Wednesday, 15 April 2020

// పరాయి రాగం //


కళ్ళు తెరిచినా చీకటిగా ఉందంటే
మనసు సాయం చేయట్లేదనేమో
ఆనందం పరాయిరాగమై పలకరించకుండానే పోతుంది

ఒక్క కలా కొత్తదారిలో నడవలేనప్పుడు
ఎన్ని రాత్రులు నిదుర కరువైతేనేమి
ఆరిపోయే ప్రాణదీపానికి అరచేతి అడ్డు సరిపోదు

గంటకో రీతిలో గాయమైతే మరకలు మానేదెటూ
కన్నీటి ప్రవాహం ఉధృతమైతే మళ్ళించేదెటూ
అప్పుడప్పుడూ...
జీవితం  మలుపులోనే ముగిసిపోతే బాగుండనుకోడం సహజం 
ముక్కలైన ప్రతిసారీ అతికించే అనుబంధమేదీ లేనప్పుడు..class="CToWUd"  

// దారితప్పిన పదాలవ్వి //

అమూల్యమైన క్షణాలు దాచుకున్న మేఘం
నీవైపుకే వస్తుంది చూడు
నే రచించిన రాగాలన్నీ కాజేసింది
కావాలంటే..
ఈరోజు కురిసే వెన్నెల్లోని పరిమళాన్ని గమనించు

విషాదాన్ని పోలి ఉన్నాయని విసుగుపడకు
రాలిన పువ్వుల నుండీ సేకరించిన కృతులవ్వి
కుదిరితే కాస్తంత నమ్మకమివ్వు
జీవితాన్ని వెతుకుతూ దారితప్పిన పదాలవ్వి  

// శార్వరి //


నిషాకళ్ళ మైమరుపుతో..నేరేడుపండు మెరుపుతో
శార్వరి నడిచొస్తుంది..
నల్లని కనుబొమ్మలూ..నీలి కేశాలతో
మత్తు చల్లుతూ కులాసాగా కదిలొస్తుంది..

చీకటి అందంలో వెన్నెల స్వప్నంలా
నీలాంబరి రాగానికి నీలిగంటల తాళమేస్తూ
క్షణాల కోలాహలంలోని కాలస్పందనలా
చైత్రరథంపై చిరుదీపాన్ని చిదుముకొస్తుంది

నిర్లిప్తపు ఆశలన్నీ నిశ్శబ్దాన్ని ముడేసుకోగా
నీలివాని దేహపు నెమలిపింఛం
నిమురుకున్నంత మెత్తగా
నిషిద్ధరాత్రిని ప్రేమించమంటుంది

ఈ నిశీధి శాశ్వతమేం కాదుగా..
ఎంతకని ఆత్మకథలు రాసుకుంటాం
రా..ఏకాంతాన్ని పగలగొట్టుకొని
జన్మమాధుర్యాన్ని కలిసి పాడుకుందాం..💜💕


Corona 3

కనిపించని శత్రువుతో యుద్ధం..
జీవితం అనివార్యమిప్పుడు
అనుబంధాలు  అమూల్యమైనందుకు

సరికొత్త ప్రమాదపు హెచ్చరికను
బేఖాతరు చేయలేక
గెలిచి తీరాలన్న పట్టుదలను పెంచుకుంటూ
కాలం రాస్తున్న పరీక్షిది

క్షణానికో ప్రశ్నకి జవాబు వెతకలేక
ఒంటరితనానికి హద్దులు గీస్తూ 
ప్రశాంత పోరాటాన్ని ప్రోత్సహిస్తుంది

నాకుగా ప్రాణం తీపి కాదు
నావాళ్ళని అంతర్ధానం చేసుకోలేక
ఏకాంత అజ్ఞాతానికి సిద్ధమవక తప్పలేదందుకు

Let's take care of our Loved ones by strictly avoiding d social gatherings.

violence in Delhi

Condemn d violence in Delhi

మొదలెట్టిందెవరో మారణహోమం..
మృత్యువును తమాషా చేస్తున్న ఉన్మాదం..
ఒకరినొకరు ఎందుకు చంపుకోవాలో కూడా తెలియని విద్వేషం

కన్నీళ్ళకు కొదవలేక మిగిలి..
ఓదార్పు కరువై ఊపిరిని ఒగొర్చుకుంటున్న మౌనసాక్షులు కొందరైతే
తెలియని కక్షని తలకెత్తుకున్న మూర్ఖులు కొందరు

చిమ్ముతున్న ద్వేషం దేశాన్ని గాయపరిచాక
ఘనచరిత్రదేముంది గర్వకారణము
మతమూ..వంశమూ పరిథిగా మారాక
విశ్వమూ ఓ కూపస్థమండూకము 😠

// కలలతడి //

దిక్కుతోచని ఏకాంతాలు 
నన్ను పరిహసించేందుకు నల్లమబ్బులై
వానకారు కోయిలలకు కబురెట్టాయి

మంచులో తడిచిన మల్లెపువ్వు వణుకులా
ఈ పొద్దు నాలో మోహనరాగం
నిన్ను కలవరించేందుకే కమ్ముకుంది

నన్ను కౌగిలించిన చీకటి
ఎప్పుడు ఆత్మీయంగా మారిందో
నులివేడి రక్తాన్ని ఉరకలెత్తిస్తుంది

కాలమెందుకు ఆగిందో పెద్ద
మౌనానికీ నాకూ రాజీచేస్తూ
స్మృతుల వానని ఆవిరి చేసేందుకు

కాటుక కన్నుల చూపులు
నింపుతూ నీ రూపం
వాడిపోని కలలతడిలా మిగిలిపోయిందని తెలీనట్టు 


// నిట్టూర్పు //

ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ
చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు
నల్లనిమబ్బులమయమైన ఆకాశం
మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది

ఒంటరిగా యాతన పడుతున్న నిట్టూర్పు
పెదవంచునే నిలబడి కోసేస్తుంటే
మసకబారిన కళ్ళనూ..ఒణుకుతున్న వేళ్ళను
అడిగేందుకు ఏముంటుంది

వేగంగా కదులుతున్న భగ్నహృదయం
గొంతులో అడ్డుపడి మాటల్ని మింగినప్పటి ఘోష
వేదనను హెచ్చరికగా మారిస్తే
వితర్కించుకోవడమే మనసుకి తెలిసిన శబ్దమవుతుంది 😞

// వానంటే..//

అవును
అప్పుడప్పుడూ కురిసేదే అయినా
వానంటే అదో ఇష్టం నాకు

కొన్ని జ్ఞాపకాలు తీపి మిఠాయిలు కాకపోయినా
జీవితాన్ని చేదు కాకుండా ఆపిన వగరుపళ్ళు

తలుపు తీసుకురావడమే
స్వేచ్ఛనుకుంటే..
నన్ను కాదని నేను తప్పించుకు తిరగలేకనే
ఎదురుపడుతున్న నిశ్శబ్దాన్నీ
సంగీతంగా మార్చుకున్నాను

నన్ను చూసే కళ్ళు
నాలుగింతలై తలకెక్కుతున్నా
క్షణాలకి భారం కాకూడదనే
కాలాన్ని బుజ్జగిస్తూ
ముందుకు నడవమనే.. కాళ్ళకు చెప్తున్నాను..!!

Monday, 13 April 2020

// అలిగిందెవ్వరో //

కనురెప్ప వేయడం మరిచింది కన్ను
హృదయమొలికితే ఆపలేనని తెలుసుకున్నట్టు

నిద్రనేదే రాని ఈ కాలానికి పేరేం పెట్టాలో
మౌనాన్నాపే ఇష్టమైన మాటేదీ తెలీనప్పుడు

అలిగిందెవ్వరో నువ్వు తీసే ఊపిరికి తెలుసేమో
నేనెదురుపడ్డా నా వాసన గుర్తించలేవిప్పుడు

అసలు గాయాన్ని ప్రేమించే ధైర్యమెవ్వరికుంటుందని..
ఇవ్వలేని వారికీ ఇవ్వగలిగిందే ప్రేమని తెలీనప్పుడు..💜

// విశ్వాన్ని చూడు //


 
దేశదేశాలూ పశ్చాత్తాపంతో పయనమాపేసినప్పుడు
తొలిసారి ఊపిరి పీల్చుకుంటున్న విశ్వాన్ని చూడు

వేకువ చుక్కలదండ వేసుకున్న వేసవిలో
కొన్ని యుగాల పులకరింపుని
అరమోడ్చిన కళ్ళతో
అద్దంలో చూసుకుంటుంది ప్రకృతి

మేఘాల మెరుపూ..కోయిల పిలుపూ
ఊహల విరుపూ..బుగ్గల ఎరుపూ
వివశించక తప్పని వింత అధ్యాయపు
ప్రతీదీ ప్రత్యేకమైన రోజులివి

కాలుష్యపు వలువలు వీడిన లోకం
రంగురంగుల చిలిపినవ్వుల మైకంతో..
అడివిగాలి ఆకాశంలో దారితప్పి ఇటొచ్చినట్టు
మనసంతా మరుమల్లె సువాసనా సందళ్ళు

ఇప్పుడెవరూ సుప్రభాతం పాడక్కర్లేదు
ఆశలద్దుకున్న అనుభూతులతో కళ్ళవే విచ్చుకుంటాయి 💜

// కాలం..//

అపారమైన శక్తి కలిగిన కాలం
కోట్లానుకోట్ల క్షణాల కౌగిలికి పుట్టిన నిజం
జీవితాన్ని శాసిస్తూ తను మాత్రం కదిలిపోవు దూరం
ఆద్యంతాల అనుభవాలను కనికట్టు చేయగలుగు వేదం

గుండెలమాటు అశను తీర్చగలిగే ప్రణవనాదం
మనసుపడ్డ కవితలా రంజింపజేయు దరహాసం
శిలను శిల్పంగా మలచగల నిశ్శబ్ద గమనం
రెప్పలమాటు నులివెచ్చని కన్నీటిని తీపి చేయగల సాక్ష్యం

యుగయుగాల అవకాశావాదుల కాలక్షేపం
ద్వేషం చేసిన మాయని గయానికి మంత్రం
అవధుల్లేని విషాదాన్ని మరిపించు నవరాగం
నిర్లక్ష్యపు ఆఖరివాక్యాన్ని క్షమించు ఔదార్యం

అనుకోని మలుపులా ఎదురొచ్చి హత్తుకోగల కెరటం
ఊహించని ఉప్పెనలానూ ముంచగలదీ శూన్యం
విశ్వం దాకా విస్తరించిన అదృశ్య చరిత్ర పుటం
నమ్మగలిగితే నిత్యస్ఫూర్తినిచ్చు కన్నుల్లో దైవం 🙏💜

// కలతనిద్దుర //

కబురులు కరువై కేరింతలు కరిగి
కలవరింతలకు కన్నుల్లో కన్నీరు తిరిగి
కనుచూపుమేర చీకటే అలుముకుంటే
కలతనిద్దుర కలలనూ కసిరేస్తుంది

మానసకోయిల విరహమైన సందెల్లో
మోహనరాగమూ విషాదమైన వేళ
మరలిపోయిన చిరునవ్వును పాడలేక
మౌనాన్ని ముడేసుకోడమే ఓ మలుపవుతుంది

మల్లెపందిరి కింద పరిమళపు రుచి
పెదవికి తెలీదన్నట్టు
కౌగిలంటని బ్రతుకు చేదువిందు
కాలానికే మాత్రమే తెలిసిన అనుభవైక్య మరణం

కొన్ని జీవితాలంతే..
వెలుగు పంచడం తెలియని
మిడిసిపడే దీపాల రెపరెపల అపశృతి సంగీతాలు 😒

// చీకటి మడుగు //

చిక్కుముడేసుకున్నట్టు ఆశలన్నీ ఒకేసారి
చీకటి మడుగులో మునిగినప్పుడు
భరోసానివ్వగలిగే చెయ్యేదీ మేఘమవదు..

మౌనపు గలగలలో వినబడ్డ తలపులు
మనసుని మురిపించాలని చూసినా
సంచలిస్తున్న శ్వాస ఒప్పనివ్వదు..

నిశ్శబ్దంలో కరిగే కాలం విలువ
ఒంటరితనపు హద్దును పెంచుకుంటూ
తనలో తానే ఓడి రసభంగమవుతుంది..

కౌగిలించిన తీపిరాగపు చేదు
గుండె గండాన్ని తీర్చేందుకేనని తెలుసుకొనే వరకు
ఆకు 'పచ్చరంగు' మారిపోతుంది 😣

Corona 2

1. ఓ కొత్త పలకరింపుకై వెదుకులాట
మనిషి లోపలి మనిషి
ఇద్దరుగా విడిపోయి
తనను తానే అక్కున చేర్చుకుంటూ
గుండె ఘనీభవించకుండా చేస్తున్న ఓదార్పు ప్రయత్నం

2. ఏమో ఏం జరిగిందో
శూన్యంతో కదిలొచ్చిన వసంతం
లేపనమన్నది లేని గాయాలతో దేహం
తీయని జీవితాన్ని చేదుగా మార్చి
తిరిగి తీపి చేసేందుకు చేస్తున్న కాలక్షేపం

3. చచ్చి బతికిపోయిన వాళ్ళెందరో
ప్రపంచాన్ని అనుసరించే అవసరం లేని కొందరు
కదులుతున్న కాలానికి తలొంచలేనోళ్ళు
చినుకంత సంతోషాన్ని దోసిలిపట్టేందుకు
కాస్త నమ్మకాన్ని వెతుక్కోవడం సహజమిప్పుడు

4. కప్పుకొనేందుకు ఆశే వస్త్రమిప్పుడు
దిగులు తెరలను పక్కకి జరిపి
అడుగులు కలపాల్సిన తరుణమిది
దశాబ్దాల దూరాన్ని కరిగించుకొని
యుద్ధాన్ని గెలిచేందుకే దాగులుమూతలాడుతున్న రహస్యమిది..💜

Saturday, 11 April 2020

// ఆర్తి సందేశం..//

మాయ మొదలయ్యింది. మనసుపొరల్లో దాగిన లాలిత్యానికి మాటలొచ్చినా గుసగుసలు మాత్రమే వల్లిస్తున్న సురగంగలా మారితే గొంతులోని కూనిరాగానికి ప్రారంభమదేగా. ఇంద్రనీలాల కన్నుల్లో ఒకప్పుడు ఒదిగిన ఉదయాలు వేసవిగాలి పలకరింపుతో ప్రకృతి పాడే తొలిపాటలా పులకరింతలిప్పుడు.

స్వప్నాల పుప్పొడి పెదవిపై చిలకరించినదెవ్వరో కొన్ని నవ్వుల సంతోషం విశాలమైంది. అణువంత కేరింత సుదీర్ఘవాక్యమైతే ఆ ఆరాధన విశ్వవ్యాప్తమైంది

మల్లెగాలి వీచినప్పుడు మేఘరాగం వసంతానికి కబురుపెడితే ముద్దమందారాలు నునుతట్టుకి ఉలిక్కిపడ్డట్టు ఈ కాలం, సంపెంగల సన్నాయినొక్కులై.. సిగ్గుపడే అమ్మాయి బుగ్గల్లో సొట్టలై...తీపిరుచి మరిగిన తెరచాటు తపోభంగమై... ఆగనిక్షణాల అలుకని మానుపే అందమైన వ్యాపకం. మౌనప్రవాసం మత్తుగా కౌగిలించే శృంగారవాసంతి వెన్నెల్లో సంగీతాన్ని రంగరించే అతి సుమధుర చంద్రోదయరాత్రి కనుకే బ్రతుకు నేపథ్యమో ఆర్తి సందేశం..💜

// జీవంలేని ప్రాణం //

మాటలు దాచుకున్న మనసు ప్రేమను పంచడం తెలీని పెదవుల తోడు
 మెల్లిమెల్లిగా ఎండిపోతుంటుంది..

నిబ్బరంగా ఉండాలనుకున్న దూరాలు నిర్లక్ష్యానికి దారి తీసి
 కరిగిపోతున్న కాలాన్ని అసలే గుర్తించవు..

దాటేయాలనుకున్న వారధి అనంతంగా సాగి, 
సరిహద్దు కనబడనివ్వని అశాంతిగా పరుచుకుంటుంది..

నిశ్శబ్దంగా మొదలైన ఏకాంతం శూన్యానికి జారి
 పొందాలనుకున్నదేదో మరిచిపోతుంది..

జీవితం పరాయిగా మారి సెలవడిగిన వెంటనే 
దిగులొచ్చి అతిథిలా చెంత చేరుతుంది..

ఉత్సవానంతర రోజులా జీవంలేని ప్రాణం
 విరామనిద్రలో విషాదాన్ని కలవరిస్తూ మత్తిల్లిపోతుంది 😣

// తొలి ఆరంభం //

కందిపువ్వుల మీద వాలిన సీతాకోక ఆనందం
తెలిసిన అనుభూతులే మరోసారి గమ్మత్తుగా
మధుమాసానికిదే తొలి ఆరంభం

మాటలకందని మల్లెల నవ్వులు
సాయింత్రానికంతా విచ్చుకున్న వర్ణాలై
గుప్పెడు గుండెను తడిమిన వానలు

ఆవిరి ముద్దయ్యేంత దీర్ఘశ్వాసతో
మొదలైన వేసవి రోజులు
జ్ఞాపకాల ఉరవడితో గిలిపెట్టే ఊహలు

కాలమాగి పిలిచినట్టనిపిస్తున్న సైగలకి
పయనమయ్యేందుకు సిద్ధపడుతున్న అడుగులు
మరపురాని నిన్నటిపై మక్కువనిపించే ఋజువులు 💜

// హంసానందీ //

ఏదో అలికిడి నింపుతున్న ఉల్లాసమిది
నీ గొంతు తీయగా వినిపిస్తూండవలసిన
ఈ రాతిరి
చందమామ ఆకాశదీపంలా
లేత వెన్నెల్లో వెండిపువ్వుల్లా నీ తలపులు

కలిసి నడిచిన దారులన్నీ
రాలిన ఆకులు.. అనుభూతుల ఆనవాళ్ళుగా
పొద్దువాటారిన తీయని బాధని
సమీకరిస్తున్న నిశ్శబ్దంలో
హంసానందీ రాగాల హోరు కాగా
నాలో ఆశలు నింపాల్సిన మనసు
తానే గొడవపడుతూ
నిన్ను అపరిచితం చేసి
ఊహలవీధుల్లో సంచరించనివ్వనని
కుదిపేసి వెనక్కిలాగుతుంది

వసంతాన్ని నిషేదిస్తున్న వాస్తవం
స్తబ్దతలోని సంభాషణవుతుంటే
I'm not perfect, just original
అని నీకు చెప్పేదేముంది..
మనసున మనసై ఉండాలనుకున్న నేను
ఎప్పటికీ ఏకాకినేనని తెలుసొచ్చాక 😞

// వసంతపూల వాన //

ఆకులు రాలుతున్న వేళ వసంతపూల వాన
ఇక్కడిక్కడే నువ్వుండి రంగులు చల్లుతున్న వాసన

వేకువలో వెన్నెల్లూ..ఏకాంతపు సాయింత్రాలూ
నన్నంతా తడిపేస్తున్న నీ దరహాసపు మల్లెలే

నా నిరీక్షణని సమీక్షిస్తున్నట్టు నువ్వంపిన చిలిపిగాలులు
మనసులోతుల నుంచి వినిపిస్తున్న కొత్తపలకరింపులు

నింగీనేలా అభిషిక్తమవుతున్న ఈ పున్నమి
నీ జ్ఞాపకాలతోనే కరిగిపోతుందేమో ఇలా రాతిరి

చిటారుకొమ్మన దాగావెందుకో ఇప్పటికైనా చెప్పవా జాబిల్లీ..
సైకతసీమల సంద్రపు తీరంలో ఒంటరిగా నన్నొదిలీ 😥

// నల్లని విషాదం //

ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ
చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు
నల్లనిమబ్బులమయమైన ఆకాశం
మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది

ఒంటరిగా యాతన పడుతున్న నిట్టూర్పు
పెదవంచునే నిలబడి కోసేస్తుంటే
మసకబారిన కళ్ళనూ..ఒణుకుతున్న వేళ్ళను
అడిగేందుకు ఏముంటుంది

వేగంగా కదులుతున్న భగ్నహృదయం
గొంతులో అడ్డుపడి మాటల్ని మింగినప్పటి ఘోష
వేదనను హెచ్చరికగా మారిస్తే
వితర్కించుకోవడమే మనసుకి తెలిసిన శబ్దమవుతుంది 😞

// మౌన పల్లవి //

పల్లవిగా పాడాలనుకున్న కొన్ని క్షణాలు
ఉన్నచోటునే ఉండిపోయినందుకు రాగమాగిపోతుంది..
ఇరుఊపిర్ల మధ్య దూరాన్ని కొలిస్తే తెలిసిపోతుందది
విషాదం తడబడుతూ ఆగిన ఆ చోటేదో..

ఎవరన్నారో మరి..
మనసుల మధ్య దూరానికి మౌనం కొలమానమని

అదేమో..
బెంగ తీర్చలేని సందేశమేదీ లేనప్పుడు
గుండెగాయపు కుశలాన్ని విచారించి చేసేదేముందని
సమీకరణాల్లో చిక్కుకున్న సంభాషణే క్లుప్తమైతే
వర్తమానం వైరాగ్యం కాక మిగిలిందేముందని..

అణువణువూ స్తబ్దమై ఆశలు అదృశ్యమయ్యక ..
శూన్యమూ ఒక్కోసారి అమూల్యమూ విశాలమూ అయితే మాత్రం
ఆకులు రాలిన కాలానిపై ప్రేమొచ్చినట్టు
ఊహల దుప్పటిలోని కలతనిద్దుర కూడా
మల్లెపందిరి కింద మోహనగానమనిపిస్తుంది

Corona..

Let us fight against Carona

ఇదో విశ్వమాయ
పరిధిలేని పగుళ్ళలో కూరుకుపోతున్న జీవితం
ఎటునుంచీ తరుముకొస్తుందో తెలియని వింతరోగం
మందూ మాకూలేని అనారోగ్యంతో తెలియని యుద్ధం
దూరం నుండే బుసలుకొడుతున్న కాలసర్పం
ఎవరిని కాటేస్తుందో తెలియని సందిగ్ధం
రేపేం జరగనుందో తెలియని నిశ్శబ్దం
ఆయుధానికి లొంగని అల్లకల్లోలంతో పెనుగులాడుతున్న ప్రపంచం
మోసపూరితమైన చీకటికుట్రలో చిక్కుబడ్డ క్షతగాత్రులం
కనుకే
మనుషుల్లా సృజించుకోవాలనుకున్నాక తప్పదు సంఘీభావం

// కాలం //

కనుమరుగవుతూ కాలం
తనతో పాటూ
సంతోషాల్ని, స్వప్నాలనీ, నవ్వుల్నీ
తీసుకుపోయినంత త్వరగా
విషాదాన్ని, దుఃఖాన్ని, కలతలనూ తీసుకుపోలేదు

కాసేపు ఆగిపోయినట్టు
ఇంకోసేపు నడుస్తున్నట్టు
మరి కాసేపు పరుగెత్తినట్టు
అదంతా జీవితపు సంస్పందనలోని
కేవల కదలికల ప్రకటన

గమ్యం నీదయినప్పుడు పయనం నీదే
గెలవాలనుకున్నాక పోరాటమూ నీదే
ప్రాణం పక్షిలా ఎగిరేలోపు
భవిష్యత్ రంగులు కలగన్నావంటే ఆకాశమూ నీదే

వేలికొసన విదిల్చబడ్డ నాలుగక్షరాలు
నిశ్శబ్దాన్ని చెరిపేసి
నలుగురిని సంపాదించిపెడితే
కోల్పోయిన ప్రతిసారీ ఆసరా దొరికినట్టే 💕

// ఋతుసంకేతం //

గడ్డకట్టిన కన్నీటిచుక్కలే కరిగి రక్తమై
స్రవిస్తాయని ఆలశ్యంగా తెలుసుకుంటే
కళ్ళు వదులై నీరు పారేవరకూ గమనించనంతగా
చప్పుడు చేయకుండానే బ్రద్దలైపోద్ది హృదయం

కాటుక చీకటిలో కదులుతున్న రాతిరికి
కాలం కదలికలు పట్టకపోయినా
అలలకు అలవాటు పడ్డ తీరంలా
ఆటుపోట్లకు గాయపడ్డ ఆనవాళ్ళే జీవితమంటే

పరిచయంలేని చందమామని
భావుకత్వంతో నేలకి రప్పించినంత తేలికకాదు
అరచేత మూసిన ఇసుకను బంధించడం
గుండెనిండా పొదుపుకోవాలనే అపురూపమావిరై
ఆకురాలి ఎగిరిపోయేంత సహజమయ్యాక
శిశిరాన్ని సైతం ఆస్వాదించమనే ఋతుసంకేతం 💜

// ఊపిరి //

ఉత్కంఠనే ఊపిరిగా
కన్నుల నిండా స్వప్నాలుగా
పూల మొక్కంత సున్నితం
అనంతమైన ఆకాశం
జీవితమైతే..
ఆ మొదలు నిలబడ్డ వేళ
కాసేపు ఉద్వేగం..కాసేపు ఉల్లాసమైతే
ఎన్నెన్ని మలుపులూ..మెలికలో
చివరి మజిలీ ఎక్కడో

కాటుకలో దాగిన కన్నీటిచుక్క
నేలజారే వరకే దాని అస్తిత్వమన్నట్లు
రేపటికో ఆశ మిగలాలంటే
స్వర్గానికి ఒణుకుండరాదన్నట్లు
శూన్యం ముందు అంకె నిలబడితేనే
విజయానికి కొలత సరిపోయినట్లు 💜

// నీటిరంగు //

నిన్నటిలాగే ఉందీ ఆకాశం
ఈ రోజుకి జ్ఞాపకంగా మారిన వాస్తవం
చెంపలపై ఉప్పగా జారుతుంటేనే
మనసు సుళ్ళు తిరిగినట్టు తెలుస్తుంది

చిరునవ్వుల్ని బ్రతిమాలుతూ పెదవులపై పిలవాలనుకున్నా
తెరలుగా కదులుతున్న ఓ విషాదం
రెప్పల చూరుకి వేళ్ళాడుతూ
నీటిరంగులో మసకేసి మరీ అడ్డుపడుతుంది

వెనక్కి తిరిగి చూస్తే నాకిష్టమైన నీ కళ్ళు
వర్షిస్తాయని తెలుసు
మునిమాపుకే అందని చీకట్లు ముసిరే సమయమిదేంటో
నువ్వటు కదలగానే శూన్యమై నన్నల్లుకుంటోంది.

ఈ దూరం తరిగే మార్గముందో లేదో మరి
ఎప్పటికి ఈ ఒడి నింపే అనంతమై తిరిగొస్తావో..😒

// రైతు శోకం...//



అంతంత మాత్రపు ఆశలతో
విరిగిపడుతున్న విషాదంతో
నిర్వేదంగా వేసిన అడుగులకేమో
గమ్యం శూన్యమై వెక్కిరిస్తుంది

ఒక్కొక్క విత్తుగా నాటుకున్న కలలు
ఒకేసారి చిక్కుపడి చెల్లాచెదురైనందుకేమో
అనాదిగా మూగబోయిన నోళ్ళు
ఉక్రోషంతో చేస్తున్న నినాదాలైనవి

పచ్చని పొలాల ఊసుల శబ్దం
ఘనీభవించిన కన్నీటిరంగుకేమో
గతితప్పిన ఇతిహాసంగా మారి
భావితరాల ఉసురు పాడుతుంది

కష్టాన్ని నమ్ముకొని కూడా
తీవ్రమైన గాయం సలుపుతుందంటే
చీకటి రాజ్యంలో
వెలుతురొక దూరపు చుట్టమయ్యింది 😞

// పరిచయమవసరమే.. //


గాలివాటానికి అడుగులు చెదిరి గమ్యం మారడమంటే
మునిమాపున మలుపుల్లో చీకటిపొరల్ని దాటడం కాదు
అరమోడ్పులో ఆగిన కల నిజమవ్వాలంటే
తనివితీరనంత ఉత్తేజం ఉవ్విళ్ళూరాలి

సంద్రంలోని అలలు లెక్కలేసుకొని ఒడ్డుని తాకి ఉండుంటే
కొన్ని ఆనందాలు కాలహరణంలోనే కరిగిపోయుండేవి
అపురూపమైన జీవితంలో త్యాగాలూ..భోగాలూ ఎన్నో
ఏదోకప్పుడు గుప్పెడు ఎండిన పువ్వుల గలగలనే ఆరాతీయాలి

కన్నుల్లో దిగులు.. నిదురపోయినంత మాత్రాన తీరనట్టు
సప్తవర్ణాలు ఎదలో దాగినా.. బుగ్గ మీది కన్నీటిచుక్కే ఆకర్షిస్తుంది
అయినా..
తిరస్కరించబడ్డ పదాలకి ప్రాణం లేదని ఎవరనలేరు కనుకనే..
దారితప్పిన జీవితానికీ పరిచయమవసరమే..💜

// సంతకం //

దిగులు పంజరపు అనిశ్చితను వీడి
పసిడి అంచుల పూతలు పెదవికి అద్ది
రంగులీను భావాలను విస్తృతం చేయి
గుండెలోని ఊసులు కాసేపు గింజుకున్నా
కన్నుల్లో స్వప్నాలై కుదురుగా ఒదిగిపోతాయి
శ్వాస వీడే సమయానికి తొందరేముందిలే..
ముందు నీ సంతకమేదో
కొన్ని హృదయాలపైనన్నా ముద్రించి చూడు..
ఆశలన్నీ ఒక్కొక్కటిగా పరిమళిస్తాయి
అప్పుడు..ఊపిరిలో తేడాని మాత్రం పసిగట్టడం మరువకు 💜

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *