వెన్నెల కిరణాలు జారిపడినప్పుడల్లా
జ్వలిస్తుంది మనసు
వేల తారలు నవ్వుతున్న పున్నమినాడు
గగనాన్ని చూడాలి
ఎదలో నిశ్శబ్దాన్ని చెదరగొట్టేలా వేల భావాలు రొద పెడుతుంటాయి
దైవత్వమేదో సిద్ధించాలన్నట్లు చెట్ట్లు
పరవశంలో తడుస్తుంటాయి
పాట పాడుతున్నట్లు ఊగే గాలి
సన్నగా హాయిని రేకెత్తిస్తుంది
"ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ.."
ఈ క్షణాలకు రెక్కలొస్తే చెప్పాలనిపిస్తుంది..
మాఘమాసపు వెన్నెల గీతికలో ఈ రేయి
మంచు తానాల మానస సరోవరానికి సమానమయ్యాక
గ్రహణం వీడిన జాబిలి హొయలు చూడాలనిపిస్తుంది
ఒక కవితనల్లేందుకు సాయం రమ్మని ఆత్మను చిలుకుతున్న వేళ
స్వప్నాలనాపమని కన్నులను వేడుకోవాలనిపిస్తుంది
వెలుగునీడల ఆనందవిషాదాలు తెరచాపలైనప్పుడు
రంగురంగుల పువ్వులన్నీ నా నేస్తాలిప్పుడు..

No comments:
Post a Comment