Monday, 2 September 2019

//జీవితం..//


మనసుకి సరిపడా ఆనందాన్ని
తోడుకోవాలని ఆశించింది జీవితం..

మజిలీ అంటూ ఎరుగని
అనంత ప్రయాణంలో అలసి
సేదతీరే ప్రయత్నంలో ఓడిపోయినప్పుడు

అనుకోకుండా గుండె తేలికయ్యింది
అలివికాని అనురాగం చేయందించి
కొత్తమలుపు దారొకటి వేసింది

చిరునవ్వు వేయగల మంత్రం
చిట్టిపాపలోని అమాయకత్వం
గతజన్మలో విడిచేసిన
ప్రియమైన ఆలింగనం
విచ్చుకున్న వసంతం

అలుకలుపోయిన అవనిపై
గిలిగింతలు కురిపించిన వాన
నడిరాతిరి ఉక్కపోతని
ఆహ్లాదముగా మార్చిన సమీరం

చెలిమిలో కనుగొన్న సత్సంగం
తొలివలపులో చిలికిన రాగం

ఎదనెవరో నునుతట్టి పిలిచినట్టు
అనుభూతిమయమైన ఆథ్యాత్మికత
వెరసి
వర్తమానమో ప్రేమమయమైనట్టు
నమ్మకాన్ని మించిన నిజం సాక్షాత్కరించినట్టు
హృదయానికి పరిమళమబ్బింది 💜

 

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *