Sunday, 16 December 2018

//చివరకు మిగిలేది..//



సమస్తం నిశ్శబ్దమై
మనసు సంచలం ఆగినప్పుడు
అందమైన అనుభూతులేవీ ఆవరించవు
క్షణాలు దొర్లుతున్నప్పుడు
చీకటి బుసకొట్టే సవ్వడి
ఆలకించేలోపు
పొంచి ఉన్న మృత్యువు అదే అదనుగా కాటేస్తుంది
అలమటిస్తున్న ఆత్మ
విషాదాన్ని విడిచి
విహంగమై స్వేచ్ఛాకాశంలో ఎగిరిపోతుంది..

అనుకుంటాం కానీ..
చెల్లని రూపాయికి సమానమవుతుంది అస్తిత్వం ఒకప్పుడు
పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలియని అభిమానాలలో..
అందుకే..
ముగింపదే జీవితానికి..
అలవోకగా బంధాలు ఆవిరయ్యేందుకు..


//సంగీతం..//



ఏ కవనమైతేనేం..
ఓ భావగీతం..
మనసాలపించే మంజుల నాదం..
ఏ భాషదైతేనేం..
ఓ ఆలోచనాపుష్పం
అనుభూతినందించు హృది పారవశ్యం
ఏ రీతినైతేనేం..
ఓ జీవన ప్రవాహం..
రాగరంజితమవు సుధామధురం..

ఎన్ని బాణీలు కట్టానో..
అలతి పదాలకి
ఎంత చీకటిని అనుభవించానో
కాస్త వెలుతురు కోసమని..
నువ్వు లేకుంటే ఏమయ్యేదో
భావుకత్వమంతా నీరవమై మిగిలేదో
జీవితమే శూన్యమైపోయేదో
ఆనందం బ్రహ్మత్వమై..ఆత్మలో మమేకమై
వెన్నులోకి తన్మయత్వం జారిందంటే
అది నీవల్లనే..
ఓ సంగీతమా..
నేనో ఒంటరిని కానని నిరంతరం నాలో ప్రవహిస్తూ
విషాదంలోనూ విరాగం ఉందంటూ
మాయని గాయానికి ఓదార్పు చిరునామా నువ్వు..
యుగాలనాటి గుండెసడికి నేస్తానివి నువ్వు..


// సౌందర్యం //

మనోగతం మంచుగాడ్పును మోసుకుపోతున్నప్పుడు
సమాధి అయిన విశ్వాసం
ఉనికి పట్టని దర్పణంలో
బలహీనమైన సౌందర్యం

ఆకులు రాలిన శిశిరం
నిర్జీవమైందని నిరాశించేలోపు
ఓ వసంతపు కేరింత
పచ్చగా ఆవరించడం అబద్దం కానట్టు
ఘనీభవించిన నిశ్శబ్దం
ఓనాటికి గలగలమని నవ్వకపోదు

అనంతంగా రాలే విషాదం
హృదయపు దారుల్ని తడిపిపోయాక
ఆపైన ఓ చిత్రమైన వాసన
అసంకల్పితంగా ఆకర్షిస్తుంది

కొన్ని కథలు అక్కడ మొదలవుతాయ్
మూగబోయిన జీవితంలో
స్వరాలు తరంగమై సంగీతమైనట్టు..💞


Saturday, 15 December 2018

//ఒక మనసులో..//



ఎందుకో కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు
ఎన్నిసార్లు మనసు తరచి చూసుకున్నా
"నిన్నెందుకు మరచిపోలేదా!" అని

ప్రత్యుషం పలకరించు తేనెపాటల్లో
నీ ఊసులు కలగలసిన
మైమరపు నన్నొదలనందుకేమో
తొలిజాము కలలలో
వెన్నెలచారల వింతకాంతి
నీ రూపుదేనని ఊహించినందుకేమో

ఒక ఏకాంత తన్మయానుభవం
నాలో నువ్వున్న రహస్యం
నీకెప్పటికీ చెప్పకుండా ఉండాల్సింది
ఆశలు రాలే క్షణాలు
కన్నుల్లో ఉపనదులై ఊరతాయని
ఎప్పుడో గ్రహించాల్సింది

తామరాకు మీద నిలిచే నీటిబొట్టులా
నేనెప్పటికీ ఒంటరినేననే
విలువైన సత్యాన్ని ఒప్పుకోవలసింది
వలపు నిశ్శబ్దంలో
నేనెంతా శోకించినా నా మౌనాలాపన
నీకు నివేదించకుండా ఉండాల్సింది

రంగురంగుల పువ్వులోని మకరందం
కోటానుకోట్ల నక్షత్రాల్లోని వెచ్చదనం
రాసే అక్షరాల్లోని నా హృదయం
నీపై కుమ్మరించకుండా ఆగాల్సింది

ప్చ్..ఇప్పుడైతే
కాలం తిరిగే మలుపుల్లో
మన అరచేతులు కలిసున్నంత కాలం
మనం విడిపోలేమన్న నిజం
ఒక వసంతమై విరబూసినట్టనిపిస్తుంది..!!


//అశాంతి..//



ఉండటం..ఉండకపోవడం
ఇంతేనా జీవితం
వేదన తప్ప భావన మిగల్లేదంటే
హృదయం వర్షిస్తున్నట్లేగా
కోల్పోయినప్పుడల్లా గతంలో వెతుక్కోవడం
ఏమార్చిన క్షణాల్లోకి
గడియారాన్ని వెనక్కి తిప్పుకొని మరీ వెక్కిళ్ళు తెచ్చుకోవడం..

చేయి పట్టుకు నడిపించేది ఆశే అయితే
అది దుఃఖం వైపు అడుగులేస్తుంది నిజమే
అప్పట్లో మెరిసిన చిరునవ్వు
ఇప్పుడు ఉప్పగా ఊరుతోంది కన్నుల్లో
వెచ్చగా రాసుకున్న మనసు నీకు చడవడం రానప్పుడు
గుండెను ఖాళీ చేసుకునేం లాభం
ఏ ఒక్క రాగమూ నువ్వు వినలేనప్పుడు
ఎన్ని సంగతులు పాడినా ఏంటి విశేషం

శూన్యానికి పరిభాష నిశ్శబ్దమని
గ్రహించగలిగేది కొందరే
మనిషి బ్రతికుండగా చేతలతో చంపగలిగేవాళ్ళు కొందరే
ఆ కొందరిలో నువ్వుండటం
ఇక నిష్క్రమించమని నేనందుకున్న సంకేతం..


// బాల్యం //


Baby Shark DooDoo DooDoo Doo..
మళ్ళీ బాల్యంలోనికి పరుగెత్తాలనుంది
ఇంద్రజాలమై కదిలే కాలాన్ని వెనక్కి తిప్పాలనుంది
చాక్లెట్లు పూసే చెట్లను కలగన్నట్టు
కన్నుల్లో అంతమవని వింత కుతూహలం
పేరు తెలియని పువ్వుల పరిమళాన్ని తాగినట్టు
ఎప్పుడూ పెదవుల్లో నవ్వు తెరలై కదిలే ఉత్సాహం
చేతులు చాస్తే ఇమిడిపోయేంత సంతోషం
రేపటి గురించి దిగులన్నది లేని సంబరం
మనసో నీలివెన్నెల కురిసే ఉద్యానవనం అప్పుడు..😊

కొలతలకందని దూరాలు నడిచొచ్చేశాక
అదో మధురస్వప్నం
నిన్నటి ఊపిరిని ప్రస్తుతంలోకి పొదుపుకోవాలనే
తాపత్రయం
చీకట్లో అంతుపట్టని నిశ్శబ్దంలా
బాల్యమో అస్పష్ట మాధుర్యం ఇప్పుడు..💜

//ఏకాంతం//



మౌనం మాటయ్యే సమయంలో
హృదయంలో విరిసే చిరునవ్వు
చూపుల్లో మెరుపుని సంధించినట్టయి
తెరిపిలేని సంతోషమొకటి
సుస్వరమై పెదాలను తాకుతుంది..

బుగ్గలపై అందుకోబోయే తొలిముద్దు ఊహకి
రెక్కలొచ్చి
ఆకాశయానం చేసినప్పుడు
ఓ సరికొత్త పులకరింత
చందమామను చుట్టొచ్చినట్టు అనిపిస్తుంది..

కొన్ని రాత్రులిలా రాగాల్ని మేళవించుకుంటాయేమో
వెన్నెల కిరణాల్లో తడిచేందుకు రమ్మని
మలయసమీరంతో కబురెడతాయి..
మధురించే గుసగుసలతో ఏకాంతాన్ని కావ్యం చేద్దామంటూ.. 


// అనంతమైన విషాదం //


అనంతమైన విషాదంలో ఓ ఎదురుచూపు
కాస్త ఆనందమైనా దోసిట్లో ఒలక్కపోతుందాని
రాసుకున్న పదాలేవీ వాక్యంలో ఇమడనప్పుడు
నిశ్శబ్దం నిజాలు చెప్తున్నట్లనిపిస్తుంది
ఏమో..
కలలన్నీ కన్నీటిలో కరిగిపోతున్నా
కాలమలా యధాలాపంగా కదులుతూనే ఉంటుంది
నిద్దురపొద్దుల్లో రెప్పలగోడల మాటు
ఊగుతున్న నీడల్లో వెలుతురుకైన వెతుకులాట అలానే ఉంటుంది
అయినా
శాశ్వతమైనదేముందీ లోకంలో
ఈనాటి అనుభూతి రేపటికో అనుభవమైపోతుంటే..
కొత్తగా నిర్వచించేదేముంది గాయాన్ని
గుండె బేలగా ప్రాణయాతనలో కొట్టుకు పోతుంటే..

 

//శరత్వెన్నెల..//



నీలో అనురాగం పెదవులపై నవ్వుగా ఎదురొచ్చినప్పుడు
నన్నార్తిగా అల్లుకొనే ఆనందానికి ఆకాశం సరిపోదు
అసలీరోజు శరత్పున్నిమని గుర్తే లేదు
నీ కన్నుల్లో వెలుగు నన్ను వెచ్చబెట్టనంతవరకూ
ఈ వెండివెన్నెల్లో
చిరుగాలి నేపథ్య సంగీతం
మధురానుభూతులను పెనవేసుకొమ్మనేగా సంకేతం
ముంచుకొస్తున్న మోహన్నిప్పుడు ఆపకు
మనసుపడ్డ గమకాన్ని పాడకుండా వెళ్ళకు
చంద్రకాంతపువ్వులా విరిసేందుకు నే సిద్ధం
కొన్ని పరిమళాలు దాచుకుంటానంటే నీ ఇష్టం..


//నీ పరిమళం..//




నీ పరిమళం నా ఊపిరిలో
కలిసినప్పటి సంగతి
మనసుకో కొత్త రుచి పరిచయమైనట్టు
లోపలి అరల్లో తెలియని అలజడి
నిదురపట్టని కన్నులకేమో
అరమోడ్పుల తాదాత్మ్యమది

విల్లుగా విరిసిన పెదవుల గులాబీలు
సోయగాలు వెదజల్లు తొలిఋతువు పువ్వులైనాక
నీలాకాశం దూరమని ఎవరన్నా అంటే
నేనొప్పుకోను
చందమామ చేతికందిన అందుభూతి
గుప్పెడు భావాలుగా గుమ్మరించి మరీ చెప్తాను
ఆనందాన్ని మించిన బ్రహ్మానందం
మన శ్వాసల సంగమంలోని సంగీతానిదని చెప్తాను..

మనసంతా పరుగులెత్తే సీతాకోకలు
కలనేత చీరలోని చేమంతిపువ్వులు
రహస్యంగా దాచుకున్న ప్రేమలేఖల
గుట్టు విప్పేస్తానిక..
మృదుభావ పులకరింపు పరిమళాలు రట్టయ్యేలా..

// అస్తిత్వం//


జీవన తృష్ణ కోల్పోదేమో పువ్వెప్పటికీ..
తన పరిమళమెప్పటికీ ప్రవహించేదేనని తెలిసి..
అస్తిత్వంపై ఎంత నమ్మకమో దానికి
ఎప్పుడూ నవ్వుతూనే ఆకర్షిస్తుందది..
సున్నితమైన సువాసన పరిసరాలకు పంచి
తనకున్న ప్రత్యేకతను ప్రసరిస్తుందది
తానుగా నిష్క్రమించేందుకూ సిద్ధమవుతుంది..
తన చరిత్ర రాసేందుకు మనమున్నామని నమ్మి..

//సామి రారా..//




మనసులు కలిసిన చతురస్రంలో
అటు నువ్వూ ఇటు నేనూ
ఒకే ఆకాశపందిరి క్రింద
నక్షత్రాలను తలంబ్రాలుగా తలపోసుకుందాం
ఊహలకు కొన్ని రంగులు దిద్ది
నిశ్శబ్ద భావాలకు భాషనిచ్చి
గుసగుసలుగా కలబోసుకుందాం

మంచు ముత్యాలు కలిసిన పూల పరిమళాల్లోని
తడిచినుకు చిలిపి తునకలు
పులకరింతలుగా మార్చి తొలకరించుకుందాం
వెన్నెల్లో చెలరేగిన మోహకలాపం
ఆలిగనంలో అంతం చేసి
గగనపు కొసన విహరించి వద్దాం
నీ రెప్పలచాటు చదివిన తపనలన్నీ
ప్రేమపాటగా బాణీ కట్టుంచుతా
రేయీపగలు తేడాలేని పారవశ్యంలో యుగళముగా పాడుకుందాం

ఇంకా ఎన్నాళ్ళని స్వప్న సుషుప్తిలో నిద్రపోతాం
కాలాన్నొక్కసారైనా ఆదమరపులో ఓడించి
అల్లరికన్నుల ఆనందభాష్పాల రుచిని
తనివితీరా తాగి మరీ తెలుసుకుందాం..

 

//వానొచ్చింది..//




కురుస్తోంది వాన
విషాదమో..ఆనందమో
తెలీనంత హోరుగా
రెప్పలమాటు కరిగిన స్వప్నం
నిశ్శబ్దానికి చీకటి రంగు అద్దినట్టు
మౌనానికి కదలికేదీ ఉండదు

నిదురలేచిన జ్ఞాపకాలన్నీ
ఒకేసారి మనసు తలుపు తడుతున్నప్పుడు
గుండెచప్పుడు చినుకుసవ్వడికి
పోటీ అవుతుంది

అధిగమించాలనుకున్న విషాదం
ఉండీ ఉండీ మెత్తగా కాటేసినట్టు
నరాల్లో అలజడి ప్రశాంతంతను చెడగొట్టి
అనుభూతులతో రమిస్తూ
భావాల్ని పొదిగేందుకు సిద్ధపడ్డప్పుడల్లా
ఏదో సవాలు విసురుతుంటుంది..

హృదిలో స్వరాల్ని సమాధి చేసి
అసంగతమైన స్మృతులు తోడి
వర్తమానాన్ని బావురుమనిపిస్తుంది
ఇప్పుడీ వాన వెలిసినా గుండెతడి మాత్రం ఆరదనిపిస్తుంది
అవును..
ఆనందం ఉన్నప్పుడు విషాదం తప్పకుండా ఉండి తీరుతుంది..!!

 

//ఏమో..//



వెన్నెల జారే నవమి రాతిరి కులుకనేమో
నక్షత్రాల్లా విరిసే ఆశల సరిగమలు

కలవరమై కదిలే హృదయస్పందనకేమో
పరిమళమై రేగే వలపు సుగంధాలు

ఊహలకు ఒదిలేసిన జన్మజన్మల తాపమేమో
కల్యాణిరాగపు సరస కిలికించితాలు

అలవాటైన కలల కౌగిలింతకేమో
నిదురను రమ్మనే నా అర్ధింపులు

చిరునవ్వాలనుకున్న తడి కన్నులేమో..
నీకు దూరమైన ఎర్రని మంకెనలు..

ఏమైందో తెలియదు కానీ
విస్మృతిలోనూ వీడని జ్ఞాపకాల వెల్లువలు
నిశ్శబ్దంలో అల్లుకున్న ఏకాంతపు తలపోతలు

కెరటాలుగా ఉప్పొంగుతున్న దుఃఖానికేమో
మనసు తీరం తడారక విలపిస్తూనే ఉందలా..

Wednesday, 12 September 2018

//జీవితంలో నిశ్శబ్దం..//



ఇంకేం కావాలి..
కొన్ని జ్ఞాపకాలు కేవలం నిష్కారణపు నవ్వులుగా మిగిలిపోయాక
తడిమి చూసుకునేందుకేమీ మిగలదు..

అస్తిత్వాన్ని గుర్తించని నలుగురి నడుమ
ఎంత ఒదిగినా ఆత్మశాంతి సిద్ధించదు..
నిన్న నేడు అయినప్పుడు ఉత్సాహలోపం
మానసిక స్పందనల్లో చంచలత్వం నింపాక
ఒంటరి భయమొకటి మొదలవుతుంది.

అనుభవాలు విషాదాలుగా మిగిలే వర్తమానంలో
భావాతీత ఉద్వేగాలు శాశ్వతంగా కరిగిపోయుంటాయి
పరాచికాలన్నీ పూర్తయ్యాక
అప్పటికి జీవితం చివరి అంకానికొస్తుంది
అనివార్యమైన నిశ్శబ్దానికి అదే ఆఖరి వాక్యంలా..


అంతులేని కల



ఎప్పటికీ ఏకమవని ఆలోచన
అయినా వీడిపోదని
కొంత కవిత్వాన్ని వెంటేసుకొని
నాతో రాయించేస్తావ్
నీకు నచ్చుతుందో లేదో అప్రస్తుతం
కానీ ఎప్పుడో ఒకప్పుడు
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చదువుకుంటావ్..

మనసులో మరుగుతూ
వేడిగా కదిలే రుధిరపు ఆనవాళ్ళు
కొన్ని రాత్రుల్లో నిదురను దూరం చేసే
సవ్వళ్ళుగా మారుతాయ్
నీకేమీ కాలేకపోయిన
ఈ బ్రతుకు పయనంలో
మృత్యువే గమ్యమని తెలిసొచ్చాక
క్షణాల కదలిక మందగిస్తుంది

రాత్రులకి శాపముందేమో తెలీదు
కానీ నాలో నిశ్శబ్దాన్ని రెచ్చగొట్టాలని చూసే చొరవుంది
అందుకే కలలు సైతం కనలేని
నేనో గొడ్రాలిని..:(


//నా పాట..//




ఒక్క మదిలో ఎన్ని ఆశలో ఎన్ని అందాలో..
ఆ నిశ్శబ్దంలోనూ ఎన్ని సన్నాయిలో
నీతో శృతిలో పడ్డ జీవితానికి
కొత్త పూల పరిమళం పరిచయించేదేముంది

ప్రతికలా మరో పుట్టుకైనట్టు..
ఎంత అనుభూతించినా తనివి తీరనట్టు
ఈ జన్మకైనా నిన్ను పొందాలనే పరితాపం
వేరే ప్రపంచమెందుకులేననిపిస్తుంది..

కలగలుపుకున్న ఆత్మ రంగుల్లో
అలలై ఎగిసిపడే నీ జ్ఞాపకాలు
నీటి బుడగల్లా పేలి మాయమవుతున్నా
సాధన చేసి ఆపుకున్న కన్నీటి చుక్కలై
ప్రేమనే పరావర్తనం చేస్తున్నాయి
నువ్వూ నేనూ వేరన్నది వట్టి మాట
తీసే ఊపిరికి తెలుసు ఒకరిలో ఒకరైన పాట..:)


//చంచల//




మనిషి నిజం..మనసు అబద్దం..
నవ్వింది నిజం..ఆనందించడం అబద్దం
గడియారం ముల్లును వెనక్కెలా తిప్పగలను
దాహమంటున్న మనసు వెక్కిళ్ళనెలా ఆపగలను
మాటలన్నీ మౌనంలో దాచుకుంటూ
విషాదాన్ని సహనంగా ఓర్చుకుంటూ
కవితలన్నీ స్వరాలుగా కూర్చుకుంటూ
నిముషాల్ని నిర్దయగా తరుముకుంటూ
నేనో చంచలితనై నటనలో ఆరితేరిపోతున్నా..
కానీ..
నన్ను నేను నిగ్రహించుకోలేక ఓడిపోతున్నా
ఎందుకిలా అనుకున్న ప్రతిసారీ
కొన్ని ప్రశ్నలకు జవాబులుండవన్న విధి
అరనవ్వులు రువ్వుతూ నొసలు ముడేస్తుంది
నన్ను మాత్రమిలా ఏకాకిలా జ్వలించమనేమో..:(

 

//అలజడి..//





నువ్వక్కడే..
కాలపు ప్రవాహంలో కొట్టుకుపోతూ
కొత్తపూల నెత్తావుకని
ఆవైపు ఆకర్షణ అన్వేషణలో..

నేనిక్కడే..
ఓ గొప్ప క్షణాన్ని
గుండెల్లో నింపుకొని
చెప్పుకోలేని బాధని అనుభవిస్తూ..

చందమామ చెట్టు కింద కూర్చుని
కలిసి చెప్పుకున్న కబుర్లు
గతంలోని అనుభవాలుగా
ఇప్పటి నా తప్పు ఒప్పులను
నిర్ణయిస్తాయని తెలీదు.

రమ్మని పిలుస్తున్న నా పరిమళం
నీ ఆత్మకి అందలేదంటే నమ్మలేను

నిదురలేక బరువెక్కిన కళ్ళు
విషాదాన్ని మోయలేనన్నప్పుడు
కన్నీరు ఆనందభాష్పమయ్యే రోజుందోలేదోనని కలవరం
నీదైన ఏకాంతం నా జ్ఞాపకాన్ని
మరుపులోనికి లాగుతుందేమోననే సందేహం..:(

//కురిసేను విరిజల్లులే..//



ముసురేసి మూణ్ణాళ్ళయింది..
కురవకుండానే మేఘమెందుకు కదిలిపోయిందో తెలీలేదు
కన్నులు నింపుకున్న కలలోని తీపి
ఆవిరయ్యిందనుకునేలోపు
ఒక్కో అమృతపు చినుకూ
మెత్తగా ఒలికింది
చిరునవ్వు అనివార్యమని
యధాలాపంగా చెప్తూ మట్టిగంధాన్ని పూయగానే
స్తబ్దుగా నిదురించిన మనసు కావ్యమయ్యింది..

చలి వీడకపోయినా ఇలానే బాగుంది
కొన్ని ఊహలు దిగులకొమ్మలనానుకొని ఊగుతున్నా
అనురాగాల పన్నీరు
"అక్కడ" కూడా ఊరుంటుందని..


//వెన్నెల రాత్రి..//



ఈ వెన్నెల
నాలో జీవనసారాన్ని నింపుతున్న వేళ
ఏకాంతం తలుపు తెరిచి
పున్నాగవరాళిలోని అదే పాటని
గుసగుసగా మొదలెట్టింది
గుండెలో సంగీతానికప్పుడో చలనమొచ్చి
తనువంతా పరిమళాన్ని మేల్కొలిపింది

బందీ చేయాలనుకున్న క్షణాలు
ఆనందంతో ప్రవహిస్తూ మలుపులు తిరుగుతున్నప్పుడు
రెప్పలమాటు మోదుగుపూలు ఎర్రగా నవ్వి
పూల ఋతువుని గుర్తు చేస్తున్నాయి

చిరునవ్వు పులకింతగా మొదలైనప్పుడు
చల్లగా ఒణుకుతున్న మనసు
వెచ్చదనాన్ని ఊహిస్తూ తాపాన్ని రచించమంది
మెల్ల మెల్లగా మోగుతున్న మోహం
అల్లిబిల్లి రంగుల ఊహగా విరబూసి
ఆషాడమేఘపు నీలి తుంపర్ల మధువు
నా దోసిలిలో నింపుతోందిలా..


//శివరంజని..//



కలలు తీరని రాతిరి నిశ్శబ్దం
శివరంజనిగా మొదలై
స్వరం తప్పిన మౌనంలా శూన్యాన్ని తలపిస్తున్నప్పుడు
నిస్తేజంగా మారిన చూపుల భావం
ఎంత చదివినా అర్ధంకానట్టు
ఏ పదమూ మనసుకి పట్టదు..

మనుషులు దగ్గరయ్యాక మాటలు దూరమై
దిగులు రంగులుగా మారడం
కంటికొసల్లో తడిగా మిగలడం
ప్రతి ఒక్కరి అనుభవాల్లోని మలుపేనేమో..

మురిపిస్తుందనుకున్న కాలం
నిరంతరానికి ప్రవహించే గమనమే అయినా
గుండెలోని తడి ఆవిర్లు బైటకి ఎగజిమ్ముతుంటే
వానెందుకు గుర్తొస్తుందో మరి
సంద్రం ఆపలేని అలలా విషాదం తీరాన్ని దాటుతుందేమో ఈ రాతిరి..:(

 

//లిప్స..//




వెండి కాంతులు వెలిగే నిశీధి నీలాకాశంతో
సమానమైన నాలుగు పదాలు
నా ఒంటరితనానికి పూసుకున్న ఎర్రగులాబీ పరిమళాలు అప్పుడు
కలగనకుండా ఎలా జరిగిందో
అనుకోకుండా మనసు తడిచిన
పూల సువాసన..
ఒక్క చూపుతో ముగిసిన శూన్యంలో
ఎన్ని జన్మల తర్వాతనో ఒకటయిన
నమ్మక తప్పని విస్మయం

కూడగట్టుకున్న తలపులన్నీ
నిన్ను కలసిన క్షణాలలోనే ఆగిపోతుంటే
రోజులు కదిలిపోతున్నా తెలియని అవ్యక్త పరవశం

అందనంత దూరాన నువ్వున్నావన్న బెంగను చెరిపిన నిరీక్షలో
నే మనసుపెట్టిన ప్రేమకావ్యపు మాధుర్యమంతా
నీదైనందుకే..
నక్షత్రం రాలినప్పుడల్లా కోరుకుంటున్నా
నే నిష్క్రమించినా
నీలో శబ్దించే ఊపిరెప్పటికీ నేనే అవ్వాలని..:)

 

కనిపించవా...



ఓయ్...నిన్నే ఎక్కడున్నావోయ్..
మనసులో దిగులు మాటల్లో పెడదామంటే పెదవి పలకనంటోంది
పదాలుగా పోగేసుకున్న మృదుభావం నిరాశలో ఆగిపోయింది
తీపి గురుతుల నీ గాలికబుర్లు నిశ్శబ్దాన్ని చెదరగొడుతున్నా కానీ
నిన్ను వెతికే తీరంలో అభిసారికనై నిలబడిపోయున్నా
నాకున్న భావాలు ఖచ్చితంగా నీకుండవని తెలిసినా
నీపై పిచ్చిలోని ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే నేనున్నా
కలలు కనాలంటే రెప్పల బరువు మోయలేనని..
ఊహలల్లోనే నిన్ను కలుసుకుంటున్నా

నా మానసికావసరం తెలిసికూడా నాతో దోబూచులాడటం
నీ సమక్షపు సౌరభాన్ని నాకు దూరం చేయడం..

ఇప్పుడీ కలతలో అక్షయమైన క్షణాలు
నీ రాకతో పరవశపు శ్వాసలవ్వాలి
అందుకే ఎదురుచూస్తూనే ఉన్నా
కాస్తాలశ్యమైనా నువ్వొస్తావని..


//గాయం//



నిన్నటిదాకా అలుపులేని అలవై నువ్వు ఎగిసిన తీరు
ఇప్పుడు నిర్లక్ష్యాన్ని విదిలించినట్లు అనిపిస్తుంటే
ఒట్టి చేతులతో నిలబడ్డ నేను
ప్రేమను అర్ధించలేక
దీక్షగా నీలో ఏకాకితనాన్ని పరికిస్తూ నిలిచున్నా

నీతో ముడిపడ్డ కొన్ని చిరునవ్వులు
నాలో శబ్దించనప్పుడు
అసంకల్పితమైన నిట్టూర్పులు
కన్నుల్లో నీలిరేవులకి దారినిస్తున్నా
ఊహల సరిహద్దుల్లోనే తచ్చాడుతూ
నీ మౌనతపస్సుకి పరిమళాన్ని జతచేస్తూనో
నిశ్శబ్దాన్ని చెడగొట్టే జ్ఞాపకముగానో
ఉండాలనుకున్నా గానీ..
మాటలకు సెలవిచ్చి
నీతో నువ్వేం విశ్రాంతి తీసుకుంటావోననే
ఆ దివ్యక్షణాలను నీకొదిలేస్తున్నా..

నా గాయాలు లెక్కబెట్టే రోజు నీకెప్పటికీ రానివ్వొద్దని..!!


//నిర్లిప్త స్వరం..//



ఎప్పటికప్పుడు జవాబు దొరకని ప్రశ్నలే అన్నీ
ఆశలు నడిపిస్తున్న జీవితంలో
అకస్మాత్తుగా అలముకొనే నిశ్శబ్దం
గుండెల్లో పగిలే నిర్లిప్త రసాయనం

జబ్బు చేసిన మనసుకి అన్నీ బరువైన క్షణాలే అయితే
కనుకొలుకుల్లో నిలిచే నీటిచుక్క
అది ఆనందమో విషాదమో తెలిసేదెందరికి
అనేక రంగుల్లో పరావర్తనం చెందుతుందది

ఊహలన్నీ దిగివచ్చి ఒక్కో రంగులో కొలువైనట్టు
భ్రమించిన తాదాత్మ్యం
ఒక్క అనుభవంతో పటాపంచలయ్యాక
కొన్నాళ్ళుగా ధ్యానిస్తున్న స్వప్నం చెదిరి
అశాంతికి ఆజ్యం పోసి
సర్వం కోల్పోయిన చరమ దృశ్యాన్ని
అదేపనిగా ప్రసారం చేసి అచేతనలో పడేస్తుంది

అంతులేని గాయాలు రేగుతూంటే
సెలవు తీసుకొనే సమయమెంతో దూరం లేదనిపించినప్పుడు
వాడిపోయేవరకూ నిరీక్షించకుండా
ఓడిపోయి రాలిపోయిందే నయమనిపిస్తుందప్పుడు..


ఎంత మందికి తెలుసు...



విషాదాన్ని వదిలించుకొని ఆనందాన్ని కౌగిలించుకున్న క్షణం..

మనసంతా గాయాలమయమైనా
బాధనోర్చుకుని ప్రతికూలాన్ని ప్రతిఘటించించినప్పుడు
తడికన్నులతో మెత్తగా నవ్వినట్టుంటుంది

నిశ్శబ్దాన్ని తవ్వి
కొన్ని అనుభూతులు తోడుకున్నాక
మౌనం కదిలిపోయి కొత్తస్వరాలకి చోటిచ్చినప్పుడు
కాలం విశాలమైనట్టుంటుంది

ఆశలు ఆకాశానికి పిలుపునిచ్చాకనే
మనసుతో సహజీవనం మొదలవుతుంది
నక్షత్రాలతో మాట్లాడినప్పుడు నమ్మకం నిజమై
రేపన్నది కలలో కనిపించి
మధూదయానికి చైతన్యమందిస్తుంది

శాంతించిన అలలతోనున్న సముద్రం మాదిరి
ఒక్క చిరునవ్వు పల్లవించగలిగితే
హృదయస్పందన రెట్టింపవుతుంది..


//కలత..//




మట్టిపూల వాసనతో అలజడవుతున్న మనసులో
తీరని ఈ గుబులెందుకో

శూన్యాన్ని తాగేసి సరిహద్దు దాటినట్టు
ఈ జీవితానికో నిర్వేదమంటి
పరవశాన్ని కాజేద్దామనుకున్న ప్రతిసారీ
కాలం కలిసిరాకపోతుంటే
జోలపాడకుండానే కలలకు నిద్దరొచ్చినట్టు
పుంతలు తొక్కకుండానే పులకరింత పోగులవుతుంది

ఏకాంత శిధిలాల్లో నేనున్నప్పుడు
గుండె గుచ్చుకునే నీ జ్ఞాపకం..
నన్ను తాకిన రంగుల సీతాకోకై
అనంతవెన్నెల్లోకి లాక్కెళ్తుంది
రెండుగుండెల దూరం దగ్గరై
నిద్రించిన శిల్పానికి వేకువైనట్టు
నీ స్పర్శతో నాలో మెలకువొస్తుంది
స్వరాలు వెల్లువైన చిలిపిసందడి
కమనీయపు గమకమై
కనుమబ్బుల్లో హరివిల్లును పూయిస్తుంది

నాలో మనమైన
శ్వాసలో కోరిక
ఊహల కౌగిలిలో తీరిపోయాక
యుగాల వేదనంత నిశ్శబ్దంగా
కురవని మేఘపు కలత
అలా కమ్ముకుంటుంది మరోసారి..:(

 

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *