ఎన్ని కలలు రాసిచ్చానో..మదిని తొలిసారి మీటినందుకు నీకు
నిద్దట్లోనూ ఊహించలేని రూపాన్ని
హృదయమంతా నింపుకొని
పగలూ రేయీ ఏకమైన శృతిలో
స్వరార్చనలే చేసుకున్నా..
ఏ అపురూపానికీ విలువలేనీ బందీనని తెలిసీ
నీ అవసరాన్ని ప్రేమగా తలచి
కలవని అభిప్రాయాన్ని సహించి
నిన్ను నా అద్దంలా చూసుకున్నా
ఆశించిన ప్రతిసారీ భంగపడి
ఊహల్లోకైనా రమ్మని బ్రతిమిలాడి
జ్ఞాపకంగానైనా మిగులుతావో లేదోనని
అవమానాన్ని నాలోనే దిగమింగుకున్నా
ఇప్పుడు ఒక చేత్తో కొట్టే చప్పట్లకు ఏ శబ్దమూ రాదని తెలిసి
మానసిక మరణానికి చేరువయ్యా..

No comments:
Post a Comment