తెలీకుండానే పెరిగిన దూరమిది
నువ్వు తప్ప ఎవరు ఉండని ఎదగదిలో శూన్యమిప్పుడు
ఒంటరితనానికి అలవాటుపడతానని
ఎప్పుడూ అనుకోలేదు నిజానికి
ఎక్కడెక్కడివారినో కలిపే కాలం..
నాకూ సాయం చేస్తుందనే ఎదురుచూసా ఆశగా..

నింపాదిగా కదిలే క్షణాలు కలలను సైతం దూరం చేసాయి
కాళ్ళు మాత్రం నడుస్తూనే ఉన్నాయి నిరంతరంగా
గమ్యమేదీ స్ఫురణకు రాకపోయినా
మనసుని అదిమిపెట్టి నాతో నేను కాసేపుండాలని అనుకున్నా
ఆలోచన ఎటెటో తిరిగి జ్ఞాపకాలు నెమరేసుకొనే చోటుకే చేరుతుంది..
నీతో నా బంధం నే కల్పించుకున్న ఊహదేగా..
అందుకే నువ్వే చెప్పాలి..
దగ్గరయ్యి నన్ను దూరం చేశావో
దూరమయ్యి దగ్గరయ్యావో..

No comments:
Post a Comment