నీ పరిమళం నా ఊపిరిలో
కలిసినప్పటి సంగతి
మనసుకో కొత్త రుచి పరిచయమైనట్టు
లోపలి అరల్లో తెలియని అలజడి
నిదురపట్టని కన్నులకేమో
అరమోడ్పుల తాదాత్మ్యమది
విల్లుగా విరిసిన పెదవుల గులాబీలు
సోయగాలు వెదజల్లు తొలిఋతువు పువ్వులైనాక
నీలాకాశం దూరమని ఎవరన్నా అంటే
నేనొప్పుకోను
చందమామ చేతికందిన అందుభూతి
గుప్పెడు భావాలుగా గుమ్మరించి మరీ చెప్తాను
ఆనందాన్ని మించిన బ్రహ్మానందం
మన శ్వాసల సంగమంలోని సంగీతానిదని చెప్తాను..
మనసంతా పరుగులెత్తే సీతాకోకలు
కలనేత చీరలోని చేమంతిపువ్వులు
రహస్యంగా దాచుకున్న ప్రేమలేఖల
గుట్టు విప్పేస్తానిక..
మృదుభావ పులకరింపు పరిమళాలు రట్టయ్యేలా..

No comments:
Post a Comment