ఎలా మొదలు పెడతావో
అసలేం చదువుతావో
తెలియకుండానే మనసు పరిచినందుకేమో
వెలుగునీడల సందుల్లో
సునాయాసంగా అడుగులేసావు.
నాతో నేను చెప్పుకొనే కబుర్ల పోగులన్నీ
ఒక్కొక్కటిగా కలిపి నన్నో చకితను చేసావు
సిగ్గుతెరను కప్పుకున్న సౌందర్యాన్ని
నీ మనోనేత్రంలో చిత్రించి నన్నో జాబిల్లిని చేసావు
చీకటవుతుంటే నాలో చిత్రమైన వేదన
అరారా కురిసే వెన్నెల మీగడ తరకల్లో
మనసుకు నలుగు పెట్టే భావాల వెల్లువ
ఆపై తెల్లవారనివ్వద్దంటూ కొన్ని కలల కువకువ..

No comments:
Post a Comment