మలిసంజె కిరణాల మృదువైన స్పర్శలా
ఒక తలపు ఏకాంతాన్ని కోరింది
అనంతానంత శూన్యం నుంచి తొంగి చూస్తూ జాబిలి
చీకటి కొమ్మలు చీల్చుకొని నన్నాలకిస్తోంది..
వెన్నెల్లో తడుస్తూ నేనున్నప్పుడు
క్షణాల్ని శ్వాసిస్తూ కరుగుతున్న పరవశానికి
నవ్వుల్లో నలుగుతున్న ఆనందాన్ని ముడిపెట్టి
పాడే ఈ రాగానికి పేరేం పెట్టాలోనని తెగ అలసిపోతుంది
వలపు చుంబనానికి వగలు పోయినట్టు
పరిష్వంగపు కలలో అప్పుడే మెలుకువొచ్చినట్టు
నాలో సంగీతాన్ని అనుకరించాలని
పదేపదే అదే లాహిరిలో మునకలేస్తుంది
మదిలో ఊరిన మకరందం దానికేం తెలుసు..
నీరవంలోనూ నీ పరిమళం నాకు మాత్రమేగా తెలుసు..

No comments:
Post a Comment