Friday, 24 May 2019

//దిగులు పువ్వు//


దిగులు పువ్వులా మనసు..
నీ తలపునే అల్లుకు కూర్చుందంటే ఆహ్లాదమవ్వాలిగా
మెత్తని బుగ్గల్లోనూ గుబులు..
నువ్వు తడిమేంతవరకూ చిరునవ్వుని చేరనివ్వనిదానిలా
ఉండీ ఉండీ మూగబోవడం కొత్తగా నేర్చినట్టు
మౌనరాగానికి లిపితో అవసరమే ఉండదుగా..

ఎందుకిదంతా అని అడగవా..
పూసినట్టే పూసి వాడిపోతున్న సన్నజాజులనడుగు
రేయంతా పరిమళిస్తున్నా నా తలకెందుకు ఎక్కలేదో చెప్తాయి
తనకు తానుగా కరిగిపోతున్న జాబిల్లినడుగు
నిండు పున్నమి నాడైనా తననస్సలు చూడలేదనే చెప్తుంది
కదిలే కాలంతో కనుమరుగవుతున్న క్షణాలనడుగు
సమయం లేదంటూ చేసే కాలయాపనదేంటో చెప్తాయి..
ఇష్టంగా చదివే కవితనెందుకు చూడలేదో అడుగు
నీ సమక్షానికి దూరమైన పదాల్లోకే పోనంటూ మనసంటుంది..

ఎంతకని నిన్నట్లోకో..రేపట్లోకో తొంగిచూడను..?
ఒకనాటికి నువ్వు వాస్తవమయ్యే రోజుండగా
కొత్త ఆశలు కలగాలంటే వసంతం రావాలిగా
ఈలోగా శిశిరాన్ని తలపించే కలల్ని రాల్చేసుకుంటా..😌💞

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *