Friday, 24 May 2019

//చూపుల వశం..//


ఆ కన్నుల లోతులు నా మనసునెప్పుడూ కొలుస్తుంటాయేమో..
చెప్పాపెట్టకుండా లేలేత గాలి వీచినట్టు
గుండెల్లో జలతారు కదలికలు మొదలు..
పూలకొమ్మ ఊగినంత మృదువుగా
నా ఏకాంతానికే రంగులద్ది మురిసావో
నిత్యానందంలో నన్నూపుతున్నావు ఊయల..

అల్లరిగా పరుగుపెట్టడమెప్పుడు నేర్చిందో రుధిరం
తనువంతా సెలయేరైనట్టు నిశ్చలమైన నన్ను
పదేపదే పలకరిస్తూ ప్రవహిస్తుంటే..
చెప్పొద్దూ..
అరుదైన కువకువలన్నీ తొలిసారి నాకే సొంతమైనట్టు
తొలిపొద్దు వెన్నెల్లోని మోహగీతం నీ విరహమన్నట్టు
క్షణక్షణమో పరవశానికి దారిదొరికినట్టు
నా పరిమళమసలు నీకు కొత్తే కాదన్నట్టు
ఓ గాఢమైన అనుభూతి నాలోన

కలల అంచులో నిలబడి ఎదురుచూడటమెందుకు ఇకపైన
సరాసరి చిరునవ్వుతూ ఎద తలుపులు తోసుకునొచ్చాక.. 😊💞

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *