Thursday, 23 May 2019

//తలపు స్వరం..//




తలపుల గుంపేదో తోసుకొచ్చి నన్నేపనీ చేసుకోనివ్వక అడ్డుపడి
నా నుంచీ నన్ను ఎడంగా
నీవైపుకి దారిమళ్ళిస్తుంది..

నిలువెల్లా పూలుపూసే చెట్టుకున్న పరిమళం
ఊపిరికొసల గుండా గుండెలో చొరబడి
దేహపు సరిహద్దు వరకూ ప్రవహిస్తుంది ..

నెమలీకంత మెత్తదనానికి వెచ్చదనం అద్దినంత సున్నితంగా
లేలేత పారవశ్యం మొదలై
ఊహగా పరివ్యాప్తమై సరాగమాడుతుంది..

నా కలకి కొనసాగింపుగా
నీతో కవిత్వం రాయిస్తానని రాత్రిని సుదీర్ఘం చేసి
ముద్దులతో వలపుగూడు నేయిస్తుంది..

నీ పిలుపుకే మతి చెదిరేలా మనసుంటే
నాలో కలవరింతల గమకాలే మున్ముందు..
ఋతువులు మరచే రాగమే సంగీతమైతే
నాలో సర్వమూ స్వరాల షహనాయిలేగా ..💜

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *