Thursday, 5 April 2018

//Dare..//




hello..
Who s this?
Sorry Babes..
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా?
hmm..రేపు చెప్తా..తెల్లారే వచ్చేసెయ్ మన స్పాట్ కి
by the way..అతనికి పదిహేడు..ఆమెకీ పదిహేడే..

ఉషస్సు 4:30ని.లు
అరగంట నిరీక్షణలో అతను
ఇక్కడ మెల్లిగా తలుపులు తెరుచుకోవడం
మెల్లిగా Apartment మెట్లు దిగడం
నక్షత్రాలింకా మాయమవనూ లేదు
వేకువయ్యేందుకు వేళవనూ లేదు..
దగ్గరలోనే మంచుపొరల్లో మసగ్గా Playground.

పదినిముషాల పాటు loooong kiss..deep hug
చెప్పు
హే..మర్చిపోతే కదా నిన్ను
సరేలే..Mummy లేస్తుంది
c u in college..
కదిలిపోయింది ఆమె
కాలేజీలో స్నేహితుల గుసగుసలు
Instagram తెరిచిందామె
అతని Story line# Heyy dude, I won the challenge..
ఆ క్లిక్ చూడగానే అప్పుడు తిరిగిన కన్నీళ్ళు
ఆ కన్నుల్లో నిజమెంతో తెలీదు..:(

 

//ICU..//




కొంచెం ఏకాంతం కావాలి..నాకు నేను దూరమై చాలా కాలమంది మరి
'పురిటి వెలుగున బుగ్గపై నీ పంటినొక్కును కంటి రా'
'మోయలేని ఈ హాయిని మోయనీ ఒక్క క్షణం'
'కదిలే ఊహలకే కన్నులుంటే..'
ఛా
ఒకప్పుడా పాటలు వినేగా పెళ్ళంటే వెచ్చని మంటనుకుంది
నిజమే..ఇప్పుడు మంట బాగా ఎక్కువైంది
అందుకేగా 'Intensive Care 'అన్నది
24/7 అతని కనుసన్నలలో మెలగాలి
ఆ మాటల మంత్రదండం ఆదేశించినట్టు ఊగాలి
తన భావోద్వేగాలకు నృత్యించాలి
కారుతున్న కలలను ఎవ్వరూ చూడకుండా దాచాలి

ఒక్క పసుపుకొమ్ము కట్టిన బంధం కోసం
పాతికేళ్ళుగా నిత్యయుద్ధం
రోజూ ఓడిపోతున్నా గెలుస్తాననే ఆశ లేకున్నా
ఎందుకోసమో తెలీని యుద్ధం..
హాయిని మోసే క్షణాల మాట అటుంచి
ఆత్మ సంతృప్తి భారాన్ని నటించాలి
దిగుళ్ళు దాచుకోడానికి దిళ్ళున్నప్పుడు
అశాంతికి కొన్ని రంగులద్దితే సరిపోతుంది
వైరాగ్యం స్రవించిన ప్రతిసారీ
Selfpity తోనే తుడిచేసుకోవాలి.

Intensive care అంటే భద్రతనేగా
ఋతువు కాని ఋతువులల్లా ఏడ్చి ఏంటి ఉపయోగం
ఎన్నో కన్నీటిచుక్కలు గుండెల్లో ఇగిరిపోయాక
వ్యక్తిత్వం వేదాంతమని పెద్దపెద్ద మాటలకేం ప్రయోజనం
ముప్పావు జీవితం ముగిసిపోయాక
మళ్ళీ ఎందుకిలా..
జీవితంలో నాకో రోజు లేకపోయినా
అతని ప్రాణదాసిగా పండుగలన్నీ నావేగా
ఒకసారి చిరునామా కోల్పోయాక
అస్వతంత్ర జీవితాన్నే
భద్రతావలయమని భావించక తప్పలేదుగా..:(

 

//తరువు కథ//




ప్రాణం విలవిలలాడుతూ ఆ తరువు..
మునుపంతా హేమంతానికి ఒణికిన పచ్చని ఆకులు
ఋతువు రంగు మారగానే
శిధిలమై రాలేందుకు సిద్ధపడ్డవి

వేసవిగాలి కాసింత సోకగానే
ఆశలు కోల్పోయిన గీతికలై నేలజారాయి
అశ్రువులెండిన తరువు మోడై
శిశిరమంతా చింతలను వంత పాడింది

ముందే కూసే కోయిలలు కొన్ని
సంకేతాల జావళీలతో
స్వప్నాలు ఎగురగొట్టాక
వసంతమో అపర సౌందర్యమై విచ్చేసింది

కాలపు పరిష్వంగంలో
అనుభూతులు తడిమి చూసుకున్న తరువుకప్పుడు
లేత గులాబీ రంగు ఆకులు మొలకెత్తడం తెలిసింది
పచ్చదనానికై నిరీక్షణ నిశ్శబ్దపు పరిభాషలో మొదలైంది

ఇప్పుడు తూరుపు లేపే కన్నా ముందే
ఎదుగుతున్న ఆకులను తడిమేందుకు
తరువుకు తొందర..
విచ్చుకున్న వేకువప్రభలోని పులకింతను
ఊహల తెమ్మరకు అంటుకట్టాలని..:) 


//నిన్ను చూడాలని..//



నా కన్నుల్లో ప్రతిబింబాలుగా మిగుల్చుకున్న నీ నవ్వులు
కుంకుమపువ్వులై వేకువకు సాంత్వనయ్యాయి
సడిలేని కలల గుసగుసలేవో నిదుర చాలని రేయి ముగింపులో
నిన్ను దాచిన రెప్పల మాటు దాగుడుమూతలై ఊహలాడాయి

మదిలో ఇమడలేని వాక్యాలు జ్ఞాపకాల్ని చిలుకుతూ
బరువెక్కిన అనుభూతుల్ని కాగితానికివ్వమన్నాయి
తెరలుతెరలుగా తచ్చాడుతున్న వసంతగాలికి
నేపథ్యమైన సంగీతాన్ని కవిత్వీకరించానందుకే
కొన్ని క్షణాల కేరింతల్లో నిన్ను మనసంతా నింపుకున్నానని
కొన్ని మౌనాల ఓదార్పుల్లో నా భావం నువ్వయ్యావని..

ఇప్పుడిప్పుడే వెచ్చబడుతున్న అనురాగం
ఆకాశమై దేహాన్ని కౌగిలించింది
నిన్ను చూడాలనుకున్న ఆర్తిలా తీరిపోయింది
మన కథను గానం చేసి అలసిపోయిన సాక్షిగా..!!

Pic Courtesy : Moshe Dayan ji


//నిశ్శబ్దం నవ్విన సమయం..//





"ఎదలో వెన్నెల..వెలిగే కన్నులా.."
అపరిమితమైన జ్ఞాపకాలు వెల్లువైన వేళ
అంత'రంగస్థల'మంతా నీదేగా ఏకఛత్రాధిపత్యం

గోధూళి పరిమళిస్తున్న తీయదనమేదో
ఏకాంతం కమ్ముకున్నంత మేరా
వలపు రాగరంజితమవుతుంటే
ఈ నిశ్శబ్దానికి సరిపడా మౌనాన్ని నేనాలకిస్తున్నా

హద్దులేని కలలెన్ని దాచుకున్నందుకో కనులు
వెచ్చని ధారలనాపుకుంటూ
మధురక్షణాల మాలను మనోభావాలుగా మార్చాయి

నన్ను చూసి నువ్వు నవ్విన ఆనవాలేదీ లేకపోయినా
ఆ చందమామ కురిపిస్తున్న ఇంద్రజాలం
నీ అనురాగపు కలనేతగా నన్నల్లుకుంది
ఇప్పుడు నిశ్శబ్దంలో నాకు నచ్చిన రాగం..
ఊహల మోహనంలో మనది 'ఏకతాళం'..:)

//నిదురే కల అయినదీ..//



ఎప్పుడంటే అప్పుడు
నువ్వు వెన్నెల్లో తడవాలనుందన్నప్పుడల్లా
నన్ను నీ సమక్షానికి రమ్మనడం
ఆవాహనం చేసుకున్న ఆనందాన్నంతా
ముద్దులుగా నాకు పంచడం
నీ చేతులతో నన్నంతా కప్పడం
ఎన్నిసార్లు వీడ్కోలిచ్చినా మళ్ళీ కలిసేందుకేగా
అన్నట్టు నీ అనునయం..

ఓహ్..
క్షణక్షణం కొట్టుకొనే గుండెకు తెలుసు
యుగాల బరువు మోసే కాలపు సంఘర్షణ అదేంటో..
కన్నీళ్ళతో కడిగేందుకు జ్ఞాపకమైతే కావుగా..
మౌనపు మునిమాపులో నా విరహతాపం
పగలు చూడని రేయిలో నన్నుండమన్నప్పుడు..
కంటున్న గుప్పెడు కలలు నిజం కాకపోయినా
నా ఏకాంతం.. నీలోనికే ప్రయాణం
ఊపిరి తీసేందుకు నీ పరిమళాన్ని పీల్చుకుంటూ
కనురెప్పల మాటు నీ చిరునవ్వులు వెతుక్కుంటూ..!!

 

విళంబి ...


మిత్రులందరికీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు..:)

చిరునవ్వు సంగీతమయ్యే వేకువ
కోయిల కుహూలు పాడే జాతర
ఆశలకు రెక్కలు మొలిచే నేడిలా
వసంతం కాక ఈ సంబరం ఏంటిలా..

మావిచిగురు పచ్చివాసన కమ్మగా
వేపపూల చేదు అందం తియ్యగా
పచ్చికొబ్బరి లేతదనం మెత్తగా
ఉగాది కాక ఈ పండుగ ఏంటిటా..

ఆకాశం తొంగిచూసే ఆనందం
ఆత్మలొకటై సంగమించే సముద్రం
మనకోసం నలుగురున్నారనే విశ్వాసం
మేలిముద్దు కాక ఈ తొలిపొద్దు ఎందుకటా..

వేదనదిని దాటించే ఉత్సాహమనే నావ
నీకు నువ్వుగా మేలుకొమ్మనే మనసు కువకువ
కలలను గెలుచుకొమ్మనే బంగారు తోవ
కొత్తవత్సరమై రంగురంగుల ప్రేమనద్దింది అందుకేగా..:)

 

// Miss U..//



నా ఏకాంతంలో నీ జ్ఞాపకాలు ఇంద్రధనసులై
చిలిపి సందేశాలుగా నాకందినప్పుడు
నీ మౌనం కదులుతున్న గాలిలో చేరి పువ్వులను తాకి
నా పెదవంచున తీయగా పలుకుతుంది
మాటలు కరువైన సాయింత్రం
నీకు నచ్చిన పాటనే పదే పదే పాడుకున్నా

నువ్వో పులకరింతవై ప్రవహిస్తున్న ఊహ
వెచ్చని అనుభవమై నాకందినట్టు
నేనూహించలేని కొన్ని క్షణాలు..వెలుగునీడల కావ్యాల తోడు
మనసునూగించి వెన్నెల తీరాలకు చేర్చుతాయి

ఎన్ని రాత్రులిలా కదిలిపోతున్నా
నా కంటిచివర మోయలేని విషాదం
మెత్తగా నా కాటుకల్లోనే ఇంకిపోతుంది
నేనెంత అల్లాడుతూ ఆలపిస్తున్నా
నా పాట నువ్వింటావన్న ఆశ లేదిప్పుడు
ఊపిరికందనంత దూరంలో నీ అడుగులు దూరమైనందుకు..:(
It Hurts Not Having You Close,
But it Would Hurt Even More Not Having U At All

 

//విరహపు కల..//



ఎదురు చూడటం ఇష్టంగా మారి కొన్ని ఊహల్లో తప్పిపోవడం తెలిసాక కలుసుకోవాలన్న ఆరాటం మెత్తగా కరిగిపోవడం నిజం
నీ సమక్షంలో క్షణాలు సీతాకోకలై ఎగిరిపోతాయన్న దిగులు, నా ఏకాంతంలో మౌనారాధనకు వ్యతిరేకమయ్యింది నేడు..
కదులుతున్న కాలం ప్రతి అడుగులో జ్ఞాపకాలు కలబోసుకుంటున్నప్పుడు అనుభవాల తాకిడిలో ఆనందపు హోరు
కాటుక కళ్ళతో మంత్రించే చిరునవ్వుల బాణాలు ఇప్పటికీ గుచ్చుతున్నాయని నువ్వాడిన హృదయపు హేల ఎప్పటికీ అంతమయ్యేది కాదు
గమ్యంలేని ఆకాశంగా నిన్ను పరుచుకున్నాక
నా అక్షరాలన్నీ మెరిసే నక్షత్రాలకి సమానమేగా.. 


//జీవితమంటే ఇంతే..//





గడిచిపోయిన క్షణాలలో ఆ కాసిని జ్ఞాపకాలని
మనసంతా నింపుకు మరీ అనుభూతిగా మార్చుకొని
కుదిరినప్పుడల్లా నెమరేసుకుంటుంటాం..
కలలు నిజమవుతాయని ఊహలకు చిగురు తొడగొచ్చనీ
ప్రతి ఉదయమో ఉత్సాహాన్ని పులుముకుంటాం
ఏ చీకటికీ భయపడే అవసరం లేదని
మునిమాపుల నీడలతో చెలిమి చేసి హాయిగా మురిసిపోతాం

దూరానుంటూ కలయికనూహిస్తూ
దిగులు తీరే రోజుకోసం నిరీక్షణాకాలాన్ని సహిస్తూ
పరిమళించి నవ్వే పున్నమిగా మారిపోతాం
ఆకాశమూ సంద్రమూ ఎప్పటికీ కలవలేవని తెలిసీ
బహుదూరపు చూపులతో బంధించి
వేకువ కాగానే కలల రెప్పలు విదిలించి
మరో రోజుకని సిద్ధమవుతాం..
తప్పదు..జీవితమంటే ఇంతే..మరేం లేదు..:)

//ఆనందో..ప్రేమ..//




ఎన్ని యుగాల నాటి విరహమో
ఎంత అలవికాని భావమో
అంతరంగంలో అనుభవమై పరిమళించినప్పుడు
నా మనసు విశాలమవుతుంది
సితారను చేసి నువ్వు మీటిన తనువు
కలస్వనాన్ని మించిన స్వరమైనప్పుడు
నీ నవ్వుల లేతవెన్నెల
నిశీధిని వెలిగించే పసిడి లాంతర
విషాదంలో ఆనందాన్ని కుమ్మరించు జాజర

ఎన్ని కలలు కాలాన్ని కరిగించాయో
మరెన్ని రాత్రులు వెచ్చగా కంపించాయో
లెక్కలకందని ఆరాలతో అలసిపోలేను
ఆకుచాటు మల్లెగా నా మనసులో నువ్వుండ
గాలి అలల మాటుగా పరవశాలు ఆనందమయ ప్రేమేగా..:)

 

//ఓడిపోయా..//




స్రవించిన అనురాగమంతా
ఏ కాలువలో కొట్టుకుపోయిందో
నే కురిపించిన ప్రేమంతా ఏ మన్నులో కలిసిపోయిందో
వేయి భావాలతో నిన్ను పులకించి రాసినా
నా ఉనికి నీ ఏకాంతానికైనా ఆనదు
రోజుకో దారిలో సంచరించే నీకు
నీ ఎదురుచూపుల దిగులు గుమ్మానికానుకున్న నేను కనపడను

నిన్ను జయించాలనుకున్నప్పుడలా నన్ను నేను కోల్పోతూ
నిర్లిప్తమైన ఆక్రందనై నేనోడిపోయా
శిలలు సైతం కల కనగలిగే రాతిరిలో
మరపురాని విషాదం నన్ను మోహరిస్తుంది చూడు
మనసు చంపుకు బ్రతుకుతున్నప్పుడు ప్రాణమున్నా అది రాయికి సమానం కదా
కొన్ని సశేషమైన రాతల్లో నిన్నుంచలేను
కానీ
కాలం సమాధానమివ్వలేని శిశిరంలో రాలిపోయేందుకు నాకు నేనుగా సిద్ధమవగలను..:(

 

//మన కథ//




చందమామ కథలు చదువుతూ నిద్రపోయే నీకు
వెన్నెలమ్మలా పక్కనున్నా నేను గుర్తుకు రాను
ఎన్ని హేమంతాలు చురుక్కుమనిపించినా
కలను వీడి వాస్తవంలోనికి రావు

నీకూ నాకూ తెలిసిన రహస్యాలు కొన్నే అయినా
నువ్వెతికే దారుల్లో
నా కదలికలిప్పుడు నిశ్చలం
ఒక అసంపూర్ణ వాక్యం దగ్గర
నువ్వు నిశ్శబ్దాన్నిపెనవేశావంటే
నా కలవరం నిన్ను మీటలేదని అర్ధం

గడచిన జీవితం స్మృతుల్లోకి జారిపోయినా
ఇంకా అర్ధం కావాల్సింది మిగులున్నట్టు
అంతరాత్మను విననట్టు తప్పించుకుపోతున్నా అందుకే..!!

 

//మధురస్వప్నం..//




అ: అలకనందలా ఎన్ని ఒయారాలో నీ ఒంపుల్లో
ఆ: ఆరాధనకేం తక్కువ లేదులే నీ కన్నుల్లో
అ: అధరాలలో అమృతమంత దాచావెందుకో
ఆ: అలవికాని అనుభూతి తీపెక్కిన తరుణమనేమో
అ: కౌగిలికి రమ్మంటే కవిత్వం చెప్తావెందుకు
ఆ: కవ్వించొద్దని నేనంటే కత్తులు దూస్తావెందుకు
అ: నీలో పరవశాలు పుట్టేందుకేం చేయాలో నేను
ఆ: నాలో పూలవానలు మొదలయ్యాయేమో చూడు

క్షణాలంత మత్తుగా కదులుతున్నప్పుడు తెలిసింది..
మధురజ్ఞాపకం నేత్రాంచలాల నీతిచుక్కై మెరిసిందని..!!

 

"కవితత్వాలు"


//ప్రేమా..ప్రేమ..//




ఊసులు కోరే వయసు..ఊహలు నేసే మనసు
మనోరధంలో విహరించే
మనోజ్ఞ సీమే ప్రేమ..
జీవించేందుకు మానసిక అవసరం ప్రేమ
పెదవులపై నిష్కారణపు నవ్వై కన్నుల్లో కాంతులు కొలువై
మనసంతా సందడి చేసే పండగ ప్రేమ
కోటి కల్పనల దోబూచులాట ప్రేమ
నిశ్శబ్దానికి పరిమళమంటించగల గులాబీ తోట ప్రేమ
నేల మీదకి జాబిల్లిని రప్పించగల ప్రేమ
కలలకు జలతారు కుచ్చులేసే బంధం ప్రేమ
బుగ్గలపై నవనీతపు ముద్దుల ప్రేమ
శీతాకాలపు సాయంకాలం నులివెచ్చని కౌగిలి ప్రేమ
నా గుండెపై దండలా కదిలే ప్రేమ
మధురలాలసల మృదు రవళి ప్రేమ
మాటల కందని హాయిరాగం ప్రేమ
రూపెత్తే రసానందపు సురద్వారం ప్రేమ..:)

 

//సంధ్యారాగం//



మనసప్పగించి చూసిన చూపుకేమో
ఎన్ని మోదుగుపూలద్దుకున్నవో మోములో
అంతకంతకీ విస్తరుస్తున్న పరవశం
సతమతమైన ప్రకంపనాల సంగీతం
అప్పుడెప్పుడో కలలో కలిగిన పులకింత
ఇప్పుడు నీ ఎదురుగా

వెన్నెల చల్లదనానికి సమానమైన ఆ కళ్ళు
నిదురను మాయం చేసి రాతిరిని రాగమయం చేయగల సందళ్ళు
నిత్యమై నిఖిలమై నువు నాకుంటే చాలు
తేనె రంగు సొగసిలా పరిమళిస్తూనే ఉంటుందన్నట్టు
ఇప్పుడీ సంధ్యకీ అస్తమించాలని లేనట్టుంది
మన మధ్య ప్రేమబంధానికిలా మెరుపులద్దుతూ..


//ఈ రేయి తీయనిది..//




నేను నువ్వయి చాలా కాలమైంది
ఊహలో కాస్త చోటిచ్చీ ఇవ్వగానే
మనసంతా కలదిరిగేస్తూ కవ్వించావు
ఆపై కూర్చుంటూ..నించుంటూ
అంతా నీ ఇష్టం
అవును..అనుభవం నాది..అల్లరి నీది
కాదంటానా..
ఎప్పుడూ నీతో కలిసుండాలనే చిన్ని చిన్ని ఆశ
ఓ క్షణం నీతో బ్రతికినా చాలనిపించే ఆశ
ఎవ్వరు నేనో ఒంటరి పక్షినని గుర్తించి
రమ్మని పిలిచినా మనసు తలుపులేసేస్తాను

అమలిన బంధమై నాలో వెలిగే వెన్నెల
నీ సమస్తాన్ని నాలో నింపుకున్న మౌనం
కలలకు వేళయ్యింది రమ్మని పిలుస్తుంది చూడు..
నీకు ప్రేమను పంచేందుకు
ఇప్పుడీ అనుభూతి సాంత్వనవుతుంది
కొంతకాలం 'కాలం' ఆగిపోతుంది
అప్పుడు నువ్వో విశ్వమై నన్ను చేరదీస్తావు..:)

 

//కాలమాగిపోయేలోగా..//




ప్రాణ విహంగం ఎగిరిపోతున్నట్లనిపించినందుకేమో
దూరాన్నెక్కడో గుడిగంటల శబ్దమయ్యి
బరువెక్కిన మనసు కాస్త తేలికయ్యింది

గుండెల్లో హోరుమంటున్న జ్ఞాపకాలు ఒక్కోటి
కదులుతూ తరలిపోతున్నాయి
బాల్యం నుండీ యవ్వనంలోకి పయనించిన రోజులు
వాస్తవం నుండీ అనుభవంలోకి మారిన జీవిత దశలు
ఆలోచనలో ఉండగానే స్పర్శ కోల్పోతున్న భావన

ఎంత ప్రేమగా పోషించుకున్న శరీరం
ఎంత ఉత్సాహాన్ని నింపుకున్న జీవనం
ఎంత అస్తిత్వాన్ని మోసుకు తిరిగిన చైతన్యం
అయినా సరే..పిలుపందినప్పుడు అనంతంలోనికి పయనమాగదు
ఏదీ శాశ్వతం కాదని తెలిసినప్పుడు
ఊపిరి సైతం నెమ్మదిస్తుందప్పుడు
తప్పించుకోలేని యాతన మొదలైనప్పుడు
ఆ పరివేదన అనుభవించక తప్పదు
అందుకే కాలమాగిపోయేలోపు
ఒక్క వాక్యంలోనైనా చేరాలన్న ఆశలు
ఒక్క పదముగానైనా పరిమళించాలన్న కలలిప్పుడు..!!

 

//మాఘమాస వెన్నెల..//



వెన్నెల కిరణాలు జారిపడినప్పుడల్లా
జ్వలిస్తుంది మనసు
వేల తారలు నవ్వుతున్న పున్నమినాడు
గగనాన్ని చూడాలి
ఎదలో నిశ్శబ్దాన్ని చెదరగొట్టేలా వేల భావాలు రొద పెడుతుంటాయి
దైవత్వమేదో సిద్ధించాలన్నట్లు చెట్ట్లు
పరవశంలో తడుస్తుంటాయి
పాట పాడుతున్నట్లు ఊగే గాలి
సన్నగా హాయిని రేకెత్తిస్తుంది
"ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ.."
ఈ క్షణాలకు రెక్కలొస్తే చెప్పాలనిపిస్తుంది..

మాఘమాసపు వెన్నెల గీతికలో ఈ రేయి
మంచు తానాల మానస సరోవరానికి సమానమయ్యాక
గ్రహణం వీడిన జాబిలి హొయలు చూడాలనిపిస్తుంది
ఒక కవితనల్లేందుకు సాయం రమ్మని ఆత్మను చిలుకుతున్న వేళ
స్వప్నాలనాపమని కన్నులను వేడుకోవాలనిపిస్తుంది
వెలుగునీడల ఆనందవిషాదాలు తెరచాపలైనప్పుడు
రంగురంగుల పువ్వులన్నీ నా నేస్తాలిప్పుడు.. 


//తొలిసంజ//




రంగులన్నింటినీ మింగేయాలని చూసే మంచు
వేకువ ధూపంలా ప్రకృతిని పరచుకుంది.
గుండె తంత్రుల్లో మొదలైన భూపాల రాగం
గువ్వల గొంతుల సంగీతానికి తోడయ్యింది
అలలపై నాట్యామాడే పూల సొగసు
తేనెలో తానమాడేందుకు రమ్మని తుమ్మెదను పిలిచింది
కోటి తలపులు పాటగా మొదలైన సమయాన
రసోదయపు శ్వాస గమకం ప్రాణానికో ప్రణవం
కలలో తాపం ఎదలో తీరగా
కంటి కాటుకలో సిగ్గుల రంగేళి
కనుపాప తెర మీద కమలమై విరిసింది
శిశిరమైతేనేమి..
ఈ ఉదయమెంతో బాగుంది..:)
Pic Courtesy: Moshe Dayan ji

 

//మోహితనే..//



అప్పుడే శిశిరం వచ్చి వారమైపోయింది
వేసవిగాలి తడమకుండానే ఆకులు రాలిపోతున్నాయి
అయినా ఎప్పటిలానే అదో మౌనం
అలలా కదిలే జ్ఞాపకాల చప్పుళ్ళకు కాబోలు
ఆ పాతరాగమే దగ్గరగా వినిపిస్తుంది

మనసు మడతలు విప్పే కొద్దీ
కలలో కూసే కోయిల కుహూ పాటలు
సలపరాన్ని పెంచే సంపెంగి వాసనలు

ఏమో..
వసంతానికి తొందరపడ్డం మానేయాలి
కలయిక కన్నా కలవరించడం బాగుందనుకున్నప్పుడు
వెన్నెల్లో దాచుకున్న కాసిన నవ్వులూ
తలపుల్లో కన్నీరుగా కొట్టుకుపోకమునుపే
స్మృతులకు స్వస్తి చెప్పాలిప్పుడు
విషాదం దహించేలోపు
జీవితానికి నవకాలు నేర్పాలిప్పుడు..💜💞 


//Ecstasy..//



కాసేపలా ఉండాలనుంది
ఏకాంతం తారసిల్లిందేమో..సుగంధం చుట్టుముట్టినట్టుంది
నేనూహలో ఉన్నంతసేపూ అదే Ecstasy
నా చుట్టూ మొగలిపూలున్నట్టు
నీ సందిట సంపెంగలు లేవూ..:)

ఆ చిలిపి కన్నుల్లో నవ్వులు.. నన్ను మౌనంలోకి నెట్టిన చూపులు
అదేదో ఆకర్షణలో దూదిపింజెలా మనసప్పుడు
చిరుగాలి పలకరింపులా ఆప్తమై
అలౌకిక ఆనందమే అస్తిత్వమై
వెయ్యేళ్ళుగా అనుసరిస్తున్న నమ్మకమే నువ్విప్పుడు

హృదయంలో రసపూర్ణిమ ఉదయిస్తే
వెన్నెల వానలో తడవకుండా ఆగలేం కదా
ఇప్పుడు కంటున్న నీలికలలో కెమిలియాలు
నిన్ను రాసే కవిత్వంలో
తమకో పోలికనివ్వమంటున్న తరుణంలో
నీ పైన అనురాగం అంతరిక్షాన్ని తాకింది
నాతో నువ్వుంతసేపూ నిశ్శబ్దమందుకే నవ్వుకుంటుంది..


//మౌనవీణ గానం..//




మొన్న కూర్చిన స్వరానికిప్పుడో లయ కుదిరింది
రాగం మొదలైన మధుర థ్వని
పదనిసలొలుకుతూ మనసంతా ఊగింది
అణువణువూ పరవశమై రేగే పరిమళాల భాష్యాలకు
ఊపిరిలో వెచ్చదనం నిండింది
అధరాల పగడపు రంగు బుగ్గలకు పాకింది
ఆత్మానందపు అన్వేషణలో
కొన్ని క్షణాల మౌనవసంతం
ప్రేమఋతువుకదో నవలోకం
నరనరాన ఉప్పొంగు సంతోషం
ఊదారంగు పువ్వుల్లో
రహస్యంగా దాచుకున్న ప్రియానుభావం
నీ కౌగిలి వెన్నెల్లో తడిచిన సంగతి
వేకువ దుప్పటిలో ఆవిర్లు నిండిన అనుభూతి
ఊహల తన్మయత్వమిప్పుడు మత్తుగా సోలిన భావుకత్వపు లాలితం..:)

 

//ఎవరో..//




నిశ్శబ్దం..
తెలీకుండానే మొదలయ్యింది
సెలయేటి పాటకు తుళ్ళిపడే ఎద
కోయిలమ్మకు బదులిచ్చే స్వర
అక్షరాలతో అలికిడయ్యే కల
మిన్నంటి ఎగిసిపడే అల..
అన్నీ కలగలిసిన నేనిప్పుడు మౌనాన్ని మోస్తున్నానా..?!

నిజానికి నేను మాటల్ని ప్రేమిస్తాను
వేలభావాల్ని చేరేసే పదముల్లో
విషాదాన్ని సముదాయించి
అనుభూతుల సువాసన మాత్రమే పంచాలనుకుంటా
గుండెగదిలో నిండిన చీకటి
శూన్యాన్ని తొలుచుకుందేమో..
ఇప్పుడు కదులుతున్న శబ్దాలకి అస్తిత్వం లోపించింది
మనోగతాన్ని చదవాని చూపుని సరిచేసినప్పుడల్లా
నల్లని సీతాకోకలై నా ఊహలెటో ఎగిరిపోతున్నాయి
వెన్నెల ఉదయించడం తెలియట్లేదిప్పుడు
ప్రసరించాలనుకున్న కిరణాలు పొరిమేరల్లోనే ఆపిందెవరో మరి..:( 

 

//హేమంతం..//





రాదారిని కప్పేసిన మంచుతెరల ఉదయాలు
మబ్బుకళ్ళను తెరవనివ్వని మనసు మారాలు
వెన్నెల వానలో తడుస్తూనే ఉండమనే కలలు
ఆహా..హేమంతమంటేనే గుండెకి వెచ్చదనాలు
మెత్తగా కొన్ని రాగాలలా ఊపిరిలో చేరుకున్నాక
నిద్దురలోనే నోరారా నవ్వుకుంటుందో ఆర్తి..

వేకువపాట కచ్చేరిలో పచ్చని గాలి పరిమళం
స్వర్గలోకపు అనుభూతితో ఉక్కిరిబిక్కిరయ్యే ఆనందం
రంగురంగుల నెమలీకలై చూటూ నాట్యమాడినట్టు
అవును..హేమంతమెప్పుడూ అద్భుతమే
రసడోలలూగే తపన స్వరముగా పల్లవించాక
ఎదలో కలస్వనం చికిలింతపువ్వుల మధువుకి సమానం..💞  

 

//ఎదురుచూపు//


ఈ ఎదురుచూపుల ఆరాటంలో
హేమంత వెన్నెల చల్లగా చంపుతుంటే
పూలబాసలను ఆలకిస్తూ
చిన్న అలికిడికే ఆత్రమవుతున్నా..
నీ అడుగులలయలో నా హృదయనాదాన్ని కలిపి
ఈ రేయి వలపు వశం తప్పాలని
చకోరినేనై నేత్రాంచలాల
గుబులు దాచుకుంటున్నా..
నువ్వొస్తే ప్రాణం వస్తుందని..:)

 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *