నా రెప్పల మీద వాలే కలలకే తెలియాలి
అది పగలో రేయోనని
నా నుంచీ నన్ను విడదీసి
నిశ్శబ్దపు ఊహల్ని చెదరగొట్టి
ఎక్కడెక్కడికో మోసుకుపోతున్నాయి
రెక్కలు అవసరం లేకుండానే నేను
ఖండాంతరాలు దాటి పోతున్నాను..
వసంతమో హేమంతమో తెలియని ఋతువు
లిపిలేని స్వరపల్లవి తోడు
ఎండ మండిపోతున్నా చెమటచుక్క లేదు
అనుభూతుల సవారిలో అలుపన్నది లేదు..
అంతంలేని ఆశలు కాలాన్ని లాక్కుపోతున్నప్పుడు
హృదయానికి గమ్యం అర్ధం కాదెప్పుడూ..
కన్నులు మూతబడిందీ లేనిదీ తెలీనప్పుడు
అది జ్ఞాపకమో సాయంత్రమో గుర్తు లేదు..
వినిపిస్తున్న నవ్వుల రాగం..
తనువు తంత్రులను సవరిస్తుంటే
ఆ లలితకచేరీ ఏ జన్మదో తెలియనేలేదు
అప్పుడెప్పుడో వెన్నెలజల్లులో తడిచిన తమకం
అవ్యక్తభావ మధురిమను వెచ్చగా కప్పుకున్నాక
పరిచితమైన పరిష్వంగపు పరిమళం
ఈ స్వర్గంలోంచీ బయటపడాలని లేదిప్పుడు
ఆనందాన్ని తాగుతున్న ఆత్మని వారించాలని లేదస్సలు..

No comments:
Post a Comment