కొంచెం ఏకాంతం కావాలి..నాకు నేను దూరమై చాలా కాలమంది మరి
'పురిటి వెలుగున బుగ్గపై నీ పంటినొక్కును కంటి రా'
'మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం'
'కదిలే ఊహలకే కన్నులుంటే..'
ఛా
ఒకప్పుడా పాటలు వినేగా పెళ్ళంటే వెచ్చని మంటనుకుంది
నిజమే..ఇప్పుడు మంట బాగా ఎక్కువైంది
అందుకేగా 'Intensive Care 'అన్నది
24/7 అతని కనుసన్నలలో మెలగాలి
ఆ మాటల మంత్రదండం ఆదేశించినట్టు ఊగాలి
తన భావోద్వేగాలకు నృత్యించాలి
కారుతున్న కలలను ఎవ్వరూ చూడకుండా దాచాలి
ఒక్క పసుపుకొమ్ము కట్టిన బంధం కోసం
పాతికేళ్ళుగా నిత్యయుద్ధం
రోజూ ఓడిపోతున్నా గెలుస్తాననే ఆశ లేకున్నా
ఎందుకోసమో తెలీని యుద్ధం..
హాయిని మోసే క్షణాల మాట అటుంచి
ఆత్మ సంతృప్తి భారాన్ని నటించాలి
దిగుళ్ళు దాచుకోడానికి దిళ్ళున్నప్పుడు
అశాంతికి కొన్ని రంగులద్దితే సరిపోతుంది
వైరాగ్యం స్రవించిన ప్రతిసారీ
Selfpity తోనే తుడిచేసుకోవాలి.
Intensive care అంటే భద్రతనేగా
ఋతువు కాని ఋతువులల్లా ఏడ్చి ఏంటి ఉపయోగం
ఎన్నో కన్నీటిచుక్కలు గుండెల్లో ఇగిరిపోయాక
వ్యక్తిత్వం వేదాంతమని పెద్దపెద్ద మాటలకేం ప్రయోజనం
ముప్పావు జీవితం ముగిసిపోయాక
మళ్ళీ ఎందుకిలా..
జీవితంలో నాకో రోజు లేకపోయినా
అతని ప్రాణదాసిగా పండుగలన్నీ నావేగా
ఒకసారి చిరునామా కోల్పోయాక
అస్వతంత్ర జీవితాన్నే
భద్రతావలయమని భావించక తప్పలేదుగా..

No comments:
Post a Comment