Friday, 24 May 2019

///మైత్రి వేణువు//


ఈ వేసవి సాయంత్రాన..ఏదో సుతిమెత్తని రాగం..

మదిలో మొదలైన నిశ్శబ్దం కరిగి కోలాహలమేదో మొదలైనట్టు..

పచ్చదనం మాదిరి పదేపదే పెనవేసుకొనే చిరునవ్వులు
వెచ్చని మోహపు దిగులునేదో చూపులకు అద్దినట్టు..

అదుపుతప్పిన ధ్యాసలోని పరిమళం ఆకాశానికెగిసి
అలవాటైన పూలభాషలో నాకు సర్దిచెప్పినట్టు..

ఇష్టమైన పండగొచ్చినప్పటి పులకింతలా..
మైత్రి వేణువు సంకేతాలు అవ్యక్తమైన ఆనందాలైనట్టు..

గుప్పెడు ఊసులకే గుండె తీపై గొంతును తడిపి
ఊహను పాటగట్టి మనసుని ఊయలూపినట్టు..

ఈ క్షణాన కాంతులీనుతున్న కాలానికేం తెలుసో మరి..
పోగేసుకున్న ఇన్నినాళ్ళ మౌనాన్నంతా మాటల్లోకి మార్చేసింది..💕💜

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *