Friday, 17 November 2017

//నేనే నువ్వై..//



కవితను రాస్తానో..కదంబమే కూర్చుతానో..కమ్మగా నీ మదినే దోచేస్తానో
కదిలొస్తానో..కల్పిస్తానో..నా కైదండల్లో నిన్నల్లేస్తానో..
కురుస్తానో..కులుకుతానో..నీ కావ్యంలో కథానాయికనవుతానో..
కన్నీరవుతానో..కాగితమవుతానో..నీ కవితల్లోకొదిగే అక్షరమవుతానో..
గాలినై వీస్తానో..గంథమే పూస్తానో..నీ ఆత్మలో పరిమళమైయ్యుంటానో..
గంగనవుతానో..గులాబీల వాననవుతానో..నీ గుండెల్లో ప్రవహించే మధువునవుతానో..
చెలమవుతానో..చెంగల్వనవుతానో..నీ చిరునవ్వుల్లో చిగురింత నేనవుతానో
చంచలిస్తానో..చరిస్తానో..నీ చేతులతో నా అరచేతులు పెనవేస్తానో
చెమరిస్తానో..చిదిమేస్తానో..నీ చింతలు తీసే చేమంతినవుతానో

జ్ఞాపకమవుతానో..జావళినవుతానో..నీ చిత్తంలో చైత్రించే మొలకనవుతానో..
జాబిలినవుతానో..జాజిరినవుతానో..నీ పెదవుల్లో కదలాడే జానపదమవుతానో
తన్మయమవుతానో..తెలిమంచునవుతానో..నీ హేమంతానికి పులకించే రేకునవుతానో
తుషారమవుతానో..తడుపుతుంటానో..నీ తలపుల్లో తేలే మబ్బునవుతానో..
థ్యానమవుతానో..థ్యాసనవుతానో..నీ రెప్పలమాటు కలలో రాగమవుతానో..
దీర్ఘమవుతానో..దూరమవుతానో..నీ శూన్యాన్ని నింపే నిశ్శబ్దమవుతానో

నిలబడతానో..నిట్టూర్చుతానో..నీ అడుగులకో గమ్యమవుతానో..
నారింజనవుతానో..నవోదయమవుతానో..నీ నయనాల నెచ్చెలి నేనవుతానో..
నిశ్చలనవుతానో..నిద్దురనవుతానో..నీ నర్తనంలో నేనో నీడనవుతానో..
పాటనవుతానో..పదమునవుతానో..నీ ప్రేమగీతానికి పల్లవినవుతానో..
ప్రాణమవుతానో..ప్రాసనవుతానో..నీ జీవనగీతిక భావమవుతానో..
బొమ్మనవుతానో..భవితనవుతానో..నీ బాహువుల్లో స్వర్గమవుతానో
బిందువవుతానో..బంధమవుతానో..నీ బరువైన క్షణాల ఊపిరవుతానో..
మరాళినవుతానో..మందస్మితనవుతానో..నీ మదిని మెలిపెట్టే మెరుపవుతానో
మత్తునవుతానో..మైనమవుతానో..నీ మాటల్లో ముత్యమవుతానో..

రంగునై..రాతనై..రవళినై..రాథనై..
లాలనై..లలితమై..లాలసై..లాహిరై..
వర్షమై..వాగునై..వయ్యారమై..వరాంగినై..
శ్వాసనై..సాంత్వనై..శాశ్వతనై..స్నిగ్ధమై..
ప్రభాతమై..ప్రకాశినై..ప్రణయమై..ప్రశాంతినై
భాష్పమై..గ్రీష్మమై..నక్షత్రమై..నిరీక్షణై..

అనుక్షణం నీతో నేను..నాలో నువ్వంత వరకే నేను
నువు దూరమైతే తట్టుకోలేను..ఆ దురదృష్టాన్ని మోయనూ లేను..!!

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *