Friday, 24 May 2019

//మోహాతిరేకం//


నా సంతోషమంతా నా గొంతులోనే ఉందనుకున్నా ఇన్నాళ్లూ

పల్లవికి చరణంగా నువు కలిసాక ఓ యుగళం పూర్తయిన సంకేతం.,

నీ పిలుపులోని మాధుర్యానికే మనసూగినట్టుందే నాకు

తలపుల్లో చోటిచ్చి కాలాన్ని బుజ్జగించడం మరపురాని విస్మయం.,

మన మధ్య దూరాన్ని తగ్గిస్తున్న పాటలన్నీ

గతజన్మలోమనమాడుకున్న ఊసులేనన్న భావనకే రెట్టింపయ్యే ఆనందం.,

స్వప్నాల కోసం కన్నులనేం జోకొట్టను...

తనివి తీర్చేందుకు కమ్మని నీ ఊహలు

చేయి పట్టి ఎదలోనే కలిదిరిగేందుకు ఇస్తుంటే ఆహ్వానం.,

మనసు పొరలు విడదీసే ఏం పరిమళం జల్లావో

నీ అంతరాత్మ స్పర్శ నన్ను తీయగా తడిమి

రాత్రి వెచ్చదనాన్ని పూర్తిగా అందిస్తుందీ మోహం.,

ఇంకెప్పుడూ చలేస్తుందని చెప్పను

కప్పుకునేందుకు ఇన్నిన్ని అనుభూతులిచ్చావుగా..😊😊

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *