Friday, 24 May 2019

//ఇంకేం కావాలి..//

అనంతమైన నీ హృదయపు సరిహద్దుల్లో అడుగేసినప్పుడు
మలుపు తిరిగిన మోహపు దారులెంట రాలిన పూలు
అల్లరి గాలుల గుండా నన్ను పలకరించినప్పుడనుకున్నా
నీవైపు నా గమనం పాత జ్ఞాపకమై ఉంటుందని..

మాటల కొనసాగింపుతో మొదలైన మాధుర్యం
చీకటి చాటున చెమ్మవాసనై పరిమళించినప్పుడు
నీదీ నాదీ ఒకటే ఆరాటమని గుర్తించేలోపు
నా ఉనికి నీ సమక్షంలోనే పోగొట్టుకున్నా..

స్వల్పంగా కంపిస్తున్న మనసు తలుపుచాటు అలజడిలో
నిద్రిస్తున్న అశాంతి దూరం జరిగి నవ్వినప్పుడు
ప్రవహిస్తున్న జీవితం చేయి చాచి రమ్మని పిలిచింది
నీ కనుస్పర్శతో నేనిప్పుడు కరిగిపోతున్న మంచుబొమ్మని..

ఇంకేం కావాలి..

అలుపలా తీరిపోతుంటే..
నీ చూపు నీరెండ కిరణాల తాకిడికే..💕😊 


//పులకింత//


మనసుకి రెక్కలుంటే మధురానుభూతులకు కొదవేముంది..
మల్లెలు చివురించే వేసవి సాయింత్రాలన్నీ మనవైపోయి
అసంకల్పితాలన్నీ నిజమైపోవూ..

నీ చూపు కొసలు తగిలి నా పెదవి పగడమైన సంగతి
కొన్ని తేనె చుక్కలతో కలిపి ఓ కవితగా రాసుకుంటే
ఆ అభివ్యక్తిలో అనుక్షణం పరవశించిపోవూ..

ముంగురులు సవరించి చూపులు ఒక్కటి చేసి నువ్వు నవ్విన వేళ..
లెక్కకు మించిన నక్షత్రాలు ఒకేసారి మిణుక్కుమన్నట్టు..
నీ కన్నుల్లో ఆర్తిగా దాచుకున్న రూపం నాదైతే కాలమాగిపోదూ..

ఏన్నో జన్మలుగా శృతిలయలమై జ్వలించినప్పుడు పుట్టిన రాగాలన్నీ
మునుపెవ్వరూ రచించని రంగు పువ్వుల దోసిళ్ళయితే
తొలివేకువ అనుపల్లవి వెచ్చని పులకింతల గమకమైపోదూ..

నీ తలపులకే ఇంత మహత్యముంటే ఊపిరున్నంతకాలం
ఈ మౌనాన్నే నేననుసరించనూ..
అంతర్లీనమైన ఆనందం సుదీర్ఘమైన నీ ఆరాధనగా ఆలపించనూ..☺️😊

 

//దిగులు పువ్వు//


దిగులు పువ్వులా మనసు..
నీ తలపునే అల్లుకు కూర్చుందంటే ఆహ్లాదమవ్వాలిగా
మెత్తని బుగ్గల్లోనూ గుబులు..
నువ్వు తడిమేంతవరకూ చిరునవ్వుని చేరనివ్వనిదానిలా
ఉండీ ఉండీ మూగబోవడం కొత్తగా నేర్చినట్టు
మౌనరాగానికి లిపితో అవసరమే ఉండదుగా..

ఎందుకిదంతా అని అడగవా..
పూసినట్టే పూసి వాడిపోతున్న సన్నజాజులనడుగు
రేయంతా పరిమళిస్తున్నా నా తలకెందుకు ఎక్కలేదో చెప్తాయి
తనకు తానుగా కరిగిపోతున్న జాబిల్లినడుగు
నిండు పున్నమి నాడైనా తననస్సలు చూడలేదనే చెప్తుంది
కదిలే కాలంతో కనుమరుగవుతున్న క్షణాలనడుగు
సమయం లేదంటూ చేసే కాలయాపనదేంటో చెప్తాయి..
ఇష్టంగా చదివే కవితనెందుకు చూడలేదో అడుగు
నీ సమక్షానికి దూరమైన పదాల్లోకే పోనంటూ మనసంటుంది..

ఎంతకని నిన్నట్లోకో..రేపట్లోకో తొంగిచూడను..?
ఒకనాటికి నువ్వు వాస్తవమయ్యే రోజుండగా
కొత్త ఆశలు కలగాలంటే వసంతం రావాలిగా
ఈలోగా శిశిరాన్ని తలపించే కలల్ని రాల్చేసుకుంటా..😌💞

 

//చిలిపి కవితలు.//


అనంతంలో మొదలైన ఆనందమే
వర్తమానంలో నీ ఉనికిని కనుగొంది..

ప్రతిధ్వనిస్తున్న పాటలోని పల్లవే మరి
వలసొచ్చిన మేఘపు మెరుపయ్యింది

నేను లేని నువ్వుండబోవనే
చూపుకొసన కలల్ని దాచుకొమ్మంది

నీ ముందు నదిలా మారి ప్రవహించడం
నీలాకాశం నామీదనే కురిసినట్టుంది

పాలపొంగు నురగలోని తీపంతా
నీ నవ్వులు నా పెదవిని తాకినప్పుడే తెలిసింది

నువ్వూ నేనూ పంచుకున్న కువకువలే
పిట్టభాషగా మారిందని అనిపిస్తుంది

హా..

రెప్పలతో రాసుకున్న ప్రేమలేఖలేగా
మనమిప్పటికీ పంచుకుంటున్న చిలిపి కవితలు..💜💕

 

//చూపుల వశం..//


ఆ కన్నుల లోతులు నా మనసునెప్పుడూ కొలుస్తుంటాయేమో..
చెప్పాపెట్టకుండా లేలేత గాలి వీచినట్టు
గుండెల్లో జలతారు కదలికలు మొదలు..
పూలకొమ్మ ఊగినంత మృదువుగా
నా ఏకాంతానికే రంగులద్ది మురిసావో
నిత్యానందంలో నన్నూపుతున్నావు ఊయల..

అల్లరిగా పరుగుపెట్టడమెప్పుడు నేర్చిందో రుధిరం
తనువంతా సెలయేరైనట్టు నిశ్చలమైన నన్ను
పదేపదే పలకరిస్తూ ప్రవహిస్తుంటే..
చెప్పొద్దూ..
అరుదైన కువకువలన్నీ తొలిసారి నాకే సొంతమైనట్టు
తొలిపొద్దు వెన్నెల్లోని మోహగీతం నీ విరహమన్నట్టు
క్షణక్షణమో పరవశానికి దారిదొరికినట్టు
నా పరిమళమసలు నీకు కొత్తే కాదన్నట్టు
ఓ గాఢమైన అనుభూతి నాలోన

కలల అంచులో నిలబడి ఎదురుచూడటమెందుకు ఇకపైన
సరాసరి చిరునవ్వుతూ ఎద తలుపులు తోసుకునొచ్చాక.. 😊💞

 

// తేమకలలు //


విరిసిన పెదవుల మందారాల్లో
ఓ సన్నని మందహాసం..
కాస్తంత సంతోషాన్ని వెదజల్లుతున్నట్టు..

మనసులో దాగిన సంగీతం
సెలయేరై ప్రవహించినట్టు
ఆ ఇష్టమైన భావాన్నెలా గుర్తించడం
నిజంగా నీలో తీయదనం పొంగిందా
ఒలికిపోతున్న తేమకలలు
ఉదయానికి రంగురంగుల పదాలుగా పరుచుకుటుంటే
నీ సమక్షపు వెచ్చదనాన్నే నేననుభవిస్తున్నా..

దోసిళ్ళతో ఇన్నిన్ని భావాలు చల్లినదెవరో

ఋతువు తెలిసిన గాలి అలల పరిమళానికి

నేనో మోహితనవుతున్నా..


మదిలో రేగిన లేతసుగంధం

ప్రణయానుభూతిని పొదుగుతుంటే

ఈ గుసగుసనెలా తట్టుకోను..

అందుకే అణువణువూ పెనవేసిన

నీ ఊహలతో రంజిల్లుతున్నా..💕

 

///మైత్రి వేణువు//


ఈ వేసవి సాయంత్రాన..ఏదో సుతిమెత్తని రాగం..

మదిలో మొదలైన నిశ్శబ్దం కరిగి కోలాహలమేదో మొదలైనట్టు..

పచ్చదనం మాదిరి పదేపదే పెనవేసుకొనే చిరునవ్వులు
వెచ్చని మోహపు దిగులునేదో చూపులకు అద్దినట్టు..

అదుపుతప్పిన ధ్యాసలోని పరిమళం ఆకాశానికెగిసి
అలవాటైన పూలభాషలో నాకు సర్దిచెప్పినట్టు..

ఇష్టమైన పండగొచ్చినప్పటి పులకింతలా..
మైత్రి వేణువు సంకేతాలు అవ్యక్తమైన ఆనందాలైనట్టు..

గుప్పెడు ఊసులకే గుండె తీపై గొంతును తడిపి
ఊహను పాటగట్టి మనసుని ఊయలూపినట్టు..

ఈ క్షణాన కాంతులీనుతున్న కాలానికేం తెలుసో మరి..
పోగేసుకున్న ఇన్నినాళ్ళ మౌనాన్నంతా మాటల్లోకి మార్చేసింది..💕💜

 

//గమ్మత్తు//


మత్తుగా వలేసి పట్టే నీ చూపు ఈరోజేదో కొత్తగా సైగ చేస్తూ
నన్ను అమాంతం తాగేసినట్టు..నీకోసమే తీయనవుతున్నా..

ఓరగా పొదవిపట్టే నీ ఆకర్షణలో దివారాత్రులు
దిక్కు తోచని తన్మయత్వాన్ని తనువుకిచ్చి మోయలేని అవస్థపడుతున్నా..

ఇన్నాళ్ళుగా కురవలేదనుకున్న పరవశం నీ కన్నీరుగా నన్ను తడిపి..
అలౌకికానికో ఋతువుందని చెప్పినట్టు నిలువెల్లా పులకిస్తున్నా..

నా ఎదురుచూపుల కావ్యాలు నీ చిలిపి కళ్ళలో చదివినపుడే
కొంటెసిగ్గు తరిమినట్టు ఈ శిశిరాన్ని నీ పేరు మీద రాసుకున్నా..

వేణువులూది వెన్నెల రాగాలు ఆహ్వానించు సమయంలో
అన్యోన్యలోకానికి పోదాం రమ్మన్నట్టు మురిసిపోతున్నా..😄😉

 

//వసంతోత్సవం//

పచ్చని ఆకులు కలగలిసిన ఆశల్లో
పోగేసుకున్న జీవితోత్సాహాన్ని నిమురుతుంటా
వెచ్చని హృదయంలో హరివిల్లు ఉదయించేందుకు
వర్షించమని మదనోత్సవానికి పిలుపునిస్తా

కలనేతల పూలవనంలోని రాగం
చిరునవ్వుల కవితోత్సవానికి కానుకిస్తా

ఊహలకు రంగులద్దుతున్న వేళ
తప్పిపోయిన నేను వసంతోత్సవంలో దొరికిపోతా..💕


//నన్నే చూస్తూ..//


నాలో ఏ భావుకతను వల్లిస్తున్నవో ఆ చూపులు..
క్షణక్షణానికీ రట్టింపవుతున్న నా తపన

గుండెలోతుల్లో అల్లుకుపోయిన పరవశాల చిక్కులతో నేనవస్థపడుతుంటే...

నా చిన్నిచిన్ని ఆశలు మోయగలిగే ఆ కన్నులు
రెప్పపాటు చప్పుళ్ళతో సంగీతాన్ని నాకందిస్తుంటే
కొన్ని కలలు కృతులుగా రాసేసుకుంటున్నా..

నిద్దుర మేలుకొన్న వేకువన అరనవ్వులతో
వెన్నెల కురిపించే కన్నులు
మల్లెల జల్లుని తలపిస్తుంటే నేనే ఓ చైత్రమై పరిమళిస్తున్నా..

ఆ సగం మూసిన కన్నుల కిలకిలలు
దూరాన్ని చెరిపి నీ ఊహలు చేరవేస్తున్న గుప్పెడు రహస్యాలు
నా ఏకాంతానికి కానుకిస్తున్నా..

నన్నే చూస్తూ ఉండిపో అలా..
నా మనసుకో నిశ్చింతనందించే హాయిలా..😄

 

//చిలిపి మాట//


నావల్ల కాని కవ్వింతలెందుకిస్తావో
నీ మాటలు ఎదపై పూసల దండగా నేవేసుకున్నట్టు..
ఊహలకు మాటలొచ్చి అదేపనిగా పెడుతున్న సొదకి
నేనలా నిలువెల్లా మైకంలో ఊగుతున్నా..

మనసు తలుపు మూసేకొద్దీ
దయలేక తోసుకొచ్చే నీ తలపులకి మర్యాద నేర్పు ముందు..
ఉన్న గుప్పెడు గుండె నీవశమైతే
హృదయం లేని దాన్నయ్యానని లోకం తిట్టిపోస్తుంది..

అరవిరిసిన చేమంతుల పరిమళం
నువ్వు పంచిన పరవశానికి
నా అరమోడ్చిన కన్నులదేనని గుర్తించినందుకేగా
నీకింత అలుసయ్యాను..

నువ్వక్కడ నవ్వితే ఇక్కడ కురిసే వెన్నెల నీకెలా తెలుసో మరి..
పదేపదే నన్ను తడుపుతూ వినోదిస్తావు..
బదులు తీర్చుకొనే రోజొకటుంటుందని మరచిపోకు..
వేసవికాలం చిరుచెమటనై చేరి నీ ఊపిరిసలపనివ్వను చూడు..❤️

 

//నేనే గెలుపు..//


నిన్నటికి కొనసాగింపుగా

ఈ ఉదయపు ఏకాంతంలో పరిమళిస్తున్న సౌందర్యం నాతో నేను పూరించుకున్న అనంతమైన మౌనం..

అంతర్ముఖమై నేనున్న వేళ..ఆకాశమంత ఆనందం నా పెదవులదైతే..గుండె చప్పుడు హెచ్చుస్థాయి స్వరానికీ అందని సంగీతం..

నాకు నేనుగా కొత్త ఆశలతో చిగురించుకున్న చిరునవ్వుల వసంతమే..కనురెప్పలు మూసి నేనూహించిన కాలపు కదలికల సారాంశం..

జ్ఞాపకాల తేనె మరకలు ఎదలో ఉన్న కాస్త చీకటినీ తరిమేసాక ఉత్సవమైన జీవితానికి గెలుపే మలుపులెరుగని గమ్యం..

అతిశయమనుక్కున్నా నే పాడే రాగమదే..ప్రేమైక అస్తిత్వ రాగం..నా ఉనికిని అనుభూతించుకొనే అపూర్వమైన స్వరం...💕

 

//ఎద చాటు //


నన్ను ఎద చాటు చేసిన ప్రతిసారీ
కన్నులు తాముగా తపించి
నువ్విచ్చే చుంబనానికని రెప్పలు వాల్చుతాయి..
మనసు బరువునంతా మోసే గుసగుసలు
అప్పటికే మౌనవించి నీ స్పందనకై ఎదురుచూస్తున్నాయి..

గుండెచప్పుళ్ళతో సంగీతమయ్యే నిశ్శబ్దం
చిరునవ్వులకు వెలుగునద్ది
అనుభూతిని ఆస్వాదించడం నేర్పినట్టు అప్పటికప్పుడు
అదో సంచలనం..

ఇప్పుడే మొదలెట్టు ధ్యానాన్ని..
మనసాకాశంలో చుక్కలను లెక్కించాలనుంది..
రాత్రైతే నీకు రెట్టింపు బదులివ్వాలిగా..💕

 

//తలపే మధురసం//


పల్లవిని నిరాకరించే పాటేదీ లేనట్టు
మౌనంలో నువ్వున్నా నా మాటను ఆలకిస్తూ
స్పందించే నీ ప్రతివాక్యమూ నేనయ్యాక..
జీవించడం ఇప్పుడే మొదలయ్యిందని చెప్పనా

పున్నమి రాత్రుల్లో పోగేసుకున్న చిరునవ్వులు
నీ ఏకాంతానికి కానుకిచ్చానంటే..
నేనొదిగిన మదిలోని వెచ్చదనం
నీ అంతర్మధనంలోంచీ పుట్టిన జీవనోత్సాహమనుకోనా

తడుముకున్న సుదీర్ఘమైన క్షణాలన్నిట్లో
నీ తలపంటే అచ్చంగా నాతో నువ్వున్నట్టేగా ..
స్వప్నాన్ని వాస్తవంతో వేరు చేయలేదందుకే
నీలో ప్రవహించే మధురసాలు
నన్ను తడపాలని చూస్తున్న తొలకరులవుతుంటే💜🥰

 

//వలపు మాయ//


హృదయానికి దగ్గరగా వినిపిస్తున్న కూనిరాగాలు
నీ పెదవులు కలవరిస్తున్న నా పేరైతే..
రంగురంగుల ఊహల్లో మెరుస్తున్న వలపు మనదేగా..

నీ ఊపిరి తగిలిన ప్రతిక్షణమూ ఓ పులకింత కాగా..
కలలన్నీ అలలుగా ఎగిసి అందమైన కవిత్వమై...
అనంతానికి చేతులు చాచి ఆకాశాన్ని హత్తుకున్నట్టు..
నాకోసం విశాలమైన నీ బాహువులు నన్ను దాచుకొనే మృదువైన సంకెళ్ళు కదా..

చల్లని వానతుంపర్ల సొగసైన సోయగం నా గుప్పిట్లో ఒదిగి ముత్యాలు కరిగినట్టు
నిశ్శబ్దంలో నువ్వాడే గుసగుసలన్నీ గుండె ఝల్లుమనిపించి
కవ్వింతలు పుంతలు తొక్కుతున్న జలపాతాలేగా....

అప్పుడెప్పుడో నన్ను ప్రాణమంటూ విరహిస్తే నవ్వుకున్నా..
ఇప్పటికీ నీకు చేరువ కాలేని ఈ కొసన నేనున్నా..
కనికరించడం తెలిసిన కాలాన్నందుకే వేడుకుంటున్నా..
వచ్చే వసంతానికైనా నీ జతలో నన్నుంచమని... 😒

//రసానుభూతి//

నువ్వు దగ్గరవుతున్నకొద్దీ
నా క్షణాల విలువ పెరిగిపోతుంది..
మనోకామనలన్నీ నెరవేరనున్న భావం
నిలువనివ్వని గుభాళింపుతో గుండె కలవరపడుతుంది
ఎన్ని మలుపులు తిరిగి నువ్వూ నేనూ ఇలా కలిసామో
మదిలో లాలసకి రసానుభూతి దొరికింది
ముగింపులేని బంధమొకటి పెనవేసుకున్న సమయం
కాలం కలిసొచ్చి హృదయ పరితాపాన్ని తీర్చేసింది
కలలు కలిపి నవ్వుకున్న ఆనందం
ప్రణయగీతాల అల్లికలో తనివి తీరింది
కురవని కన్నీరు ఎండినట్టయిన వైనం
నీ పరిష్వంగంలో నేను పొందిన ధైర్యం
కొత్తగా వెలిగేందుకు కార్తీకమే రానక్కర్లేదిప్పుడు
ఆ కాస్త వెన్నెలా గంధమై జారితే చాలిప్పుడు..!!


//ప్రేమ ఋతువు..//



ఋతువుల కనుసైగతో ఆహ్లాదం కరుగుతున్న అలజడొక పక్క

ఆకులు రాలిపోతూండగానే చిగురిస్తున్న ఆశలొక పక్క
ఇప్పపువ్వుల పరిమళమంత విభిన్నంగా
నన్నల్లుకున్న నీ ఊహల విచిత్రంతో
కొన్ని కిలకిలలైనా పంచుకోమని అర్ధించినట్టు జీవితం

మృదువుగా మొదలైన ఒకే భావం
దారి కుదిరి మనిద్దరి గమ్యం ఒకటి చేసినందుకు
పొరలు పొరలుగా మొదలై నన్ను నిలువనివ్వని ఆరాటం
సమ్మోహనమైన కలలతో మోహఋతువుకిదో ఆరంభం

మగతను తాగుతున్న రాతిరిలో..
పులకరమూగి దాగుడుమూతలాడుతున్న కొన్ని చిలిపి నవ్వులు
దూరాల మధ్య కాలాన్ని కరిగించగా
నిద్దుర కొరతదేముంది కదా..
మనిద్దరి మాటలన్నీ ప్రేమైనప్పుడు..💟


//మోహాతిరేకం//


నా సంతోషమంతా నా గొంతులోనే ఉందనుకున్నా ఇన్నాళ్లూ

పల్లవికి చరణంగా నువు కలిసాక ఓ యుగళం పూర్తయిన సంకేతం.,

నీ పిలుపులోని మాధుర్యానికే మనసూగినట్టుందే నాకు

తలపుల్లో చోటిచ్చి కాలాన్ని బుజ్జగించడం మరపురాని విస్మయం.,

మన మధ్య దూరాన్ని తగ్గిస్తున్న పాటలన్నీ

గతజన్మలోమనమాడుకున్న ఊసులేనన్న భావనకే రెట్టింపయ్యే ఆనందం.,

స్వప్నాల కోసం కన్నులనేం జోకొట్టను...

తనివి తీర్చేందుకు కమ్మని నీ ఊహలు

చేయి పట్టి ఎదలోనే కలిదిరిగేందుకు ఇస్తుంటే ఆహ్వానం.,

మనసు పొరలు విడదీసే ఏం పరిమళం జల్లావో

నీ అంతరాత్మ స్పర్శ నన్ను తీయగా తడిమి

రాత్రి వెచ్చదనాన్ని పూర్తిగా అందిస్తుందీ మోహం.,

ఇంకెప్పుడూ చలేస్తుందని చెప్పను

కప్పుకునేందుకు ఇన్నిన్ని అనుభూతులిచ్చావుగా..😊😊

 

//ఒంటరి మనసు//

ఈ చక్కని సాయింత్రం..
నీరుగారిన రెప్పలతో ఒంటరయ్యింది మనసు..
జీవితానికి వేసారిన ఓ ఏడుపుకేక నీకెప్పటికీ వినబడదు..
అందని ఆకాశంలా శూన్యానికి తరలిపోయావుగా
నిన్న పలకరించిన మందారం మొహం తిప్పుకున్నట్టు..
క్షణానికో ఊహ ఈ ప్రపంచానికి దూరంగా తీసుకుపొయినట్టు..
ఈ నిశ్శబ్దంతో పరిచయం ఈనాటిది కాదన్నట్టు
సర్దుకుపోని సమయం ఏదో బంధాన్ని నెమరేసుకున్నట్టు..
ఒక్కోసారి చీకటంతే..
అదుపు తప్పిన ఎద లోపలి అలజడిలా వర్తమానపు వైరాగ్యాన్ని పలికించలేదు...
తనలో తాను ప్రాణ స్పర్శ కోసం గింజుకుంటుంది..!!



Thursday, 23 May 2019

//చీకటైతే..//


నువ్వటు కదిలీ కదలగానే
పెదవులబుట్ట ఖాళీ అయ్యింది..
నా నవ్వుల పువ్వులన్నీ నువ్వే పట్టుకుపోయినట్టు
క్షణాల్లో దిగులు నీడొచ్చి ఒత్తిడి పెంచింది
వాలు చూపు చెమ్మగా మారినట్టు
గుండెల్లో గుచ్చిన విషాదం చీకటిని తలపిస్తుంటే
నన్ను తనలో కలుపుకొనేందుకు మౌనం ముందుకొచ్చింది
నిశ్శబ్దం గుప్పెడే కానీ
దాన్ని మోయడమో నరకం

మనసు వెనుక మాటేసిన ఆనందం తెలియాలంటే
ఉదయమవ్వాల్సిందే
నీ పలుకు చిలిపి చినుకులు కిరణాలై నన్ను తడమాల్సిందే..😣

 

//అనుభూతి //


వెచ్చని పారవశ్యం ఎగిసి మేల్కొలుపయ్యిందంటే
మనసు నిమురుతున్న బ్రహ్మానందం నువ్వేనన్నది సుస్పష్టము

నిశ్శబ్దాన్ని దాటిన అనుభూతి సాంత్వనిచ్చిందంటే
నను పిలిచే నీ పెదవులదెంత మార్దవమో తెలుసు

ముడిపడ్డ ఊపిరులలో కనుగొన్న ఆశలు
నీ కన్నుల మైమరపులో చూసానన్నది నిజము..
గుప్పెడెంత గుండె ఉప్పొంగి ఉత్తుంగమైందంటే
నీ తలపు సావాసమేనన్నదీ తెలుసు

సున్నితమైన చిలిదనమంతా కొసరికొసరి పంచినప్పుడు
లోలోన బీజియం నీకు వినబడకున్నా

అపురూపాలన్నీ నీలా తడిమేవే ఇప్పుడన్నీ..
అనుపల్లవిగా మారింది నువ్వేనని చెప్పాలా ఇంతకీ..😊

//ఓయ్..//

ఓయ్..

తడిచి బరువెక్కిన పువ్వులా
ఎన్ని కువకువలని దాచుకోమంటావ్
అందనంత దూరంలో నువ్వుండి
కాస్తంత సమయం లేదని
ఈ బంగారు క్షణాలకు నన్నొదిలేస్తే
ఎవ్వరినని పలకరించను..
చిరుగాలి చూస్తే హాయి మోసుకుంటూ కూనిరాగాలు తీస్తుంది
పూలతో అదేపనిగా గుసగుసలాడుతూ మైమరచిపోతుంది
ఆకాశమంతా ఒక్కొక్కటిగా పరుచుకుంటున్న చుక్కలతో
పున్నమి పేరంటానికి ముస్తాబవుతున్న సందళ్ళు
సోయగమాపుకోలేని పారిజాతం తన సువాసనంతా వెదజల్లి
అసలే భారమవుతున్న శ్వాసను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

అంతకన్నా పొగరెక్కిన వెన్నెల..
నన్ను తడిపి తను ఒణుకుతున్నట్టు నటిస్తుంది..

ఇంకా ఎంతకని అలిగి అలసిపోమంటావ్

ఎటుచూసినా మధుమాసపు తుళ్ళింతలు
నీ జతలేని నన్నెవ్వరూ పిలువక నేనిలా పిచ్చిరాతలు..😊😊


//యుగళం//

నా సంతోషమంతా నా గొంతులోనే ఉందనుకున్నా ఇన్నాళ్లూ
పల్లవికి చరణంగా నువు కలిసాక ఓ యుగళం పూర్తయిన సంకేతం.,

నీ పిలుపులోని మాధుర్యానికే మనసూగినట్టుందే నాకు
తలపుల్లో చోటిచ్చి కాలాన్ని బుజ్జగించడం మరపురాని విస్మయం.,
మన మధ్య దూరాన్ని తగ్గిస్తున్న పాటలన్నీ
గతజన్మలోమనమాడుకున్న ఊసులేనన్న భావనకే రెట్టింపయ్యే ఆనందం.,

స్వప్నాల కోసం కన్నులనేం జోకొట్టను...
తనివి తీర్చేందుకు కమ్మని నీ ఊహలు
చేయి పట్టి ఎదలోనే కలిదిరిగేందుకు ఇస్తుంటే ఆహ్వానం.,

మనసు పొరలు విడదీసే ఏం పరిమళం జల్లావో
నీ అంతరాత్మ స్పర్శ నన్ను తీయగా తడిమి
రాత్రి వెచ్చదనాన్ని పూర్తిగా అందిస్తుందీ మోహం.,

ఇంకెప్పుడూ చలేస్తుందని చెప్పను
కప్పుకునేందుకు ఇన్నిన్ని అనుభూతులిచ్చావుగా..💞


//తలపు స్వరం..//




తలపుల గుంపేదో తోసుకొచ్చి నన్నేపనీ చేసుకోనివ్వక అడ్డుపడి
నా నుంచీ నన్ను ఎడంగా
నీవైపుకి దారిమళ్ళిస్తుంది..

నిలువెల్లా పూలుపూసే చెట్టుకున్న పరిమళం
ఊపిరికొసల గుండా గుండెలో చొరబడి
దేహపు సరిహద్దు వరకూ ప్రవహిస్తుంది ..

నెమలీకంత మెత్తదనానికి వెచ్చదనం అద్దినంత సున్నితంగా
లేలేత పారవశ్యం మొదలై
ఊహగా పరివ్యాప్తమై సరాగమాడుతుంది..

నా కలకి కొనసాగింపుగా
నీతో కవిత్వం రాయిస్తానని రాత్రిని సుదీర్ఘం చేసి
ముద్దులతో వలపుగూడు నేయిస్తుంది..

నీ పిలుపుకే మతి చెదిరేలా మనసుంటే
నాలో కలవరింతల గమకాలే మున్ముందు..
ఋతువులు మరచే రాగమే సంగీతమైతే
నాలో సర్వమూ స్వరాల షహనాయిలేగా ..💜

 

//ఉగ్రవాదం//


ఎన్ని శాంతి పావురాలు నేలకొరిగాయో..
ఏరులై ప్రవహించిన రుధిరం సాక్షిగా
దీపాలెన్ని కొండెక్కాయో..
ఉగ్రవాదం ఊదిన అసందర్భ రాక్షత్వంలో..
విరుచుకుపడ్డ ఉన్మాదానికి ఆయాసమన్నది లేదు
దొంగతనంగా పరివ్యాప్తమై ప్రాణాల్ని హరించేందుకు
అద్భుతమైన అందాన్ని కప్పుకున్న అబద్దాలే అన్నీ..
ఈ ఘర్షణలు అంతమయ్యే రోజెప్పుడో మరి..

 

//వెచ్చని వెన్నెల//

అలవాటు లేని తడబాటే అయినా ఈ స్వప్నమెంతో బాగుంది
మనసు మననం చేస్తున్న ఆ తలపు నీదేనా?

ఏవేవో దూరతీరాలను కలిపేందుకు కాలమెంత ప్రయాసపడిందో
ఈ తీయని హాయిని మనసుకి పూసి నిదురను దూరం చేసింది.,

నీ వెలుగు నాపై కుమ్మరించి నా చీకటిలో నువ్వు సేదతీరాక
పరిపూర్ణమయ్యే రోజు ప్రణయాన్నెంతో మెత్తగా వివరించింది.,

దోబూచులాటం కూడా తెలియని కనిదోయి
ఎప్పుడు నీతో చూపు కలిపిందో
రెప్పలు వాల్చి మరీ నవ్వుకుంటూ సిగ్గు పూలను స్మరిస్తోంది.,

ఎదను తొణికించేంత వెన్నెల కురుస్తుందంటే
ఏదో మాయ మధువొలకబోసింది నిజమేమో...
చందమామను చూసి చాన్నాల్లైనా,
ప్రతి రోజూ పున్నమే అన్నట్టుంది...
మాఘమాసపు వెచ్చని వెన్నెల
అనుభవైకవేద్యం కాలేదుగా అందరికీ..😊


//మాఘమాస వెల్లువ//


పొగమంచుతో నిండిన వేకువ
మాఘమాసపు మధుమాధుర్యానికి మగతను చేర్చి
పూల పరిమళముగా మనసంటిన వేళ
అనంతమైన పరవశం కన్నులను తాకి సన్నటి వణుకు
తెల్లవారి కలను చిలకాలని చూస్తుంది..

బిడియపడ్డ క్షణాల అవ్యక్త భావనేదో
రంగు మారి కొత్తగా చిగురించేందుకు
నులివెచ్చని చోటుకోసం మనసువాలుల్లో వెతుకుతూ
కాలాన్ని కాసేపాగమని ప్రాధేయపడుతుంది

పెదవంపుల్లో నవ్వులు ఇంద్రధనస్సులై
విచ్చుకున్న వైనం..
బుగ్గపై ఓ తడిముద్దు చప్పుడైన శబ్దం
కొత్తపాటగా నన్ను ఆలింగనం చేసే తమకం
ఆనందమనే కువకువను కప్పుకోవాలనిపించేంత ఇష్టం కదా మరి ..

నాకైతే
అరుదైన అపురూప ఆలాపనే ఇది
ఊపిరాడనివ్వని సంపెంగి దండలా నన్ను పెనవేసినది..

//నిదురించనీ..//



"సారీ సారీ రాత్ తేరీ యాద్ సతాయే..
ప్రీత్ జగాయే హమే నీంద్ న ఆయేరే..నీంద్ న ఆయే.."

ఇన్నాళ్ళూ మౌనవించిన పెదవోపలేని మాటలన్నీ పాటలై పల్లవించినా
తుంటరి మనసుకీ మాయ సరిపోలేదు..
నన్నక్షరం చేయని పదాలేవీ నీ దగ్గర లేవని చెప్పినా నాలో పెంకితనం కుదుటపడదు..
కలల మడువులో గుప్పెడు మల్లెలతో నువ్వే కవనమై పరిమళిస్తున్న సాక్ష్యాలు నా చుట్టూతా ఉన్నా..
ఏ తీరుగనూ తనివి తీరని తపనలేమిటో తెలీదు..

చీకటెంత కురుస్తున్నా కునుకొచ్చి కనికరించదు

నీవిచ్చే అనుభూతి పరాచకానికొచ్చిన వెన్నెలకి చెమట పట్టిస్తున్నా నాకేం కావాలో తేలదు..
బహుశా మృదువుగా మోగే మువ్వలాంటి నీ తీయని పిలుపుతో ఊయలూగేందుకు ఉవ్విళ్ళూరుతుందేమో మానసం..
పిలిచిచూడొక్కసారి..తలపుల వంతెన దాటి నీ ఎద చేరిపోతా..

వేలపువ్వుల మెత్తదనం సోకినంత పులకరింపు కావాలిప్పుడే..

ఒక్క కౌగిలింతకే పరాయితనం పోతుందంటే ఈ రాత్రికే..

కలలోకైనా విచ్చేస్తా..
నీ గుండెచప్పుడు సవ్వడికైనా ప్రశాంతంగా కనుమూయగలనేమో చూస్తా..

నిద్దురలేని నా తడికళ్ళ వెచ్చదనానికి ఆహ్లాదమందిస్తావు కదూ...😊

 

//మట్టి నీడలు//

ఏనాటి దాహం ఇది..
కాలం తీరకుండానే దేహమోనాడు
మట్టిలో కలిసిపోతుంది
అంతుచిక్కని కలలు నిద్రలోనే సమాప్తమవుతాయి

ఆప్తమైన క్షణమొక్కటైనా ఉందా చెప్పుకోడానికి
వర్షించిన దయతో ఏ ఆశలూ చిగురించవెందుకు
మన చేతుల్లోనే ఉందనుకొనే సమయానికి సైతం
వెనుదిరిగి చూసే అలవాటసలే లేదెందుకు

పోటెత్తుతున్న అలల అరుపులో
గాయాల సలుపు తెలిసేదెందరికి..

కిరణం చూడని చిట్టడివి
ఓనాడు ఆక్రోశించి కాలి బూడిదవుతుంది ..

పరవశించాల్సిన యవ్వనవనంలో
దారి తప్పి గమ్యాన్ని దూరం చేసుకున్న ఏకాకినడగాలి

ప్రాణమొక్కటే మిగిలిన ఏకాంత ద్వీపంలో

చిరునవ్వుకి చిరునామా ఇప్పటికన్నా తెలిసిందో లేదోనని..!!



//నీ కన్నులు..//

ఆ కనులు..
మనసు కాచుకొమ్మని
పల్లవి పాడి ఉన్నట్టున్న మౌనాన్ని
చెదరగొట్టు దీపాలు..
కలల కౌగిలికి
కనురెప్పలు ఎత్తిపెట్టి
అనిర్వచనానికి సిద్ధమవుతున్న వెన్నెల్లు
విషాదాన్ని విరిచేందుకు
దరహాస చంద్రికలను వెదజల్లుతూ
హాయిని పంచు ప్రియ రాగాలు..
ఆర్తిగా ఆశనందించి
చూపుల్లో నిక్షిప్తమయ్యేందుకు
రమ్మంటూ పిలుస్తున్న పాలపుంతలు..
నేత్రంచలాల నవ్వులు పూయించి
వెనుదిరగనివ్వని పరిమళంతో
నన్ను తూనీగను చేస్తున్న చిలిపి పువ్వులు.. 💜


//నీ ధ్యానం..//


దారి తప్పి ఇటొచ్చిన గాలి
పొగమంచులా మారి మనసునల్లుకుంది
ఇన్నాళ్ళూ నాతో ఉన్న మౌనం
రాగాన్ని కల్పించుకొని ఏకాంతపు సరిహద్దుని దాటింది
గుప్పెడు మనసు కోల్పోయిన పరధ్యానమేంటో నాకు తెలుస్తోంది
నిదురపోయి చానాళ్ళయింది నేను
నువ్వూహించిన రేపుకో ఋజువుంటే..
నీ చల్లని చూపుతో దాన్ని మంత్రించి
కొన్ని కలల సహితంగా నాకు ఒప్పచెప్తావు కదూ..
కనీసం ఒక్కరాత్రైన మనిద్దరినీ ఒక్కటిగా చూడాలనుంది..

 

//మనసు కల్పన..//




మరీ ఇన్నిభావాలా నాకోసం
పదాలన్నీ పూలుగా నాపై చల్లుతుంటే
ఉక్కిరిబిక్కిరవడం మాని తన్మయత్వమెందుకో

మెలిసందెల మల్లెపూలు కన్నుగీటి కమ్ముకున్నట్టు
అటుపక్క మాలతీ తీగలు నిలువెల్ల అల్లుకున్నట్టు
అల్లిబిల్లి సన్నజాజులు ఏకాంతపు బిడియాన్ని తరిమినట్టు
ఆకుపచ్చని సంపెంగలు సోయగాన్ని తాగినట్టు
విరబూసిన పువ్వులన్నీ నీ తలపుల్లోంచీ జారినవే అన్నట్టు
ఈ సుకుమారాన్ని మనసంతా నింపుకోవాలి

పరధ్యానాన్ని పాటగట్టి క్షణక్షణమిలా వివశమవడం
వెచ్చబడ్డ చిరునవ్వులు దాచుకొని కవితలుగా ఆరబోసుకొని పులకలవడం
ఇంకేదో చెప్పాలని ఎదలో వెతుక్కోవడం
నీ నిండిన దోసిలిలో నక్షత్రాలు
నన్ను చదివిన వెండిముత్యాలై మెరిసిపోతుంటే
మురిపాన్ని అలవోకగా నాపై విసరబోతున్నట్టు కల్పనిప్పుడు

hmmm...ఇప్పుడింకేం చెప్పాలని లేదు..
జన్మకొక్కటే వసంతఋతువు..
అది నీతోనే సాగిపోవాలిక నిరంతరమూ.. 💜

//అదే..//


అదే..

జివ్వుమంటూ లాగే నరాల ఉద్రిక్తతలో
గాభరాగా తిరిగే గతం మడువులా
ఉలిక్కిపడేంత క్రౌర్యంగా ఉండదది..

ముళ్ళుంటాయని తెలిసిన కలల దారిలో
గులాబీల పరిమళాన్ని
అనుసరిస్తూ పోయేందుకు
మార్గాన్ని సుగమం చేస్తుందది..

ఊసుపోని మాటల అహంకారంలో
అంతులేని రహస్యాలను
శూన్యానికి పురిగొలిపే
అంధకారంలా ఉండదది..

శాంతి పావురపు తెల్లని రెక్కలతో
స్వేచ్ఛను విస్తరింపజేసే
భావాల కదలికల కిరణాల
మెరుపు కల్పనై చైతన్యమిస్తుందది

అదే..జ్ఞాపకమంటే..
నిన్నటి ఊపిరిలోని పరిమళాన్ని..
నేటి శ్వాసలోకి అవలోకించగలగడం
పేరులేని పువ్వుల్లోని సున్నితత్వాన్ని
ఊహాతీత సృష్టిలోని సౌందర్యాన్ని
చూపుతో మొదలెట్టి హృదయంలోనికి ఆహ్వానించడం
నిశ్శబ్దాన్ని మౌనానికి మార్చి సరికొత్త స్వరంలోనికి మార్చుకోవడం..

 

//కేరింత ..//


నీ తలపును లొంగదీసుకున్న క్షణాల కేరింత
ఎన్ని వర్షపు చినుకులు రాల్చుకుందో మేనంతా
ఎటునుంచి అంటుకుందో మెరుపల్లే ఆనందం
లెక్కకందని పువ్వులు తడిమిన ఈ మెత్తదనం..
అంతులేని భావాలోపక్క..మమేకమైన రాగాలో పక్క..
దూరమవుతావని దిగులులేని పొదరింట
మనసంతా కవిత్వం చేసుకొని నిద్రించాలనుందీ వేళ..💞

//ఎన్ని కలలో..//


మనసు దాటి ఎంత ముందుకొచ్చేసానో..
సరిహద్దు ఎక్కడుందో
తెలిసే అవకాశమే లేదు
చేతులు చాచి చుట్టుకొనేందుకు విషాదం వెంట రాలేదు
ఎక్కడ పుట్టిందో తెలియని సెలయేరులా చిరునవ్వు ప్రవహిస్తుంది
ఒక సుగంధం మొదలైన మత్తయితే తెలుస్తుంది
కానీ
అనంతాన్ని శ్వాసించడం.. కొత్తగా అనిపిస్తున్న యదార్ధం
చిగురించిన మరువం అలజడిని స్పర్శించి
మౌనం నేపధ్యమైన సంతోషపు సవ్వడిలో
ఆకాశం అందిందంటే ఆరాలింకేం వెతకను
అలసట తీర్చి పులకరింతకు గురిచేసి
ఊహలు పరుగెత్తించేలా భావాలున్నంత కాలం
కలలు కనడం ఆపలేను..💜

 

//శుభోదయం..//




వెండిమబ్బులేవో మనోహర గీతాలు పాడుకుంటూ
ప్రత్యేకమైన లేత రంగును పులుముకున్న సమయం
వివశించక తప్పని అమూల్య క్షణం

మంచుకి తడిచిన దేవదారు వనమేదో
గుండెల్లో పరిమళిస్తున్న ఊహలకేమో
ఈరోజుకిదో గమ్మత్తైన సంచలనం

చల్లగా చిరుచలి చిలుకుతూ పసరు వాసన
ఆవిరి పట్టినట్టుగా సన్నని ఒణుకు అలుముతున్న ఉదయం
కమ్మని ఇష్టాన్ని నెమరేసున్నంత నిశ్శబ్దం 💜

//కొత్త దారి//

అప్పుడు కొత్తగా నేను నడక మొదలెట్టిన దారి
కొన్ని పూల గుసగుసల గాలిని కలుపుకొని
నీవున్న చోటే మలుపు తిరిగిందని తెలీదు

ఎన్ని కలల్ని వెంటబడి తరిమానో
ఎన్నేళ్ళుగా ఈ వీథుల్ని పట్టిపట్టి కొలిచానో
మెత్తని ఓ పలకరింపు వినబడుతోందీ వేళ

జ్ఞాపకాలు పంచుకున్న మైదానంలా ఈనేల
నాలో ఆసక్తిని గమనిస్తుందేమో
వేరుపడ్డ నిన్ను నాతో కలపాలన్నట్టు చూస్తోంది

ఒక వెచ్చని ఉచ్ఛ్వాస నాలో కరిగినప్పుడు
నీ గురించిన కబురు తడిమినట్టయి
అడుగు తడబడి ఆగిపోయాను

మనసుపొరల్లో దిగులున్నది నిజమని ఒప్పకున్నా
నీకోసం అన్వేషించడం అందమైన అబద్దమైనా
నాలోపల పరిమళిస్తున్న వనమెంతో బాగుంది

అందుకే
కొనసాగించాలనుందీ క్షణాన్ని
నాలో ఆశలకు పరుగులు నేర్పుదామని..


//తీపి కలలు//


కలలతో కాలయాపన చేసేందుకేమో రాత్రి
మన ఊహలన్నీ తనలోనే దాచుకుంది
అరుదైన మన అల్లిబిల్లి ఊసులు
ఎదనిండా కలిదిరిగి పెదవుల్లో పాటలుగా మారిపోతాయి
కదిలిపోయే కాలానికీ తెలీదనుకుంటా
మనం కలిసే సమయాలు సంగీతాలవుతాయని..

అంతంలేని మనోఆకాశంలో నక్షత్రమై మెరవడం
వేకువకి రంగు మారిపోయే యామినికి తోడవడం
నీ ఊపిరిలో కలిసున్నందుకేగా అదృష్టం
కవనవనంలో పదముగా పూయడం
ఇష్టమైన భావనగా ఎదలో చేరడం

నీలో పరిపూర్ణమై ఉండాలనేగా జన్మ సంకల్పం

హృదయం తడిచిందో లేదో గమనించకిప్పుడు
హరివిల్లు నీలో మాత్రమే విరిసిందని పులకించు..

//దూరాలు..//




అందనంత దూరంలో ఉంటూనే
ఒకరికొకరం పలకరించుకుంటూ ఉంటాం

ప్రకటించడం రాదంటూనే అవ్యాజమైన అనురాగం
పూస గుచ్చిన దారమై సాగుతుంది
కదలని మేఘాల కూర్పులా
పదాలు పరుచుకున్న ఆకాశం సౌందర్యాన్ని కుమ్మరిస్తుంది

తురాయిపువ్వుల నవ్వొకటి కనుకొసల విస్తరించి
ప్రేమరంగును చల్లి తనుగా తడిచిపోతుంది

అనువైన నిశ్శబ్దాలన్నీ వేలికొసల జారినప్పుడు తెలిసిందది
హృదయాన్నెవరూ తాకలేదనుకున్నా..
కానీ..
నేను నేనుగా లేని క్షణాలు అనుభూతి ఊయలూగుతూనే ఉన్నాయని..

//ఎద సంగీతం//

మత్తుగా చిరుగాలిని తాగినందుకే
అలజడి చెలరేగి మది తడబడిందంటే
ఆ మృదువైన సువాసనెంత గొప్పదో..

గుండెల్లో చొరబడ్డ సంగీతం
ఎన్నోజన్మలుగా అనుసరిస్తున్నట్టు
కిలకిల రావాల వేకువెంత అందమో..

కలలు అనవసరమన్న కన్నుల ముందు
ఆనందం పెనవేసుకు నిద్రిస్తున్న
నీ చిరునవ్వుల మోమెంత అపురూపమో..

అందుకే..
ఏకాంతపు తీరంలో మౌనాన్ని సవరించి
ఇష్టమైన తీపిని
వెచ్చగా కాజేయడమే చిలిపిదనం నాకు..


//కొన్ని చినుకులు..//



కలలో కలిసిన వేళా విశేషమే..
మౌనం పాటలై మదిలో ఓ అలజడి..
సమయమాపలేని ఊహల్లో తేలిపొమ్మనే చిరునవ్వులు వేసిన మంత్ర ఫలమిది..

పుష్యమి పువ్వుల చెమరింతలన్నీ
మంచు బిందువులై పరిమళించే నిశ్శబ్దంలో
ఎడతెగని తీయని కేరింతల కిలకిలలది..

ఆకులు రాలే శిశిరంలో ఆశలు పోగేసుకొని
ఏకాంతపు నది ఒడ్డున చిరుగాలికి తెలిసిన తొలిరాగమే
నాకు నచ్చిన మధుమాసం..

చిక్కులు పడ్డ సిగ్గులముడి విడదీసే ఉత్సాహమే
నిన్నుసిగొలిపే ప్రణయమైతే
రెట్టింపయ్యే గుండెచప్పుడే ఊపిరులకు సమన్వయం..

చేతులు కలుపుకుంటూ అడుగుల పయనం మొదలవ్వాలిక..
ఋతువులు కరిగి కొన్ని సంగతులు ఒకరికొకరం చల్లుకోవాలంటే.. 

 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *