Monday, 2 September 2019

//నేను నీకు తెలుసా..//


నేను నీకు తెలుసా..

కన్నులు మూతబడ్డ క్షణాలప్పుడు ఆ నవ్వు
మునుపు మనకేదో పరిచయమున్నట్టు చెప్తుంది

ఇన్నాళ్ళూ మబ్బుల్లో దాగిన చినుకులా నీ ఆగమనం
ఆకాశం ఆపుకోలేని ఆర్తిలా నాపై దూకినట్టు
పూసలదండలో పువ్వుల పరిమళం

తపించిన జ్ఞాపకమేదో తొలిసారి కదిలొచ్చి
ఎదురుచూడని కొంటె కోయిల పాటగా
స్వరార్చన చేయమని పెదవులనడిగింది

ఎవరో నువ్వని ఆరాతీసిన మనసులో
మొదటిసారి మౌనం మాటేసిన విచిత్రం
నీకూ నాకూ వంతెన వేసిన కాలానికి తెలుసేమో

చెప్పూ..
రెండూ రెండూ నాలుగని అంతా అంటున్నది నిజమేనా
నీ ధ్యాసలో మత్తెక్కించిన నిన్నటిరాత్రి
నాలో ఏదో మార్పు తెచ్చిందంటావా..😊💜


No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *