బంధాలన్నీ తామరాకు మీద నీటిబొట్లన్నట్టు
నేస్తమే అపరిచితమై మానని గాయాన్ని గుచ్చినా
గుండెగోడలు తొలుచుకొని మరీ అతనికోసం పరితపిస్తావు
సున్నితత్వాన్ని కోల్పోని మనసుంది కనుకనే
నువ్వలా చెలిమి నిర్వచనానికి పర్యాయపదమవుతావు
హృదయ సౌందర్యమంతా అస్తవ్యస్తమై
అశాంతికి గురిచేసేది అయినవారే అయినా
నిర్మోహంతోనే జీవితాన్ని జయించిన వీరుడవుతావు
అసహనంలోనూ ఆనందాన్ని పంచావు కనుకనే
ఓ కొత్త పలకరింపుగా మారిపోతావు
అలుపెరుగని దూరానికి విస్తరించిన ప్రేమని
మౌనంగా అనుసరిస్తూ కదులుతున్నా
దగ్గర కాలేని ఆకాశంలా శూన్యమవుతావు
సంతోషపు మజిలీ ఏదో తెలుసు కనుకనే
మౌనమనే సుగంధాన్ని నీకు అంటుకట్టుకుంటావు
అన్నిట్లోనూ ఉన్నతమైనదే ఆశించి
నీ అస్తిత్వాన్ని విరిచి రెండుభాగాలు చేసావు
నీలో సున్నితత్వం మాత్రమే చూసిన నాకైతే
నువ్వో "ఉత్తమ విలన్"..నేనెప్పటికీ ఆరాధించించే "సూపర్ హీరో"..😍💜
No comments:
Post a Comment