Friday, 10 April 2020

// శిశిర కుసుమాంజలి.. //

శిశిర కుసుమాంజలి..
అవును కదా
పరిమళవానగా నన్ను తడిపెద్దామనేమో
నవ్వుతూ నవ్వుతూ ఆ పువ్వులు
కాస్తయినా అదుపు తప్పక
ప్రణాళిక వేసుకున్నట్టే కురుస్తున్నాయి

ఒక అనంతానుభూతి..
నిజమే మరి
రికామిగా జారిపడటమెవరు నేర్పారో
మౌనరాగాన్ని ఆలపిస్తూ
రహస్య క్షణాల సంగీతంలా
నేలకు దిగుతున్న స్వప్నాలనిపిస్తున్నాయి

అపురూప దృశ్యకావ్యమిది
కనుకే నచ్చింది
రాబోయే వసంతాన్ని ఆహ్వానించేందుకేమో
కలంలో నింపుకున్న కలలు ఒలికేట్టు
తడిరెప్పల చినుకు పాటలా
ఊపిరిగాలికే గుసగుసలు వినిపిస్తున్నాయి

కాలపు కనుసన్నలలో ఎన్ని కవ్వింపులో
పలకరింపుకి తపించానని కనిపెట్టి కాబోలు
ఇన్నేసి పొడుపుకథలు అల్లికేసి విప్పుతోంది 💕💜

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *