Thursday, 23 May 2019

//నేనలా..//


నిట్టూర్చుకుంటూ కదిలే నిముషాలకే తెలియాలి..
కాలాన్ని అనుసరిస్తూ కదిలిపోయే తన తొందరేంటోనని
దూరాన్ని కొలిచే ఓపికలేక ఉరుకుతుందనుకుంటాను

ఆకాశమంత నిరాశలోనూ ప్రతిరేయి నక్షత్రాలుంటాయని
ఆ కాస్త వెలుతురే నాపై దయతో కురుస్తుందని
చిన్నిచిన్ని ఆశలన్నీ గుప్పిళ్ళలో మూసుకుంటాను..

శిశిరానికి రాలే ఆకుని చూసి
మట్టివాసనలో మమేకమయ్యేందుకే నేలజారిందని
కొత్తజన్మ త్వరలో దానికి ప్రసాదించమని వేడుకుంటాను..

గుండెల్లోనూ అడవిమల్లెలు పూయగలవని
ఆస్వాదిస్తే ప్రాణవాయువు సమానమవేనని
అనుభవాల పూలసజ్జను ఆలింగనం చేసుకుంటాను

సముద్రాన్ని ప్రేమించడమెందుకో ఇన్నాళ్ళకు తెలిసినట్టు
నేనో ఎదురుచూపుల తీరాన్నై కన్నీటిని దాచి
నవ్వుల నురగల్ని మాత్రమే పెదవుల్లో పొంగిస్తాను..💜

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *