ప్రాణం విలవిలలాడుతూ ఆ తరువు..
మునుపంతా హేమంతానికి ఒణికిన పచ్చని ఆకులు
ఋతువు రంగు మారగానే
శిధిలమై రాలేందుకు సిద్ధపడ్డవి
వేసవిగాలి కాసింత సోకగానే
ఆశలు కోల్పోయిన గీతికలై నేలజారాయి
అశ్రువులెండిన తరువు మోడై
శిశిరమంతా చింతలను వంత పాడింది
ముందే కూసే కోయిలలు కొన్ని
సంకేతాల జావళీలతో
స్వప్నాలు ఎగురగొట్టాక
వసంతమో అపర సౌందర్యమై విచ్చేసింది
కాలపు పరిష్వంగంలో
అనుభూతులు తడిమి చూసుకున్న తరువుకప్పుడు
లేత గులాబీ రంగు ఆకులు మొలకెత్తడం తెలిసింది
పచ్చదనానికై నిరీక్షణ నిశ్శబ్దపు పరిభాషలో మొదలైంది
ఇప్పుడు తూరుపు లేపే కన్నా ముందే
ఎదుగుతున్న ఆకులను తడిమేందుకు
తరువుకు తొందర..
విచ్చుకున్న వేకువప్రభలోని పులకింతను
ఊహల తెమ్మరకు అంటుకట్టాలని..

No comments:
Post a Comment