నిషాకళ్ళ మైమరుపుతో..నేరేడుపండు మెరుపుతో
శార్వరి నడిచొస్తుంది..
నల్లని కనుబొమ్మలూ..నీలి కేశాలతో
మత్తు చల్లుతూ కులాసాగా కదిలొస్తుంది..
చీకటి అందంలో వెన్నెల స్వప్నంలా
నీలాంబరి రాగానికి నీలిగంటల తాళమేస్తూ
క్షణాల కోలాహలంలోని కాలస్పందనలా
చైత్రరథంపై చిరుదీపాన్ని చిదుముకొస్తుంది
నిర్లిప్తపు ఆశలన్నీ నిశ్శబ్దాన్ని ముడేసుకోగా
నీలివాని దేహపు నెమలిపింఛం
నిమురుకున్నంత మెత్తగా
నిషిద్ధరాత్రిని ప్రేమించమంటుంది
ఈ నిశీధి శాశ్వతమేం కాదుగా..
ఎంతకని ఆత్మకథలు రాసుకుంటాం
రా..ఏకాంతాన్ని పగలగొట్టుకొని
జన్మమాధుర్యాన్ని కలిసి పాడుకుందాం..

No comments:
Post a Comment