Friday, 24 May 2019

//చిలిపి మాట//


నావల్ల కాని కవ్వింతలెందుకిస్తావో
నీ మాటలు ఎదపై పూసల దండగా నేవేసుకున్నట్టు..
ఊహలకు మాటలొచ్చి అదేపనిగా పెడుతున్న సొదకి
నేనలా నిలువెల్లా మైకంలో ఊగుతున్నా..

మనసు తలుపు మూసేకొద్దీ
దయలేక తోసుకొచ్చే నీ తలపులకి మర్యాద నేర్పు ముందు..
ఉన్న గుప్పెడు గుండె నీవశమైతే
హృదయం లేని దాన్నయ్యానని లోకం తిట్టిపోస్తుంది..

అరవిరిసిన చేమంతుల పరిమళం
నువ్వు పంచిన పరవశానికి
నా అరమోడ్చిన కన్నులదేనని గుర్తించినందుకేగా
నీకింత అలుసయ్యాను..

నువ్వక్కడ నవ్వితే ఇక్కడ కురిసే వెన్నెల నీకెలా తెలుసో మరి..
పదేపదే నన్ను తడుపుతూ వినోదిస్తావు..
బదులు తీర్చుకొనే రోజొకటుంటుందని మరచిపోకు..
వేసవికాలం చిరుచెమటనై చేరి నీ ఊపిరిసలపనివ్వను చూడు..❤️

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *