Wednesday, 12 September 2018

//జీవితంలో నిశ్శబ్దం..//



ఇంకేం కావాలి..
కొన్ని జ్ఞాపకాలు కేవలం నిష్కారణపు నవ్వులుగా మిగిలిపోయాక
తడిమి చూసుకునేందుకేమీ మిగలదు..

అస్తిత్వాన్ని గుర్తించని నలుగురి నడుమ
ఎంత ఒదిగినా ఆత్మశాంతి సిద్ధించదు..
నిన్న నేడు అయినప్పుడు ఉత్సాహలోపం
మానసిక స్పందనల్లో చంచలత్వం నింపాక
ఒంటరి భయమొకటి మొదలవుతుంది.

అనుభవాలు విషాదాలుగా మిగిలే వర్తమానంలో
భావాతీత ఉద్వేగాలు శాశ్వతంగా కరిగిపోయుంటాయి
పరాచికాలన్నీ పూర్తయ్యాక
అప్పటికి జీవితం చివరి అంకానికొస్తుంది
అనివార్యమైన నిశ్శబ్దానికి అదే ఆఖరి వాక్యంలా..


అంతులేని కల



ఎప్పటికీ ఏకమవని ఆలోచన
అయినా వీడిపోదని
కొంత కవిత్వాన్ని వెంటేసుకొని
నాతో రాయించేస్తావ్
నీకు నచ్చుతుందో లేదో అప్రస్తుతం
కానీ ఎప్పుడో ఒకప్పుడు
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చదువుకుంటావ్..

మనసులో మరుగుతూ
వేడిగా కదిలే రుధిరపు ఆనవాళ్ళు
కొన్ని రాత్రుల్లో నిదురను దూరం చేసే
సవ్వళ్ళుగా మారుతాయ్
నీకేమీ కాలేకపోయిన
ఈ బ్రతుకు పయనంలో
మృత్యువే గమ్యమని తెలిసొచ్చాక
క్షణాల కదలిక మందగిస్తుంది

రాత్రులకి శాపముందేమో తెలీదు
కానీ నాలో నిశ్శబ్దాన్ని రెచ్చగొట్టాలని చూసే చొరవుంది
అందుకే కలలు సైతం కనలేని
నేనో గొడ్రాలిని..:(


//నా పాట..//




ఒక్క మదిలో ఎన్ని ఆశలో ఎన్ని అందాలో..
ఆ నిశ్శబ్దంలోనూ ఎన్ని సన్నాయిలో
నీతో శృతిలో పడ్డ జీవితానికి
కొత్త పూల పరిమళం పరిచయించేదేముంది

ప్రతికలా మరో పుట్టుకైనట్టు..
ఎంత అనుభూతించినా తనివి తీరనట్టు
ఈ జన్మకైనా నిన్ను పొందాలనే పరితాపం
వేరే ప్రపంచమెందుకులేననిపిస్తుంది..

కలగలుపుకున్న ఆత్మ రంగుల్లో
అలలై ఎగిసిపడే నీ జ్ఞాపకాలు
నీటి బుడగల్లా పేలి మాయమవుతున్నా
సాధన చేసి ఆపుకున్న కన్నీటి చుక్కలై
ప్రేమనే పరావర్తనం చేస్తున్నాయి
నువ్వూ నేనూ వేరన్నది వట్టి మాట
తీసే ఊపిరికి తెలుసు ఒకరిలో ఒకరైన పాట..:)


//చంచల//




మనిషి నిజం..మనసు అబద్దం..
నవ్వింది నిజం..ఆనందించడం అబద్దం
గడియారం ముల్లును వెనక్కెలా తిప్పగలను
దాహమంటున్న మనసు వెక్కిళ్ళనెలా ఆపగలను
మాటలన్నీ మౌనంలో దాచుకుంటూ
విషాదాన్ని సహనంగా ఓర్చుకుంటూ
కవితలన్నీ స్వరాలుగా కూర్చుకుంటూ
నిముషాల్ని నిర్దయగా తరుముకుంటూ
నేనో చంచలితనై నటనలో ఆరితేరిపోతున్నా..
కానీ..
నన్ను నేను నిగ్రహించుకోలేక ఓడిపోతున్నా
ఎందుకిలా అనుకున్న ప్రతిసారీ
కొన్ని ప్రశ్నలకు జవాబులుండవన్న విధి
అరనవ్వులు రువ్వుతూ నొసలు ముడేస్తుంది
నన్ను మాత్రమిలా ఏకాకిలా జ్వలించమనేమో..:(

 

//అలజడి..//





నువ్వక్కడే..
కాలపు ప్రవాహంలో కొట్టుకుపోతూ
కొత్తపూల నెత్తావుకని
ఆవైపు ఆకర్షణ అన్వేషణలో..

నేనిక్కడే..
ఓ గొప్ప క్షణాన్ని
గుండెల్లో నింపుకొని
చెప్పుకోలేని బాధని అనుభవిస్తూ..

చందమామ చెట్టు కింద కూర్చుని
కలిసి చెప్పుకున్న కబుర్లు
గతంలోని అనుభవాలుగా
ఇప్పటి నా తప్పు ఒప్పులను
నిర్ణయిస్తాయని తెలీదు.

రమ్మని పిలుస్తున్న నా పరిమళం
నీ ఆత్మకి అందలేదంటే నమ్మలేను

నిదురలేక బరువెక్కిన కళ్ళు
విషాదాన్ని మోయలేనన్నప్పుడు
కన్నీరు ఆనందభాష్పమయ్యే రోజుందోలేదోనని కలవరం
నీదైన ఏకాంతం నా జ్ఞాపకాన్ని
మరుపులోనికి లాగుతుందేమోననే సందేహం..:(

//కురిసేను విరిజల్లులే..//



ముసురేసి మూణ్ణాళ్ళయింది..
కురవకుండానే మేఘమెందుకు కదిలిపోయిందో తెలీలేదు
కన్నులు నింపుకున్న కలలోని తీపి
ఆవిరయ్యిందనుకునేలోపు
ఒక్కో అమృతపు చినుకూ
మెత్తగా ఒలికింది
చిరునవ్వు అనివార్యమని
యధాలాపంగా చెప్తూ మట్టిగంధాన్ని పూయగానే
స్తబ్దుగా నిదురించిన మనసు కావ్యమయ్యింది..

చలి వీడకపోయినా ఇలానే బాగుంది
కొన్ని ఊహలు దిగులకొమ్మలనానుకొని ఊగుతున్నా
అనురాగాల పన్నీరు
"అక్కడ" కూడా ఊరుంటుందని..


//వెన్నెల రాత్రి..//



ఈ వెన్నెల
నాలో జీవనసారాన్ని నింపుతున్న వేళ
ఏకాంతం తలుపు తెరిచి
పున్నాగవరాళిలోని అదే పాటని
గుసగుసగా మొదలెట్టింది
గుండెలో సంగీతానికప్పుడో చలనమొచ్చి
తనువంతా పరిమళాన్ని మేల్కొలిపింది

బందీ చేయాలనుకున్న క్షణాలు
ఆనందంతో ప్రవహిస్తూ మలుపులు తిరుగుతున్నప్పుడు
రెప్పలమాటు మోదుగుపూలు ఎర్రగా నవ్వి
పూల ఋతువుని గుర్తు చేస్తున్నాయి

చిరునవ్వు పులకింతగా మొదలైనప్పుడు
చల్లగా ఒణుకుతున్న మనసు
వెచ్చదనాన్ని ఊహిస్తూ తాపాన్ని రచించమంది
మెల్ల మెల్లగా మోగుతున్న మోహం
అల్లిబిల్లి రంగుల ఊహగా విరబూసి
ఆషాడమేఘపు నీలి తుంపర్ల మధువు
నా దోసిలిలో నింపుతోందిలా..


//శివరంజని..//



కలలు తీరని రాతిరి నిశ్శబ్దం
శివరంజనిగా మొదలై
స్వరం తప్పిన మౌనంలా శూన్యాన్ని తలపిస్తున్నప్పుడు
నిస్తేజంగా మారిన చూపుల భావం
ఎంత చదివినా అర్ధంకానట్టు
ఏ పదమూ మనసుకి పట్టదు..

మనుషులు దగ్గరయ్యాక మాటలు దూరమై
దిగులు రంగులుగా మారడం
కంటికొసల్లో తడిగా మిగలడం
ప్రతి ఒక్కరి అనుభవాల్లోని మలుపేనేమో..

మురిపిస్తుందనుకున్న కాలం
నిరంతరానికి ప్రవహించే గమనమే అయినా
గుండెలోని తడి ఆవిర్లు బైటకి ఎగజిమ్ముతుంటే
వానెందుకు గుర్తొస్తుందో మరి
సంద్రం ఆపలేని అలలా విషాదం తీరాన్ని దాటుతుందేమో ఈ రాతిరి..:(

 

//లిప్స..//




వెండి కాంతులు వెలిగే నిశీధి నీలాకాశంతో
సమానమైన నాలుగు పదాలు
నా ఒంటరితనానికి పూసుకున్న ఎర్రగులాబీ పరిమళాలు అప్పుడు
కలగనకుండా ఎలా జరిగిందో
అనుకోకుండా మనసు తడిచిన
పూల సువాసన..
ఒక్క చూపుతో ముగిసిన శూన్యంలో
ఎన్ని జన్మల తర్వాతనో ఒకటయిన
నమ్మక తప్పని విస్మయం

కూడగట్టుకున్న తలపులన్నీ
నిన్ను కలసిన క్షణాలలోనే ఆగిపోతుంటే
రోజులు కదిలిపోతున్నా తెలియని అవ్యక్త పరవశం

అందనంత దూరాన నువ్వున్నావన్న బెంగను చెరిపిన నిరీక్షలో
నే మనసుపెట్టిన ప్రేమకావ్యపు మాధుర్యమంతా
నీదైనందుకే..
నక్షత్రం రాలినప్పుడల్లా కోరుకుంటున్నా
నే నిష్క్రమించినా
నీలో శబ్దించే ఊపిరెప్పటికీ నేనే అవ్వాలని..:)

 

కనిపించవా...



ఓయ్...నిన్నే ఎక్కడున్నావోయ్..
మనసులో దిగులు మాటల్లో పెడదామంటే పెదవి పలకనంటోంది
పదాలుగా పోగేసుకున్న మృదుభావం నిరాశలో ఆగిపోయింది
తీపి గురుతుల నీ గాలికబుర్లు నిశ్శబ్దాన్ని చెదరగొడుతున్నా కానీ
నిన్ను వెతికే తీరంలో అభిసారికనై నిలబడిపోయున్నా
నాకున్న భావాలు ఖచ్చితంగా నీకుండవని తెలిసినా
నీపై పిచ్చిలోని ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే నేనున్నా
కలలు కనాలంటే రెప్పల బరువు మోయలేనని..
ఊహలల్లోనే నిన్ను కలుసుకుంటున్నా

నా మానసికావసరం తెలిసికూడా నాతో దోబూచులాడటం
నీ సమక్షపు సౌరభాన్ని నాకు దూరం చేయడం..

ఇప్పుడీ కలతలో అక్షయమైన క్షణాలు
నీ రాకతో పరవశపు శ్వాసలవ్వాలి
అందుకే ఎదురుచూస్తూనే ఉన్నా
కాస్తాలశ్యమైనా నువ్వొస్తావని..


//గాయం//



నిన్నటిదాకా అలుపులేని అలవై నువ్వు ఎగిసిన తీరు
ఇప్పుడు నిర్లక్ష్యాన్ని విదిలించినట్లు అనిపిస్తుంటే
ఒట్టి చేతులతో నిలబడ్డ నేను
ప్రేమను అర్ధించలేక
దీక్షగా నీలో ఏకాకితనాన్ని పరికిస్తూ నిలిచున్నా

నీతో ముడిపడ్డ కొన్ని చిరునవ్వులు
నాలో శబ్దించనప్పుడు
అసంకల్పితమైన నిట్టూర్పులు
కన్నుల్లో నీలిరేవులకి దారినిస్తున్నా
ఊహల సరిహద్దుల్లోనే తచ్చాడుతూ
నీ మౌనతపస్సుకి పరిమళాన్ని జతచేస్తూనో
నిశ్శబ్దాన్ని చెడగొట్టే జ్ఞాపకముగానో
ఉండాలనుకున్నా గానీ..
మాటలకు సెలవిచ్చి
నీతో నువ్వేం విశ్రాంతి తీసుకుంటావోననే
ఆ దివ్యక్షణాలను నీకొదిలేస్తున్నా..

నా గాయాలు లెక్కబెట్టే రోజు నీకెప్పటికీ రానివ్వొద్దని..!!


//నిర్లిప్త స్వరం..//



ఎప్పటికప్పుడు జవాబు దొరకని ప్రశ్నలే అన్నీ
ఆశలు నడిపిస్తున్న జీవితంలో
అకస్మాత్తుగా అలముకొనే నిశ్శబ్దం
గుండెల్లో పగిలే నిర్లిప్త రసాయనం

జబ్బు చేసిన మనసుకి అన్నీ బరువైన క్షణాలే అయితే
కనుకొలుకుల్లో నిలిచే నీటిచుక్క
అది ఆనందమో విషాదమో తెలిసేదెందరికి
అనేక రంగుల్లో పరావర్తనం చెందుతుందది

ఊహలన్నీ దిగివచ్చి ఒక్కో రంగులో కొలువైనట్టు
భ్రమించిన తాదాత్మ్యం
ఒక్క అనుభవంతో పటాపంచలయ్యాక
కొన్నాళ్ళుగా ధ్యానిస్తున్న స్వప్నం చెదిరి
అశాంతికి ఆజ్యం పోసి
సర్వం కోల్పోయిన చరమ దృశ్యాన్ని
అదేపనిగా ప్రసారం చేసి అచేతనలో పడేస్తుంది

అంతులేని గాయాలు రేగుతూంటే
సెలవు తీసుకొనే సమయమెంతో దూరం లేదనిపించినప్పుడు
వాడిపోయేవరకూ నిరీక్షించకుండా
ఓడిపోయి రాలిపోయిందే నయమనిపిస్తుందప్పుడు..


ఎంత మందికి తెలుసు...



విషాదాన్ని వదిలించుకొని ఆనందాన్ని కౌగిలించుకున్న క్షణం..

మనసంతా గాయాలమయమైనా
బాధనోర్చుకుని ప్రతికూలాన్ని ప్రతిఘటించించినప్పుడు
తడికన్నులతో మెత్తగా నవ్వినట్టుంటుంది

నిశ్శబ్దాన్ని తవ్వి
కొన్ని అనుభూతులు తోడుకున్నాక
మౌనం కదిలిపోయి కొత్తస్వరాలకి చోటిచ్చినప్పుడు
కాలం విశాలమైనట్టుంటుంది

ఆశలు ఆకాశానికి పిలుపునిచ్చాకనే
మనసుతో సహజీవనం మొదలవుతుంది
నక్షత్రాలతో మాట్లాడినప్పుడు నమ్మకం నిజమై
రేపన్నది కలలో కనిపించి
మధూదయానికి చైతన్యమందిస్తుంది

శాంతించిన అలలతోనున్న సముద్రం మాదిరి
ఒక్క చిరునవ్వు పల్లవించగలిగితే
హృదయస్పందన రెట్టింపవుతుంది..


//కలత..//




మట్టిపూల వాసనతో అలజడవుతున్న మనసులో
తీరని ఈ గుబులెందుకో

శూన్యాన్ని తాగేసి సరిహద్దు దాటినట్టు
ఈ జీవితానికో నిర్వేదమంటి
పరవశాన్ని కాజేద్దామనుకున్న ప్రతిసారీ
కాలం కలిసిరాకపోతుంటే
జోలపాడకుండానే కలలకు నిద్దరొచ్చినట్టు
పుంతలు తొక్కకుండానే పులకరింత పోగులవుతుంది

ఏకాంత శిధిలాల్లో నేనున్నప్పుడు
గుండె గుచ్చుకునే నీ జ్ఞాపకం..
నన్ను తాకిన రంగుల సీతాకోకై
అనంతవెన్నెల్లోకి లాక్కెళ్తుంది
రెండుగుండెల దూరం దగ్గరై
నిద్రించిన శిల్పానికి వేకువైనట్టు
నీ స్పర్శతో నాలో మెలకువొస్తుంది
స్వరాలు వెల్లువైన చిలిపిసందడి
కమనీయపు గమకమై
కనుమబ్బుల్లో హరివిల్లును పూయిస్తుంది

నాలో మనమైన
శ్వాసలో కోరిక
ఊహల కౌగిలిలో తీరిపోయాక
యుగాల వేదనంత నిశ్శబ్దంగా
కురవని మేఘపు కలత
అలా కమ్ముకుంటుంది మరోసారి..:(

 

//చెప్పాలని లేదు..//




అనగనగా ఓ వసంత సమీరం
అనంత ఛాయల ప్రయాణం చేసి
నీలికురులు సవరిస్తూ
చెవిని చుంబించింది

సాయంత్రపు సంపెంగి పరిమళం
నీరెండ దాటిన గోధూళి సౌందర్యాన్ని
నిండుగా పీల్చుకోగానే
అప్పుడెప్పుడో మొదలైన జీవన ప్రవాహం
ఇన్నాళ్ళకు కళ సంతరించుకొని
మౌనాన్ని దాటి ఓ సరికొత్త స్వరాన్ని ఆలపించింది

అతికిన ఊహలతో బరువెక్కిన కన్నురెప్పలు
మధురిమను తాగిన రహస్యాన్ని
చిరునవ్వులు చేసి చల్లుతున్నప్పుడు
పరవశం పదింతలైన సంగీతమైంది

హృదయమిప్పుడు చెరోసగమని
నువ్వాక్రమించిన రంగస్థలం
లోపల్లోపలే ఉందని
చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది..;)

 

//ఊహావేశం..//




పదేపదే జారుతున్న ఊహల్లో
అనేక రంగులు ఏకమై చెదిరిపోయినట్టు
నిన్నటివే జ్ఞాపకాలు..
కన్నీటితో సమంగా
కాలం కరుగుతున్నా
అలుపులేని అవస్థలో మనసుంటుంది

ఏకాంతమెప్పుడూ వెచ్చగానే కదులుతుందని
నాకనుభవమైన అనుభూతి
బహుశా గాలిక్కూడా తెలిసినట్టుంది..
రాతిరెన్ని పువ్వులు గంథాలు వెదజల్లుతున్నా
అదేమో నా మైమరపునే వెంటాడుతున్నట్టు
ఓ గిలిగింత ఎదను సవరిస్తుంది..

వ్యక్తావ్యక్తపు తాదాత్మ్యం
చిరునవ్వుగా మారి
వెన్నెలను సైతం ధిక్కరించి
నన్నో సంగీతంలా ప్రవహించమంటుంది..
ఎంతో ఇష్టమైన పాట పెదవులపై మొదలయ్యాక
క్షణాల బరువును మోస్తున్న విషాదపు ఆఖరి చరణం
రసలిప్త నుండీ వాస్తవంలోకి తెచ్చి పడేస్తుంది..
ప్చ్..

How can I explain now..

"Memories Don't Walk Away..People do...:( "

//గుండె రాపిడి..//



ఈ జ్ఞాపకాలకి విశ్రాంతి లేదు
ఏకాంతం దొరికిందని కాసేపలా
నిద్రని ఆహ్వానించాలనుకుంటానా..
ఎప్పటికప్పుడు లేతగా..ఇప్పుడే జరిగినంత కొత్తగా
క్షణాలలా తిరిగొచ్చినట్టనిపిస్తాయి

సంగీతమయమైన వసంతం
అంతులేని ఊహల ఆకుపచ్చదనం
ఆనందపు దొంతరల ప్రేమానుభవం
మృదువైన సెలయేటి గలగలల ఉద్వేగం
అన్నీ కలగలిసి గుండె ఘనీభవించాక
బరువెక్కిన అపరాహ్నం
కాటుకరేఖను కదిలించింది..

మాటలకెన్ని రంగులద్దినా
చందమామకు జంపాలలూగడం తెలీదుగా
ఎన్ని రోజులు కదిలిపోతున్నా
ఇప్పటి విషాదం నరకానికి సమానమని తప్పించలేనుగా..


//మనసు నీలాలు..//




ముద్దు గులాబీ మీదుగా వీచిందని చిరుగాలికి
ఆ పరిమళం నచ్చిందని కానట్టు
ఆకాశం ముక్కలై కురుస్తున్నా
మనసులో మరుగుతున్న రక్తం చల్లబడిందని కాదు

ఒంటరిగా కూర్చున్నప్పుడు
ఒంపుకోవాలనుకున్న బాధ
కాలాన్ని గతానికి తిప్పి గుండెను తొలిచేస్తూనే ఉంటుంది

కలల తీరం వరకూ సాగిన ఎదురుచూపులో
చీకటి తప్ప చిరునవ్వేదీ కనపడదు
వర్షం తప్ప పలవరింపేదీ వినబడదు
రోజంతా తడుస్తూనే ఉన్నా
కన్నీరు తుడిచేందుకెవరూ రారన్నది మాత్రం సుస్పష్టమవుతుంది..:(

 

//వానొచ్చి..//



బయటెంత చల్లగా ఉందో
లోపలంత వెచ్చగా ఉంది
అవును..వానింకా తగ్గలేదు
నిన్న సాయింత్రం మొదలై ఇప్పటికింకా కురుస్తూనే ఉంది
కిటికీ రెక్కలు మూయాలని ప్రయత్నించినప్పుడు
కొన్ని చినుకులు తడిమి
మెలకువగా ఉండమని సవ్వడించాయి..

మనసంతా అరణ్యంగా మారినప్పుడు
నిశ్శబ్ద సంగీతపు అవలోకనంలో నేనుంటే
సమయం మించినా నీ పిలుపేదీ వినబడలేదు కానీ
ఇప్పుడీ వానొచ్చి ఏదో గుసగుసలాడింది
కురిసే చినుకుపూలు గుట్టుగా గుండెల్లోకి ఇంకిపోతూ
నీ పరిమళాన్ని తిరగ తోడినందుకేమో
ఊపిరి తడబడుతున్న ఈ ఏకాంతంలో
క్షణాలకి కేరింతలు మొదలయ్యాయి...!!


//ఊహా గీతం//




ఊహల శిల్పాలు నీలాకాశంలో
నక్షత్రాలై మిణుకుమంటున్నప్పుడు
మేఘాలమాటు సగం దాగిన చందమామ
పల్చని వెన్నెల ధారపోస్తూ
ఆకుల గలగలలతో పూలకలను మేల్కొలుపుతుంది

మల్లెపూల వాసనకి గోరువెచ్చనవుతున్న రాతిరి
గుండెచప్పుళ్ళను లయగా కూర్చుతూ
లోపలి స్వరాన్ని మీటినప్పుడు
కన్నుల మీద వాలిన అనుభూతుల సీతాకోకలకేమో
మనసిప్పుడో హాయిని మోస్తుంది

కన్నులు మూతబడనంటూ నవ్వులందుకే..
కొన్ని బంగారు క్షణాలను గానం చేయమని
పెదవులను బ్రతిమాలుతూ..:)

 

//తగాదా//



ఎంతకని తపించినా
ఆకాశమంత అనురాగాన్ని ఆలకించలేని నీవు
నా ఊహలనేం వినగలవు..
నే రాసుకున్న రంగులకలలు
నీకు పిచ్చిగీతలైనప్పుడు
నా హృదయంలో దాచుకున్న నీ ముఖానికి
వశం తప్పిన క్షణల స్పందన తెలిసుండదు..

మనసంతా మబ్బులు పట్టాక
ఆవేదన కురుస్తుందేమోనన్న సందేహమెందుకు
ఎంత వెతికినా రాత్రి కలలో నువ్వు కనబడలేదు
ఏడ్చేడ్చి నిన్ను కడిగేసానేమో తెలీదు
ఎన్ని చెప్పుకున్నా మిగిలేవి నా మాటలే అయినప్పుడు
నిన్ను స్వార్ధంగా మార్చుకోవడం నా అసూయత్వమేమో

ఒంటరితనం భరించలేని ఆకాశంలా నేను
మనసులో మధురిమనేం చేసుకోవాలో తెలియని పరాజితను
నిశ్శబ్దమలా కరుగుతూనే ఉంటుంది
చీకటంటే భయమలా పెరిగిపోతుంది
అశాంతి సుడిగాలి చుట్టుముట్టి విషాదాన్ని కెలుకుతుంటే
సగం కురిసే వానలన్నీ కళ్ళలోనే
దుర్భరమైన యాతనంతా గుండెలోనే...:(


//ఇప్పుడు..//




నులివెచ్చగా మారిన దేహం
ఈ సాయం గాలి
చిలిపిదనానికే కాబోలు

ఆశ నిరాశల రహస్యం
సద్దుమణిగిన చీకటికి తెలిసినప్పుడు
వరదగుడికైన ఎదురుచూపు
హృదయంలోనే నిదురపోవాలి

రేపటికి మనం కలిసుంటామనే ఊహ
పెదవి చివరి సంతోషాన్ని ఆపలేనప్పుడు
ఆకాశమైన అంతరాత్మ
ఆగకుండా సంగీతాన్ని ఆలపిస్తుంది
ఆహా..
ఇప్పటికి విశ్రాంతి దొరికింది
నీ కలలో అలనై ఎగిసానని మురిపెమిప్పుడు..:)

 

//నేనే కావాలి..//




నీ కవనంలో
విరబూసిన పువ్వునై
కాస్త సువాసనలు వెదజల్లి
ఓ చిరునవ్వుల వర్ణం నీ పెదవులకివ్వాలి
నీ చూపుల్లో
తెలివెన్నెల జాబిలినై
సంపెంగిరేకుల స్వప్న కిరణాల
నులివెచ్చని హేమంతాన్ని నీ రాతిరికి కానుకివ్వాలి
నీ నిశ్శబ్దంలో
ఇష్టమైన రాగమై
కొన్ని కీర్తనల మైమరపులో
తొలివలపు సవ్వళ్ళు నీ హృదయానికి పంచాలి

నిరంతర జీవధారగా ప్రవహిస్తూనే
నీ ఊపిరిలో ఆశ నేనై కదలాలి
ఆగని అల్లరితో అల్లిబిల్లిగా కవ్విస్తూనే
ప్రతిసారీ జల్లుగా కురవాలి

ఇప్పుడింక సుద్దులతో సతాయించకు
మనసు చేసుకొని నా మనోభావాన్ని మురిపించు..:)

 

//కలిసే కళ్ళలోనా..//




కథలూ కవితలూ కలబోసుకునే
నాలుగు కళ్ళు
అరచేతిలో చేతులు కలుపుకున్న
ఇరవై వేళ్ళు
ఒక్కటిగా పెనవేసుకుంటే
మోహం మొగలి పరిమళమై
మనసుని మనసుతో ముడేస్తుంది
గిరికీలు కొడుతున్న రేయింబవళ్ళలో
తొలిపొద్దు చుక్కల తోడు
మృదువైన వెన్నెల తోడు
Every Night is a Full Moon Celebration
మల్లెపువ్వై నేను ఎదురుపడటం తప్పనుకోకు
మరువమై జతకట్టేందుకు ముందడుగేసి చూడు

 

//ఒక్క పలకరింపు కోసం..//




ఎదురుచూసిన సాయింత్రం కరిగి
రాత్రిగా మారినా
నిశ్శబ్దాన్ని ముగించే
స్వరమేదీ వినబడలేదు
"something is bothering u"
ఇప్పుడీ హృదయం నవ్వాలంటే
నునుతట్టు పలకరింపొకటి కావాలి

అనుక్షణం ఆలోచనలో నువ్వుంటే
నా ఆనందం అంతర్మథనంలో అంతరించిపోతుంది
పేర్చుకున్న కలలన్నీ ఒకొక్కటిగా విసిగి
గుండెలోతుల్లోకి జారి మాయమవుతున్నాయ్
రేయి ముగిసేలోపు
నీలో శూన్యాన్ని జయించి
శృతి చేసిన సన్నాయిలా
ఒక్క "పిలుపు" మథురిమను వినిపించవూ..
దారితప్పిన ఏకాంతానికి నువ్వొచ్చి
నాలో " రాగాలు" పలికించవూ..!!

 

//కలలాంటి ఊహ//




ఊపిరి సలపని ఉక్కిరిబిక్కిరిలో నన్నుంచుతావ్
నిశ్శబ్దం సరిపడంటూనే నా ఊపిరి సంగీతానికి తోడై
ఎవరికీ అర్ధంకాని భాషలో కవితలల్లుతావ్
ఆకాశమంత ఏకాంతంలో నువ్వూ నేనే ఉన్నట్టు
మనసుపొరల్లోకంటా చేరిపోతావ్
గోరువెచ్చని ఊహలు నిజం చేసుకోవాలంటూ
అరచేతులతో అల్లికలేసి చూపులతోనే నవ్వుతుంటావ్
కలనైనా పరిచయం లేని నీలిమబ్బుల్లోనికి
క్షణాల్లో ఎత్తుకుపోతావ్
చూడ్డానికి చంచలమైనట్టు కనిపిస్తావ్ గానీ
పారిజాతమంత పవిత్రమైన ప్రేమ కదా నీది..:)

ఇప్పుడింకేం చెప్పకు..
పదేపదే నా విరహాన్ని వెక్కిరిస్తూ..!!

 

//మహానటి//




సంకుచిత సరిహద్దులు గీసే ఆంక్షల వలయాన
ఒక ద్వేషాన్ని ఇష్టమున్నట్టు అనుసరించే జీవనం
ఇవ్వక తప్పని ఓ అధికారానికి బానిసగా ఆమె
ఆశించిన అనుబంధం అతనికి కేవలం అనుభవం
అందుకా ఓటమికెన్నడో మరణించిందామె

బంధాన్ని బలహీనం చేసే భయంకరమైన అగాథం
మదిలో అంతర్మథనాన్ని పెంచగలదే గానీ
సత్యాసత్యాన్ని విశ్లేషించే ఆత్మపరిశీలనెటూ చేయదు

అతనో అబద్దమైనప్పుడు గుండెల మీద మోస్తూ తిరిగే యాతన
ఓ ప్రేమరాహిత్యపు ఆత్మశోకం
కొన్ని ఊహలకెప్పటికీ చలనం రాదని తెలిశాక
ఆ దేహానికి ఉత్సవం కల్లోని మాట

ఇంట గెలవని ఇంతులెందరో..
పెదవంచున నిత్యమల్లెలు పూయించు మహానటులు.._/\_

 

//నిశ్శబ్దం..//



నీ తలపులనే అంటిపెట్టుకొనే నాకు తెల్సు
నే తపస్సు చేసే విషాదమెంత విషమమైనదో..
నువ్వు నన్ను పొదివి పట్టుకున్న ఉయ్యాలకేదో అడ్డుతగిలి
కాలాన్ని పారేసుకున్నట్టు మనసంతా పేరుకున్న నిశ్శబ్దం

నా కన్నుల్లో కురిసే ఒంటరితనాన్ని గుర్తించనట్టు
చూపునెటో తిప్పుకుంటావ్
కొన్ని నిట్టూర్పులు రాలిపోయాక..
గతాన్ని తిరిగి కలగంటూ నవ్వాలనేం ప్రయత్నిస్తావ్..

నీ అనుభవం నేనైన క్షణాలనడుగు
నా సాన్నిహిత్యం నీకిష్టమైన పాటలకి సమానమని చెప్తాయి..
లాలించేదేముంది రాత్రినిప్పుడు..
అదెటూ కరిగిపోతూనే ఉంటుంది..


Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *