Thursday, 23 May 2019

//కొత్త దారి//

అప్పుడు కొత్తగా నేను నడక మొదలెట్టిన దారి
కొన్ని పూల గుసగుసల గాలిని కలుపుకొని
నీవున్న చోటే మలుపు తిరిగిందని తెలీదు

ఎన్ని కలల్ని వెంటబడి తరిమానో
ఎన్నేళ్ళుగా ఈ వీథుల్ని పట్టిపట్టి కొలిచానో
మెత్తని ఓ పలకరింపు వినబడుతోందీ వేళ

జ్ఞాపకాలు పంచుకున్న మైదానంలా ఈనేల
నాలో ఆసక్తిని గమనిస్తుందేమో
వేరుపడ్డ నిన్ను నాతో కలపాలన్నట్టు చూస్తోంది

ఒక వెచ్చని ఉచ్ఛ్వాస నాలో కరిగినప్పుడు
నీ గురించిన కబురు తడిమినట్టయి
అడుగు తడబడి ఆగిపోయాను

మనసుపొరల్లో దిగులున్నది నిజమని ఒప్పకున్నా
నీకోసం అన్వేషించడం అందమైన అబద్దమైనా
నాలోపల పరిమళిస్తున్న వనమెంతో బాగుంది

అందుకే
కొనసాగించాలనుందీ క్షణాన్ని
నాలో ఆశలకు పరుగులు నేర్పుదామని..


No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *