స్రవించిన అనురాగమంతా
ఏ కాలువలో కొట్టుకుపోయిందో
నే కురిపించిన ప్రేమంతా ఏ మన్నులో కలిసిపోయిందో
వేయి భావాలతో నిన్ను పులకించి రాసినా
నా ఉనికి నీ ఏకాంతానికైనా ఆనదు
రోజుకో దారిలో సంచరించే నీకు
నీ ఎదురుచూపుల దిగులు గుమ్మానికానుకున్న నేను కనపడను
నిన్ను జయించాలనుకున్నప్పుడలా నన్ను నేను కోల్పోతూ
నిర్లిప్తమైన ఆక్రందనై నేనోడిపోయా
శిలలు సైతం కల కనగలిగే రాతిరిలో
మరపురాని విషాదం నన్ను మోహరిస్తుంది చూడు
మనసు చంపుకు బ్రతుకుతున్నప్పుడు ప్రాణమున్నా అది రాయికి సమానం కదా
కొన్ని సశేషమైన రాతల్లో నిన్నుంచలేను
కానీ
కాలం సమాధానమివ్వలేని శిశిరంలో రాలిపోయేందుకు నాకు నేనుగా సిద్ధమవగలను..

No comments:
Post a Comment