మరీ ఇన్నిభావాలా నాకోసం
పదాలన్నీ పూలుగా నాపై చల్లుతుంటే
ఉక్కిరిబిక్కిరవడం మాని తన్మయత్వమెందుకో
మెలిసందెల మల్లెపూలు కన్నుగీటి కమ్ముకున్నట్టు
అటుపక్క మాలతీ తీగలు నిలువెల్ల అల్లుకున్నట్టు
అల్లిబిల్లి సన్నజాజులు ఏకాంతపు బిడియాన్ని తరిమినట్టు
ఆకుపచ్చని సంపెంగలు సోయగాన్ని తాగినట్టు
విరబూసిన పువ్వులన్నీ నీ తలపుల్లోంచీ జారినవే అన్నట్టు
ఈ సుకుమారాన్ని మనసంతా నింపుకోవాలి
పరధ్యానాన్ని పాటగట్టి క్షణక్షణమిలా వివశమవడం
వెచ్చబడ్డ చిరునవ్వులు దాచుకొని కవితలుగా ఆరబోసుకొని పులకలవడం
ఇంకేదో చెప్పాలని ఎదలో వెతుక్కోవడం
నీ నిండిన దోసిలిలో నక్షత్రాలు
నన్ను చదివిన వెండిముత్యాలై మెరిసిపోతుంటే
మురిపాన్ని అలవోకగా నాపై విసరబోతున్నట్టు కల్పనిప్పుడు
hmmm...ఇప్పుడింకేం చెప్పాలని లేదు..
జన్మకొక్కటే వసంతఋతువు..
అది నీతోనే సాగిపోవాలిక నిరంతరమూ.. 💜
No comments:
Post a Comment