ప్రాణ విహంగం ఎగిరిపోతున్నట్లనిపించినందు
దూరాన్నెక్కడో గుడిగంటల శబ్దమయ్యి
బరువెక్కిన మనసు కాస్త తేలికయ్యింది
గుండెల్లో హోరుమంటున్న జ్ఞాపకాలు ఒక్కోటి
కదులుతూ తరలిపోతున్నాయి
బాల్యం నుండీ యవ్వనంలోకి పయనించిన రోజులు
వాస్తవం నుండీ అనుభవంలోకి మారిన జీవిత దశలు
ఆలోచనలో ఉండగానే స్పర్శ కోల్పోతున్న భావన
ఎంత ప్రేమగా పోషించుకున్న శరీరం
ఎంత ఉత్సాహాన్ని నింపుకున్న జీవనం
ఎంత అస్తిత్వాన్ని మోసుకు తిరిగిన చైతన్యం
అయినా సరే..పిలుపందినప్పుడు అనంతంలోనికి పయనమాగదు
ఏదీ శాశ్వతం కాదని తెలిసినప్పుడు
ఊపిరి సైతం నెమ్మదిస్తుందప్పుడు
తప్పించుకోలేని యాతన మొదలైనప్పుడు
ఆ పరివేదన అనుభవించక తప్పదు
అందుకే కాలమాగిపోయేలోపు
ఒక్క వాక్యంలోనైనా చేరాలన్న ఆశలు
ఒక్క పదముగానైనా పరిమళించాలన్న కలలిప్పుడు..!!
No comments:
Post a Comment