గడిచిపోయిన క్షణాలలో ఆ కాసిని జ్ఞాపకాలని
మనసంతా నింపుకు మరీ అనుభూతిగా మార్చుకొని
కుదిరినప్పుడల్లా నెమరేసుకుంటుంటాం..
కలలు నిజమవుతాయని ఊహలకు చిగురు తొడగొచ్చనీ
ప్రతి ఉదయమో ఉత్సాహాన్ని పులుముకుంటాం
ఏ చీకటికీ భయపడే అవసరం లేదని
మునిమాపుల నీడలతో చెలిమి చేసి హాయిగా మురిసిపోతాం
దూరానుంటూ కలయికనూహిస్తూ
దిగులు తీరే రోజుకోసం నిరీక్షణాకాలాన్ని సహిస్తూ
పరిమళించి నవ్వే పున్నమిగా మారిపోతాం
ఆకాశమూ సంద్రమూ ఎప్పటికీ కలవలేవని తెలిసీ
బహుదూరపు చూపులతో బంధించి
వేకువ కాగానే కలల రెప్పలు విదిలించి
మరో రోజుకని సిద్ధమవుతాం..
తప్పదు..జీవితమంటే ఇంతే..మరేం లేదు..

No comments:
Post a Comment