వెన్నెల జారే నవమి రాతిరి కులుకనేమో
నక్షత్రాల్లా విరిసే ఆశల సరిగమలు
కలవరమై కదిలే హృదయస్పందనకేమో
పరిమళమై రేగే వలపు సుగంధాలు
ఊహలకు ఒదిలేసిన జన్మజన్మల తాపమేమో
కల్యాణిరాగపు సరస కిలికించితాలు
అలవాటైన కలల కౌగిలింతకేమో
నిదురను రమ్మనే నా అర్ధింపులు
చిరునవ్వాలనుకున్న తడి కన్నులేమో..
నీకు దూరమైన ఎర్రని మంకెనలు..
ఏమైందో తెలియదు కానీ
విస్మృతిలోనూ వీడని జ్ఞాపకాల వెల్లువలు
నిశ్శబ్దంలో అల్లుకున్న ఏకాంతపు తలపోతలు
కెరటాలుగా ఉప్పొంగుతున్న దుఃఖానికేమో
మనసు తీరం తడారక విలపిస్తూనే ఉందలా..

No comments:
Post a Comment