చేయిపట్టి జీవితంలోకి నడిపించాలనుకున్నా
తడబడినట్టే కనిపిస్తావెప్పుడూ
రేపో రోజు నాతో కలిసుండాలనిపించినప్పుడు
నీ తడికన్నుల్లో నీరై జారిపోతాను
నీతో నే పలికిన ప్రతిమాటా
స్మృతుల్లో ప్రతిధ్వనిస్తూ
నిద్దురను దూరం చేసినట్లయ్యి
కొత్తగా పరిచయమయే శూన్యమప్పుడు
క్షణాలను కదలనివ్వక ఆపేసినట్లనిపిస్తుంది ..
బంధమేయాలని నీతో కలిపే నా చేతివేళ్ళు
గుర్తొచ్చిన ప్రతిసారీ
ఖాళీలను పూరించేందుకిక రాబోమని చెప్పినట్లుంటాయి
హృదయంలో పడ్డ చిక్కుముళ్ళు విప్పడం రానప్పుడు
శరీరం అచేతనమవడం తెలుస్తుంది
అప్పుడే సందేశం వినాలనుకున్నా ఏ మేఘమూ గర్జించదు.
ఆరాధనలోని ఆత్మానుభవం నీకందనప్పుడు
కఠినమైన శిల హఠాత్తుగా మృదువుగా మారితేనేమి
నీకు తలపుంటుంది కానీ నాకు తనువుండదు
నిశ్శబ్దమో శాపమై
నే తపస్సు చేసిన కౌముదీ రాత్రుల్లో
నీకు జాగారం తప్పదప్పుడు..

No comments:
Post a Comment