సాయంకాలపు సరిగమలో ఏదో తేడా కనబడుతుందీ రోజు.
హేమంతానికి దగ్గరవుతున్నట్టు పువ్వుల్లోనూ స్పష్టమవుతున్న ఒణుకు. కంటికి కనిపించని గాలి మాత్రం చిరునవ్వుల ఈలలేస్తూ చేస్తున్న సందడి. పొద్దువాలకుండానే కచేరీకి సిద్ధమవుతున్నట్టు నక్షత్రమూకల తొందరలు. ఇంతకు ముందెప్పుడో నాలో ప్రవహించిన గుర్తుగా కొన్ని ఆలాపనలు.
ఎన్ని కాగితాలు రాసినా అంతమవని కలల మాదిరి మరిన్ని పాటలు మదిని వెంటాడుతూ, కన్నులకింపైన దృశ్యాదృశ్యాలు గమ్మత్తుగా చూపును మార్చుతూ... మెలికలు తెలియని మేను ఒయ్యారాన్నిప్పుడే నేర్చినట్టు సరికొత్త విరుపుల సొలపులు.
ఓ సరికొత్త లాహిరికిదో ప్రారంభమనిపిస్తుంది. ఊహల్లో ఊగుతున్న గులాబీ పరిమళం మెత్తగా మనసుని చీల్చి నాలోంచీ నన్నెటో తీసుకుపోతున్నట్టు ఒంటరిగా ఉన్నా బానే అనిపిస్తుందిప్పుడు. నరాల్ని మీటేందుకు శుక్లపక్షం ఏదో గమ్మత్తును కుమ్మరించనుందన్నట్టు...

No comments:
Post a Comment