అప్పుడే శిశిరం వచ్చి వారమైపోయింది
వేసవిగాలి తడమకుండానే ఆకులు రాలిపోతున్నాయి
అయినా ఎప్పటిలానే అదో మౌనం
అలలా కదిలే జ్ఞాపకాల చప్పుళ్ళకు కాబోలు
ఆ పాతరాగమే దగ్గరగా వినిపిస్తుంది
మనసు మడతలు విప్పే కొద్దీ
కలలో కూసే కోయిల కుహూ పాటలు
సలపరాన్ని పెంచే సంపెంగి వాసనలు
ఏమో..
వసంతానికి తొందరపడ్డం మానేయాలి
కలయిక కన్నా కలవరించడం బాగుందనుకున్నప్పుడు
వెన్నెల్లో దాచుకున్న కాసిన నవ్వులూ
తలపుల్లో కన్నీరుగా కొట్టుకుపోకమునుపే
స్మృతులకు స్వస్తి చెప్పాలిప్పుడు
విషాదం దహించేలోపు
జీవితానికి నవకాలు నేర్పాలిప్పుడు..


No comments:
Post a Comment