అక్షర సైన్యంతో కాగితాన్ని చుట్టుముట్టాలనుకుంటానా..
అంతులేని ఆకాశంలో ఎన్ని వలయాలు తిరిగినా
కన్నుల్లో ప్రవహించే కన్నీరేమో కలాన్ని కదలనివ్వదు..
పోనీ ఊహలకు రెక్కలొచ్చినట్లు ఎగరాలనుకుంటానా..
భావాన్ని పరీక్షించుకుంటూ శిక్షను అనుభవించే ఖైదీలా
కొన్ని రాత్రులెంతకీ వెలుగునివ్వవు..
పెదవికందిన పాటలన్నీ పోగుచేసుకు పాడాలనుకుంటానా..
కళ్ళెదుట రాలుతున్న ఆకుల హాహాకారాలతో
కలలొక్కొక్కటిగా కరుగుతున్న ఆవేదన గొంతు దాటనివ్వదు
ఇప్పుడిక సాయింత్రాన్నయినా ఊహించడం మొదలెట్టాలి
పారిజాతం పరిమళించడం మొదలయ్యే వేళ
ఇంద్రధనస్సు విరిగినా బాగుందనుకుంటూ..
చెరగని అనుభూతుల సంతకాల్ని తడుముకుంటూ..!!