ఏ కవనమైతేనేం..
ఓ భావగీతం..
మనసాలపించే మంజుల నాదం..
ఏ భాషదైతేనేం..
ఓ ఆలోచనాపుష్పం
అనుభూతినందించు హృది పారవశ్యం
ఏ రీతినైతేనేం..
ఓ జీవన ప్రవాహం..
రాగరంజితమవు సుధామధురం..
ఎన్ని బాణీలు కట్టానో..
అలతి పదాలకి
ఎంత చీకటిని అనుభవించానో
కాస్త వెలుతురు కోసమని..
నువ్వు లేకుంటే ఏమయ్యేదో
భావుకత్వమంతా నీరవమై మిగిలేదో
జీవితమే శూన్యమైపోయేదో
ఆనందం బ్రహ్మత్వమై..ఆత్మలో మమేకమై
వెన్నులోకి తన్మయత్వం జారిందంటే
అది నీవల్లనే..
ఓ సంగీతమా..
నేనో ఒంటరిని కానని నిరంతరం నాలో ప్రవహిస్తూ
విషాదంలోనూ విరాగం ఉందంటూ
మాయని గాయానికి ఓదార్పు చిరునామా నువ్వు..
యుగాలనాటి గుండెసడికి నేస్తానివి నువ్వు..

No comments:
Post a Comment