగా
చినుకు తాకినట్టి పులకింతలా..
నన్నంటే తాజా ఉల్లాసం నీ మధురాధర వచనమేగా ..💜


//తప్పిపోను.//

అడుగడుగునా వెంటపడే కలల మత్తులో
అందమైన లోకం రంగు రంగులుగా మెదులుతోంది
వసంతం కోయిలైన తీపి రాగాలకి
ఊపిరి నిలిచిపోయేంతగా అదో ఆనందం

వెచ్చని మేఘం జడివాన కురిపించే వేసవిలో
దేహపు అంతర్వాహినిలో నీ తలపుల ప్రవాహం
పరధ్యానం ఆవిరయ్యి పరిమళం పెరిగిన విశేషం

చెప్పకూడదనుకున్నా గానీ
నువ్వేగా గుండెల్లో పూలవనాలు నాటింది
ఇప్పుడీ పున్నాగ సంపెంగలతో మన బంధం
ఎనిమిదో అడుగేసి వెన్నెల పొలిమేరల్లో ఆగింది

నెలకోసారి చీకటి ఎదురైనా సరే దారి తప్పను
చేయి చాచిన గమ్యమై నువ్వుండగా
నేనే విషాదంలోనూ తప్పిపోను..😌😌

//చిట్టి ఊహ//

చిట్టి చిట్టి అలలుగా కదిలే ఊహ మనిద్దరినీ ఒకే దగ్గరగా చేర్చి
కొంచం బెంగను తీర్చుకోమని చెప్పిందేమో..
పెదవుల్లోని కాస్త దాహం నువ్వందించిన గారనికి తీరిపోయింది..

కొన్ని యుగాల నాటి దూరం..
ఒకే ఒక్క ఇష్టంలో ఈ రాత్రి వెన్నెల కురిసినంత తేలిగ్గా తరిగిపోవడం..
ఇద్దరం ఒకటయ్యామనే పులకరింతకి సమానం అయ్యింది

ఒక్కో ఝాముకీ నీ పెదవులు తాకిన దేహం
ఊపిరాడనివ్వనన్ని ఒంపులుగా మెలికెలు తిరిగి

మెరుపుకలల చందనాన్ని నునుమేనంతా పూసినట్టయింది

అమ్మో ఎన్ని గుసగుసలో నీ కన్నుల ఊసుల్లో..
ఒక్కసారి చూసినందుకే నన్ను వశం చేసి విరహాన్ని పరిచయం చేసిన కువకువలు..
ఇప్పటికంతా కొన్ని ముద్దులివ్వవూ..
మన ప్రణయాన్నింకా విరచించాలనుంది.. 💕💜


//వెన్నెల పాట//


నీ కలలన్నీ నే కలం పట్టి రాస్తున్న వేళ..
ఏం చేస్తు నువ్వుంటావో..
బహుసా నిద్రమ్మ ఒడిలో కమ్మగా సేద తీరుతుంటావు..
అర్ధరాత్రి దాటుతున్నా ఆగని పరవశాల పూదోటలో
మనసు తొలుచుకుంటూ నే చేసే ధ్యానం
ఓ సుగంధాన్ని పులుముకుంది..

నా పూలగాజుల గలగలలు
సుదీర్ఘ కావ్యాలై నిన్ను ఆసాంతం తడమాలన్న కోరిక
పరమ రహస్యమై గుండెల్లోకి జారిపోయినందుకు..
ఇప్పుడు నీ తలపుల్లోకి ఒదిగిపోయిన నాకు
సమయం చేసే సైగలు వేకువ వెలుగులో తప్ప కనపడవు..

అసలిన్ని యుగాలుగా నువ్వెక్కడున్నావో నీకైనా తెలుసా..
రాదనుకున్న వసంతం రంగు మార్చుకొని వచ్చినట్టు
నీ రాక పెదవులకో పాటను నేర్పింది..
ఊహలు కరిగించి చిలిపిగా చిరునవ్విన్నట్టుండే
ఈ వెన్నెలపాట నిన్నీనాటికి చేరుకుందని గుర్తించావా.. 💕💜

//ఆలాపన//

కొన్ని సంకల్పాలు నిదురలేని రాత్రులుగా మారి

కల్పనలో ఆదమరచి నిన్నుంచితే

మాటలన్నీ మల్లెలుగా మార్చి నాపై చల్లినందుకు..

కలలో మొదలైన నీలో తీపిదనం
మోహానికని తపించినందుకేమో
తలపుల తోడిరాగానికి స్వరస్థానాలు పేర్చుకున్నావు..

సుతారమైన నా నవ్వు నీ సోగకన్నులకెప్పుడు సోకిందో
తొలివలపు రాయబారాల సుప్రభాతాలుగా

వేసవికాలపు చల్లని మేల్కొల్పులు నాకిప్పుడు..

వేణువూదినట్టు తడిమిన నీ ఊపిరికేమో
కొన్ని చిరుచెమటల ఉక్కిరిబిక్కిరులు నాలో
ఆలకించే ఉండి ఉంటావుగా గుండెచప్పుడు..💜💕


//తొలివానలు..//


దోసిలి పట్టి నిలుచున్నంతసేపూ
ఒక్క చినుకూ కురవలేదు
ఆత్మస్పర్శను మరచి నిశ్శబ్దానికి
చేరువైన క్షణాలలో అనుకుంటా
నక్షత్రం రాలినంత తేలిగ్గా కొన్ని నవ్వులు ఒలికాయి..

పూలకారు పులకింతలన్నీ
ఒకేసారి కానుకైనట్టు
నీ పలకరింపులు.. చీకటిలో రంగుల కలలై
నన్ను పొదుపుకున్నాయి..

మూగబోయిన కోయిలకు
మల్లెల మత్తు ఊరింపుతో పాడాలన్న కోరిక తీపై
వివశత్వంలో పడి లోపలి స్వరం
సంకీర్తనై సాగి పురివిప్పుకున్న స్వప్నాల సంతోషపు అలజడైనట్టు

పువ్వులా తడిచి బరువెక్కినా
ఇష్టమైన అనుభూతులు తేలికేగా అప్పుడు..
మనసు పట్టని మన గుసగుసలన్నీ
నీలిమేఘాల తొలివానలేగా నాకిప్పుడు..💜

 

//మెత్తని పరవశం..//


ఊహలవేగాన్ని కలుపుకున్న జీవనదిలా ప్రవహిస్తున్న రుధిరం శిశిరాన్ని దాటేసి.. వసంతంలో కురిసే చిలిపి చినుకులకి చిగురించిన పూలవనాన్ని తడిపే మకరందంలా తీయనయ్యింది..

నిశ్శబ్దం కరిగిన ఆనవాళ్ళుగా కొన్ని రాగాలు తీగలై సాగి ఎన్ని పల్లవుల్లో చేరిందో నేను రాసేదంతా వలపు మౌనాక్షరం ఒకప్పుడు

ఏమ్మత్తు చల్లావో ఇన్నాళ్ళూ ఊపిరిలో దాగిన పరిమళాలు మనసుకొస దాటి నిన్నల్లుకొని ఇష్టపదుల బంధమేసేందుకని నీతో కాలయాపనలో చేరాయి..

నీ జతలో కనుగొన్న సంతోషం విషాదాన్ని తరిమి పులకరమూగడమెప్పుడు నేర్పిందో మరి..ఉత్సాహం పెనవేసుకున్న ఆశలే ఇప్పుడన్నీ..

మౌనాన్ని ముగ్ధంగా రాల్చేసుకున్న ఊసులు నీకూ నాకూ నడుమ వేసుకున్న వంతెనలో ఎన్ని భావాలు పంచుకునేందుకో వెన్నెల్ని ఎరగా వేసి రాత్రిని పిలిచాయి

కలలను వెంటాడినట్టుండే నీ చూపులు గుసగుసను ప్రసరించినందుకేమో నాలో మొదలైన ఆర్తి ఓ సరికొత్త తపనగా అనిపిస్తోందిప్పుడు ..

నెమలీకలై తాకుతున్న ఈ పరవశానికి పేరేం పెడతావో..
నేనైతే మధురంగా ఆలకిస్తున్నా ఇష్టమైన తతంగాన్నిలా..💜💕

//వివశత్వం//

హద్దుమరచి ప్రవహిస్తున్న అనురాగం పరవళ్ళు తొక్కితే నయాగరాను మించిందన్న ఊహలో నేనున్నప్పుడు.. తన్మయంతో తడిమిన చినుకులు కురిసాయంటే నమ్మాల్సిందే నువ్విప్పుడు..

ఒక్కసారిగా మొదలైన వివశత్వం కల్పించుకున్నదే అయినా నీ జతలో నన్నుంచి హాయిరాగపు సమ్మోహనాన్ని చుట్టబెట్టింది నిజం..ఆనందపు చలువపందిరి వేసిన నీ తలపులు లోలోన దోబూచులాడుతూ నాకో కొత్త ఆటను పరిచయించినట్టు..సమయానికి వేరే ధ్యాస పట్టనట్టుంది తెలుసా..

చూస్తూ చూస్తూ ఇన్నిరాగాల పలకరింపులు ఏ యుగళాన్ని ఆలపించేందుకు సిద్ధమవుతున్నవో..నాలో సుతిమెత్తని నీ మాటల సందడి మొదలైంది..మధురోహలన్నీ మోహమై కురిసేకాలం ముందున్నందుకే ఈ కాస్త మౌనానికి మాటలు నేర్పుతున్నా..నీ చూపుల అల్లరికి సైతం కలిపి బదులివ్వాలని..

కలలంచునే నిలబడి ఉండు అందాకా..నేనొచ్చి పులకింతనై నిన్ను పిలిచేదాకా..😄💕

 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *